Fits disease
-
చిన్నారిని కుదిపేసిన కాలం!
సాక్షి, ఆదిలాబాద్: మండల కేంద్రానికి చెందిన నరంశెట్టి ప్రకాష్, పల్లవి దంపతుల కూతరు ఆరాధ్య(ఎనిమిది నెలలు) ఫిట్స్‌తో మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... చిన్నారి ఆరాధ్య మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మంగళవారం రాత్రి ఫిట్స్ రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించారు. కొంచెం నయం కావడంతో ఇంటికి తీసుకొచ్చారు. నిర్మల్‌లోని చిన్నపిల్లల వైద్యులకు చూపించేందుకు బుధవారం తీసుకువెళ్లారు. నిర్మల్ చేరుకోగానే మళ్లీ ఫిట్స్ వచ్చింది. వైద్యులకు చూపించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. -
ప్రాణం పోతున్నా ఎవరూ పట్టించుకోరే?
కర్ణాటక: మైసూరులో రైలు ఎక్కిన ప్రయాణికునికి ఫిట్స్ (మూర్ఛ) వచ్చి కింద పడి గిలగిలాకొట్టుకున్నాడు. కానీ చికిత్స మాత్రం దొరకలేదు. చివరకు అభాగ్యుడు రైల్లోనే మరణించాడు. ఈ ఘటనలో రైల్వే అధికారుల నిర్లక్ష్యముందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైసూరు రైల్వేస్టేషన్లో నిర్లక్ష్యం ఫిట్స్‌తో గంట పాటు వృద్ధుని ప్రయాణం చికిత్స అందక కన్నుమూత వివరాలు.. మైసూరు రమాబాయి నగరకు చెందిన పి.స్వామి (83) అనే వృద్ధుడు బెంగళూరుకు వెళ్లేందుకు మైసూరు రైల్వేస్టేషన్లో ప్యాసింజర్ రైలు ఎక్కాడు. రైలు మైసూరు స్టేషన్లో కదలడానికి ముందే అతడు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. వెంటనే సహ ప్రయాణికులు ఈ సమాచారాన్ని రైల్వే పోలీసులకు తెలిపారు. రైల్వేస్టేషన్లో ఉన్న నర్సు వచ్చి పరీక్షించి ఏమీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత రైలు బయలుదేరి ముందుకు కదిలింది. మార్గమధ్యలో శ్రీరంగపట్టణ, పాండవపుర రైల్వేస్టేషన్లో అస్వస్థతకు గురైన స్వామిని చికిత్స కోసం పంపించకుండా రైల్వే పోలీసులు తాత్సారం చేశారు. దీంతో పాండవపుర రైల్వే స్టేషన్లో ప్రయాణికులు గొడవ చేశారు. అనంతరం చిక్కబ్యాడరహళ్లి రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకున్న తర్వాత రైల్వే సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో తోటి ప్రయాణికులు ఇక తమ గొడవను పెద్దగా చేశారు. ముందు వచ్చే యలియూరు రైల్వే స్టేషన్‌కు అంబులెన్స్ వస్తుందని, అప్పుడు స్వామిని తరలిస్తామని రైల్వే సిబ్బంది తెలిపారు. అయితే రైలు యలియూరు స్టేషన్‌కు వచ్చినప్పటికీ అక్కడ ఎలాంటి అంబులెన్స్ కనిపించలేదు. ఇదంతా జరిగి అప్పటికే గంట సమయం వృథా అయింది. దీంతో స్వామి రైలులోనే ఎంతో ఇబ్బంది పడుతూ మృతి చెందాడు. మండ్యలోనూ అదే తంతు మధ్యాహ్నం 3.40 గంటలకు మండ్య రైల్వే స్టేషన్‌కు రైలు వచ్చినప్పుడు పోలీసులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. పోలీసులపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రైల్వే పోలీసుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో చికిత్స లభించక స్వామి మరణించాడని ప్రయాణికులు ఆరోపించారు. తోటి ప్రయాణికుల సహాయంతో స్వామి మృతదేహాన్ని ఇతర ప్రయాణికులు రైలు నుంచి కిందకి దించి ప్లాట్‌ఫారమ్‌పై ఉంచారు. సుమారు 45 నిమిషాల పాటు మృతదేహం ప్లాట్‌ఫారమ్‌పైనే ఉంది. తరువాత మృతదేహాన్ని జిల్లాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి చొక్కాలోని ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అతడు మైసూరు రమాబాయినగర నివాసి అని గుర్తించారు. స్వామి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టమ్ నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. చికిత్స చేసి ఉంటే బతికేవాడు నేను పాండవపుర పోలీసు స్టేషన్లో రైలు ఎక్కాను.. ఒక ప్రయాణికుడు కుప్పకూలిపోయి ఇబ్బంది పడుతున్నాడు. స్టేషన్ పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం కలగలేదు. పోలీసుల హామీ మేరకు యలియూరు రైల్వే స్టేషన్లో ఎదురు చూసినా అంబులెన్స్ రాలేదు. మైసూరులోనే అంబులెన్స్ ఏర్పాటు చేసి చికిత్స అందించి ఉంటే బతికేవాడేమో.. అయితే పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఒక ప్రాణం పోయింది. –పుష్పలతా, రైలు ప్రయాణికురాలు, బెంగళూరు -
అప్పటిదాకా అక్క పెళ్లి వేడుకలో..
ఖమ్మం: బాజా భజంత్రీలు, బంధుమిత్రులతో సందడిగా ఉన్న పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. కుమార్తెకు అప్పగింతలు చేసి అత్తారింటికి పంపిన రోజునే తల్లిదండ్రులు కుమారుడికి దహన సంస్కారాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన టేకులపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కార్పెంటర్ వెనగంటి రవీంద్రాచారి, భవాని దంపతులకు కుమార్తె నవ్యశ్రీ, కుమారుడు రేవంత్(22) ఉన్నారు. రేవంత్ నాలుగేళ్ల వయసు వరకు ఆరోగ్యంగానే ఉండగా ఆతర్వాత కాళ్లల్లో గుజ్జు కరిగి నడవలేని స్థితికి చేరడమే కాక మానసిక అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యం చేయించినా నయం కాకపోవడంతో 22ఏళ్ల్లు వచ్చి నా చిన్న పిల్లల మనస్తత్వంతో ఉండేవాడు. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుండేవి. కాగా డిగ్రీ పూర్తి చేసిన రవీంద్రాచారి కుమార్తె నవ్యశ్రీకి నల్లగొండకు చెందిన యువకుడితో వివాహం కుదిర్చారు. శుక్రవారం ఉదయం 10.53 గంటలకు ముహూర్తం కాగా, బంధుమిత్రులతో ఇల్లు కళకళలాడుతోంది. ఇంతలోనే 9 గంటలకు రేవంత్ ఫిట్స్‌తో పడిపోయాడు. దీంతో తల్లిదండ్రులను పెళ్లి వద్దే ఉంచి ఇతర కుటుంబ సభ్యులు సులానగర్ పీహెచ్‌సీకి, అక్కడి నుంచి కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో మృతి చెందా డని ధ్రువీకరించారు. కాగా కుమారుడు చికిత్స పొందుతున్నాడని భావించి తల్లిదండ్రులు కూతురు వివాహం జరిపించి అప్పగింతలు చేసి అత్తారింటికి పంపారు. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో ఒక్కసారిగా గుండెలవిసేలా రోదించారు. కుమార్తెను కన్యాదానం చేసిన రోజునే కుమారుడికి అంత్యక్రియలు చేయా ల్సి వచ్చిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. -
బస్సు డ్రైవర్‌కు ఫిట్స్
శృంగవరపుకోట: బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు ఆకస్మికంగా ఫిట్స్ రావడంతో స్టీరింగ్‌పై పడిపోయాడు. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటిని, బాలుడిని ఢీకొట్టింది. బాలుడు మృతిచెందగా, ఇంటి వద్ద ఉన్న మరో మహిళకు గాయాలయ్యాయి. ఎస్.కోట ఆర్టీసీ డిపో నుంచి ఆదివారం ఉదయం విజయనగరం బయలుదేరిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ధర్మవరం శివారు మారుతీనగర్ మలుపు వద్దకు వచ్చేసరికి డ్రైవర్ గంగునాయుడుకు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది. డ్రైవర్ స్టీరింగ్‌పై పడిపోవడంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంటిపైకి దూసుకుపోయింది. ఇంటి ముందు ఉన్న బాలుడు శిరికి అభిషేక్ (12)ను, సమీపంలో వంట చేస్తున్న తొత్తడి పాపను ఢీకొట్టింది. అభిషేక్‌ను 108లో ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాపకు కూడా గాయాలయ్యాయి. -
ఫిట్స్‌గా పొరబడే హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్..
