పిల్లలు, భర్తకు అన్నం తినిపిస్తున్న శ్యామల
సాక్షి, దుబ్బాకటౌన్: విధి ఆ కుటుంబంపై పగ బట్టింది.. ఆ పేద కుటుంబం పూర్తిగా చిన్నాభిన్నమైంది.. అసలే కడు నిరుపేద చేనేత కుటుంబం.. పొద్దస్తమానం రెక్కలు ముక్కలు చేసుకుంటేగాని పూట గడవని దుర్భర పరిస్థితి.. అలాంటి దయనీయమైన స్థితుల్లో ఉన్న ఆ పేదకుటుంబంలో మూడు పదుల వయస్సులో ఉన్న పిల్లలు, తండ్రి మంచానికే పరిమితం కావడంతో వారికి అన్ని తానై చంటి పిల్లలకు చేసినట్లుగా ఆ తల్లి సేవ చేస్తోంది. ముగ్గురికి రోజంతా సపర్యలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది ఆ మాతృమూర్తి. దుబ్బాక పట్టణంలోని తుమ్మ శ్యామల, చంద్రమౌళి కుటుంబం ధీనగాథపై ప్రత్యేక కథనం.
కడు నిరుపేద చేనేత కుటుంబం
దుబ్బాక పట్టణానికి చెందిన తుమ్మ చంద్రమౌళి, శ్యామలది కడు నిరుపేద చేనేత కుటుంబం. వీరికి చిన్నపాటి ఇల్లు తప్పా ఇతర ఆస్తులు లేవు. తమ కులవృత్తి చేనేతనే నమ్ముకొంటే కనీసం కూడు కూడా దొరకకపోవడంతో బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవనం గడుపుతున్నారు.
చంటి పిల్లల సేవ..
దుబ్బాక పట్టణానికి చెందిన తుమ్మ చంద్రమౌళి, శ్యామలది కడు నిరుపేద చేనేత కుటుంబం. వీరికి చిన్నపాటి ఇల్లు తప్పా ఇతర ఆస్తులు లేవు. తమ కులవృత్తి చేనేతనే నమ్ముకొంటే కనీసం కూడు కూడా దొరకకపోవడంతో బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవనం గడుపుతున్నారు. 30 ఏళ్ల వయస్సు ఉన్న కుమారుడు రాజు, 28 ఏళ్ల వయస్సు ఉన్న కూతురు భార్గవికి చిన్నప్పటి నుంచి తిండి తినిపించడం నుంచి మొదలు అన్ని సేవలు తల్లి శ్యామలనే చేస్తుంది. ఏడాది క్రితం భర్త చంద్రమౌళికి పక్షవాతం వచ్చి మంచాన పడటంతో ఆయనకు సపర్యలు చేస్తుంది.
వయస్సులో ఉన్న పిల్లలు, భర్తకు స్నానాలు చేపించడం, బట్టలు వేయడం వంటి పనులు చేస్తూ వస్తోంది. ఫిడ్స్ వచ్చి కింద పడుతుండటంతో రోజూ వారిని లేపడం ఆ తల్లికి చాలా భారంతో కూడిన సమస్యగా తయారైంది. పిల్లలు, భర్తకు చంటిపిల్లల్ల చేస్తున్న సేవలు చూస్తుంటే ఎంతటి పగవాడికైనా ఈ కష్టం రావొద్దంటు కన్నీరుపెడుతారు