చాలామందిలో ఆందోళన (యాంగ్జైటీ ఉన్నప్పుడు) పానిక్ అటాక్స్కు కారణమయ్యే అంశాల్లో ‘హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్’ ఒకటి. హైపర్ వెంటిలేషన్ అంటే ఏమిటో చూద్దాం. కొందరు బాగా లోతుగా గాలి పీల్చుకుంటూ ఉంటారు. యాంగ్జైటీ సమయంలో లోతుగా, వేగంగా శ్వాసించడం వల్ల ఊపిరితిత్తుల్లోని కార్బన్ డైఆక్సైడ్‌ను ఎక్కువగా బయటకు వదులుతుంటారు. దాంతో దేహంలో కార్బన్‌డైఆక్సైడ్ శాతం తగ్గుతుంది. ఈ కండిషన్‌ను హైపోకాప్నియా అంటారు. ఇలా ఎక్కువగా గాలి పీల్చడం వల్ల జరిగే పరిణామాలను ‘హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్’ అంటారు. ఫలితంగా వారి ధమనుల్లో బైకార్పొనేట్ స్థాయులు పెరుగుతాయి. ఈ కండిషన్‌ను ఆల్కలోసిస్ అంటారు. ఇలాంటి కండిషన్స్‌లో పేషెంట్‌కు గుండెవేగం పెరుగుతుంది. శ్వాస తీసుకునే వేగం హెచ్చుతుంది. నిద్రమత్తుగా అనిపిస్తుంది. తేలికపాటి తలనొప్పి కూడా కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనిషి తాత్కాలికంగా స్పృహ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో రోగి కాళ్లూచేతులు బిగుసుకునిపోతాయి. దీన్నే ఒక్కోసారి ఫిట్స్‌గా అపోహపడుతుంటారు. అవి ఫిట్సా లేక హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ కారణంగా వచ్చిన ప్యానిక్ అటాకా అని నిర్ధారణ చేసుకునేందుకూ వెంటనే వైద్యులను సంప్రదించాలి. చదవండి: ‘రక్తపిశాచ’ జబ్బు.. దీని గురించి మీకు తెలుసా! -
నాలుగేళ్ల క్రితం వివాహం.. పురుగులమందు తాగిన వివాహిత
సాక్షి, బెజ్జంకి(మెదక్): పురుగులమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వివాహిత మృతిచెందింది. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని గుండారం గ్రామానికి చెందిన ఎలుకంటి గురువారెడ్డి, లక్ష్మీల కూతురు శిరిషను నాలుగేళ్ల క్రితం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన నాగెల్లి రజనీకాంత్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి కూతురు వినీక్ష ఉంది. ఆరు నెలల క్రితం రజనీకాంత్‌కు ఆస్ట్రేలియాలో ఉద్యోగం రావడంతో శిరీషను గుండారంలోని తల్లిగారింట్లో వదిలి వెళ్లాడు. పెళ్లికి ముందు నుంచి ఫిట్స్‌తో బాధపడుతున్న శిరీష తరచూ అనారోగ్యానికి గురవుతుండడంతో మనస్తాపం చెంది ఈనెల 6న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. చదవండి: Hyderabad: సెల్‌ఫోన్ చోరుల కొత్త పంథా -
విధి ఆ కుటుంబంపై పగ బట్టింది..
సాక్షి, దుబ్బాకటౌన్: విధి ఆ కుటుంబంపై పగ బట్టింది.. ఆ పేద కుటుంబం పూర్తిగా చిన్నాభిన్నమైంది.. అసలే కడు నిరుపేద చేనేత కుటుంబం.. పొద్దస్తమానం రెక్కలు ముక్కలు చేసుకుంటేగాని పూట గడవని దుర్భర పరిస్థితి.. అలాంటి దయనీయమైన స్థితుల్లో ఉన్న ఆ పేదకుటుంబంలో మూడు పదుల వయస్సులో ఉన్న పిల్లలు, తండ్రి మంచానికే పరిమితం కావడంతో వారికి అన్ని తానై చంటి పిల్లలకు చేసినట్లుగా ఆ తల్లి సేవ చేస్తోంది. ముగ్గురికి రోజంతా సపర్యలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది ఆ మాతృమూర్తి. దుబ్బాక పట్టణంలోని తుమ్మ శ్యామల, చంద్రమౌళి కుటుంబం ధీనగాథపై ప్రత్యేక కథనం. కడు నిరుపేద చేనేత కుటుంబం దుబ్బాక పట్టణానికి చెందిన తుమ్మ చంద్రమౌళి, శ్యామలది కడు నిరుపేద చేనేత కుటుంబం. వీరికి చిన్నపాటి ఇల్లు తప్పా ఇతర ఆస్తులు లేవు. తమ కులవృత్తి చేనేతనే నమ్ముకొంటే కనీసం కూడు కూడా దొరకకపోవడంతో బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవనం గడుపుతున్నారు. చంటి పిల్లల సేవ.. దుబ్బాక పట్టణానికి చెందిన తుమ్మ చంద్రమౌళి, శ్యామలది కడు నిరుపేద చేనేత కుటుంబం. వీరికి చిన్నపాటి ఇల్లు తప్పా ఇతర ఆస్తులు లేవు. తమ కులవృత్తి చేనేతనే నమ్ముకొంటే కనీసం కూడు కూడా దొరకకపోవడంతో బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవనం గడుపుతున్నారు. 30 ఏళ్ల వయస్సు ఉన్న కుమారుడు రాజు, 28 ఏళ్ల వయస్సు ఉన్న కూతురు భార్గవికి చిన్నప్పటి నుంచి తిండి తినిపించడం నుంచి మొదలు అన్ని సేవలు తల్లి శ్యామలనే చేస్తుంది. ఏడాది క్రితం భర్త చంద్రమౌళికి పక్షవాతం వచ్చి మంచాన పడటంతో ఆయనకు సపర్యలు చేస్తుంది. వయస్సులో ఉన్న పిల్లలు, భర్తకు స్నానాలు చేపించడం, బట్టలు వేయడం వంటి పనులు చేస్తూ వస్తోంది. ఫిడ్స్ వచ్చి కింద పడుతుండటంతో రోజూ వారిని లేపడం ఆ తల్లికి చాలా భారంతో కూడిన సమస్యగా తయారైంది. పిల్లలు, భర్తకు చంటిపిల్లల్ల చేస్తున్న సేవలు చూస్తుంటే ఎంతటి పగవాడికైనా ఈ కష్టం రావొద్దంటు కన్నీరుపెడుతారు. నాలుగేళ్ల వయసులో కూతురుకు.. పెద్ద కూతురు భార్గవి నాలుగేళ్ల వయస్సులో ఉన్న సమయంలో ఫిట్స్ వచ్చి పడిపోయింది. ఆమెకు రూ.3 లక్షల వరకు అప్పు చేసి కేర్ ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ చేపించినా ఫలితం లేకుండా పోయింది. ఆమెకు శరీరంలో ఒక పక్కకు చలనం లేని పరిస్థితి. చేయి, కాలు, నోరు పనిచేయవు. ఎప్పుడు ఫిట్స్ వచ్చి పడిపోతుందో తెలియని దయనీయమైన పరిస్థితి. 29 ఏళ్లుగా చంద్రమౌళి బీడీ పరిశ్రమలో పని చేస్తుండగా శ్యామల పిల్లలకు సపర్యలు చేసుకుంటూ వచి్చంది. ఈ క్రమంలో విధి ఆ కుటుంబంపై మళ్లీ పగబట్టినట్లుగా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న క్రమంలోనే చంద్రమౌళికి గతేడాది పక్షవాతం వచ్చి కుప్పకూలిపోయాడు. చంద్రమౌళికి ఆసుపత్రిలో చూపిద్దామన్నా ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో నామమాత్రం చికిత్స చేపించడంతో మంచానికే పరిమితమయ్యాడు. కొడుకుకు ఏడాది వయసులో.. చంద్రమౌళి, శ్యామలకు 35 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి రాజు(30), భార్గవి(28), భవ్య ముగ్గురు సంతానం. భార్యాభర్తలిద్దరు బీడీలు చుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న క్రమంలోనే కుమారుడు రాజు ఏడాది వయస్సు ఉండగానే ఫిడ్స్ వచ్చి కింద పడిపోయాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రాజును ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు నరాల బలహీనత అని చెప్పారు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. రాజుకు కళ్లు సరిగా కనిపించవు. మాటలు రావు. పూర్తిగా మెంటల్లీ వీక్ పేషెంట్. రోజుకు 20 సార్ల వరకు ఫిడ్స్వచ్చి పడిపోతుంటాడు. మందులకు కూడా ఇబ్బంది వృద్ధాప్యంలో తనకు సేవలు చేస్తారనుకున్న పిల్లలు, ఫోషించే భర్త మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబం పరిస్థితి కడుదయనీయంగా తయారైంది. పిల్లలకు వస్తున్న ఆసర పింఛన్ చెరో రూ.3 వేలు కలిపి రూ.6 వేలు, భర్తకు రూ.2 వేలు మొత్తం రూ.8 వేలతోనే ఎళ్లదీస్తోంది. ముగ్గురికి మందులకే నెలకు రూ.10 వేలు కావాల్సి వస్తుండటంతో రేషన్ దుకాణంలో వస్తున్న బియ్యం, మిగిలిన డబ్బులతో వచ్చినన్ని మందులు తెచ్చి వేయడం తప్పా మరేం చేయలేని గత్యంతరం ఏర్పడింది. మందులు సరిగ్గా వేయకుంటే పిల్లలు ఎక్కువ సార్లు ఫిడ్స్ వచ్చి కింద పడిపోతూ తీవ్ర గాయాలకు గురవుతున్నారు. ఇప్పటికే తెలిసిన వారు, బంధువుల వద్ద తెచ్చిన అప్పులు ఉండటంతో భయట అడేగేయలేని పరిస్థితితో మందులకు కూడా డబ్బులు లేక దినదిన గండంలా కాలం గడుపుతున్నారు. చిన్నకూతురు పెళ్లికి అండగా నిలిచిన ఎమ్మెల్యే ముగ్గురి సంతానంలో చిన్న కూతురు భవ్య ఆరోగ్యంగా ఉండటంతో ఆమెకు ఆరు నెలల క్రితమే వివాహం అయింది. ఈ కుటుంబం పరిస్థితిని చూసి చలించిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భవ్య పెళ్లికి అండగా నిలిచారు. ఎమ్మెల్యే చేయూతతో బంధువులు భవ్యకు వివాహం జరిపించారు. ఆదుకోండ్రి మా కుటుంబం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నా పిల్లలు, భర్త మంచానికే పరిమితమయ్యారు. కనీసం మందులు కూడా తెచ్చేందుకు నా వద్ద చిల్లి గవ్వలేదు. మందులు సరిగ్గా వాడకపోతుండటంతో నా పిల్లలు రోజుకు 20 సార్లకంటే ఎక్కువగా ఫిడ్స్వచ్చి పడిపోతుండ్రు. మా పరిస్థితి బాగాలేదు దయుంచి మానవతావాదులు మా కుటుంబాన్ని ఆదుకోవాలని చేతులెత్తి దండంపెట్టి వేడుకుంటున్నా. – శ్యామల -
మా అమ్మాయికి ఫిట్స్ అదుపులోకి వచ్చేదెలా?
నా కూతురి వయసు 18 ఏళ్లు. ఆమెకు గత మూడేళ్లుగా ఫిట్స్ వస్తున్నాయి. క్రమం తప్పకుండా ఆమెకు వాల్‌ప్రోయేట్ 300 ఎంజీ టాబ్లెట్లు రోజుకు రెండు ఇస్తున్నాం. అయినప్పటికీ ప్రతినెలా 1, 2 సార్లు ఫిట్స్ వస్తున్నాయి. ఆమెకు శాశ్వతంగా ఫిట్స్ రాకుండా ఉండటానికి ఏదైనా మార్గం ఉందా? – శాంతబాయ్, మెదక్ ఫిట్స్ కోసం మనం వాడే మందులు కేవలం ఫిట్స్‌ను నియంత్రిస్తాయంతే. ఫిట్స్‌ను పూర్తిగా నయం చేసే మందులు అంటూ లేవు. ఫిట్స్ రావడం అన్నది చాలా కారణాలతో జరుగుతుంది. ఎమ్మారై, పెట్–స్కాన్, వీడియో ఈఈజీ వంటి అనేక పరీక్షల సహాయంతో మెదడులోని ఏ నిర్ణీత భాగం నుంచి ఈ ఫిట్స్ వస్తున్నాయో తెలిస్తే, అలాంటి సందర్భాల్లో శస్త్రచికిత్స సహాయంతో ‘ఫిట్స్‌కు సెంటర్’ అయిన ఆ భాగాన్ని తొలగించడం ద్వారా, ఆ రోగులకు మాత్రం అసలెప్పుడూ ఫిట్స్ రాకుండా చేయవచ్చు. అయితే క్రమం తప్పకుండా చాలా మందులు వాడుతున్నప్పటికీ నెలలో ఒకటిరెండుసార్లు తప్పక ఫిట్స్ వస్తున్న పేషెంట్స్కే ఇలాంటి శస్త్రచికిత్స సిఫార్సు చేస్తారు. ఇక మీరు ప్రస్తావించిన వాల్‌ప్రోయేట్ విషయానికి వస్తే... అది యువకులకు మంచిదే అయితే యువతులు / మహిళల విషయంలో (ప్రధానంగా యుక్తవయస్కులైనవారిలో) ప్రభావపూర్వకంగా పనిచేయదు. పైగా స్థూలకాయం, రుతుక్రమంలో మార్పులు, జుట్టు రాలిపోవడం వంటి దుష్ప్రభావాలు చూపడంతో పాటు... ఒకవేళ వారికి గర్భం వస్తే పుట్టబోయే పిల్లల్లో అనేక లోపాలకు కూడా కారణమవుతుంది. కాబట్టి యువతులకూ, మహిళలకు దీన్ని వాడకూడదంటూ కొన్ని దేశాల్లో దీన్ని నిషేధం కూడా విధించారు. కాబట్టి మీరు మరోసారి మీ అమ్మాయికి చికిత్స చేస్తున్న న్యూరాలజిస్ట్‌ను కలిసి ఈ విషయాన్ని చర్చించండి. దాంతో ఆయన మీ అమ్మాయి మందును మారుస్తారు. ఇటీవల యువతులకు, మహిళలకు చాలా సురక్షితమైనవి, మంచివి అయిన లామోట్రైజీన్, లెవిటెరెసిలాన్, బ్రైవరాసెటమ్ వంటి కొత్త మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఏదైనా ఒక మందు వాడటం ద్వారానే ఫిట్స్‌పై 60 నుంచి 90 శాతం వరకు అదుపు సాధించవచ్చు. అయితే ఈ మందులు క్రమం తప్పకుండా, రోజూ అదే సమయానికి తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మీ డాక్టర్‌ను సంప్రదించండి. మీ అమ్మాయి విషయంలో మంచి మార్పు తప్పక కనిపిస్తుంది. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
మానవత్వం చాటుకున్న ఎస్సై
సాక్షి, కరీంనగర్: సమాజంలో పోలీసులు పాత్ర చాలా ముఖ్యమైనది. ఒకవైపు తన కుటుంబాన్ని చూసుకుంటూ, ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు. పోలీస్ కమిషనర్ స్థాపించిన టాస్క్ఫోర్సుకు చెందిన సిబ్బంది అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అంతేకాక వారి మానవత్వాన్ని కూడా చాటుకుంటున్నారు. శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా అనారోగ్యంతో రోడ్డుపై పడిపోయిన వారిని సైతం ఆదుకుంటున్నారు. అందుకు కరీంనగర్‌లోని ఎల్ఐసీ కార్యాలయం ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనం. కరీంనగర్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో సంతోష్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీ పొరుగు సేవల విభాగంలో పనిచేస్తున్న కందుకూరి పవన్ ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. కిందపడి కొట్టుకుంటున్నా అతని ఆ దారిన వెళ్లేవారెవరూ పట్టించుకోలేదు. అదే సమయంలో విధి నిర్వహణకు వెళ్తున్న ఎస్సై సంతోష్ అతడిని గమనించారు. హృదయం చలించి మానవత్వంతో వెంటనే 108కు ఫోన్ చేశారు. అతనే స్వయంగా అంబులెన్స్‌లోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనను అక్కడ చూసిన వారంతా మానవత్తాన్ని చాటుకున్న ఆ ఎస్సైని అభినందించారు. -
మూర్చ రోగమే మృత్యువయ్యింది!
నాగావళి నది ఒడ్డున ఫిట్స్వ్యాధితో పడిపోయిన యువకుడు సాయమందకపోవంతో అక్కడికక్కడే మృతి శ్రీకాకుళం సిటీ : మూర్చరోగమే ఓ యువకుడిపాలిట మృత్యువైంది. వేకువజామున నదీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో మూర్చవచ్చి పడిపోగా.. సాయమందించేవారెవ్వరూ లేకపోవడంతో అతడి ప్రాణం పోయింది. ఒకటో పట్టణ ఎస్ఐ చిన్నంనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. అరసవల్లి ఇందిరా విజ్ఞాన్‌భవన్ సమీపంలో పి. కోణారు(18) అనే యువకుడు తల్లిదండ్రులు అప్పన్న, జిడ్డోరులతో కలిసి నివసిస్తున్నాడు. కుటుంబంతో కలిసి స్క్రాప్ వస్తువులను సేకరిస్తు ఉంటాడు. అయితే చిన్నప్పటి నుంచి అతడు ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. బుధవారం వేకువజామున కూడా యథావిధిగా స్క్రాప్ వస్తువుల సేకరణకని గోనె సంచితో పట్టుకుని నాగావళి నదీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ హఠాత్తుగా ఫిట్స్ రావడంతో అక్కడడే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో కొద్దిసేపటికి మృతి చెందాడు. అటువైపుగా వెళ్లిన స్థానికు చూసి ‘100’కు ఫోన్ చేయగా తమకు సమాచారం అందిందని ఎస్ఐ తెలిపారు. కోణారుకు చిన్నప్పటి నుంచి మూర్చరోగం ఉందని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి అప్పన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నాడు.. రెండో కుమారుడు.. నేడు పెద్ద కొడుకు అప్పన్న దంపతులకు కోణారు పెద్ద కుమారుడు. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో రెండో కుమారుడు మృతిచెందాడు. ఈ దంపతులకు మరో ఇద్దరు కుమారులున్నారు. సంఘటన స్థలం వద్ద కోణారు మృతదేహాన్ని అతడి తల్లి ఒడిలో పెట్టుకుని రోదించిన తీరు చూపరులకు కంటతడిపెట్టించింది.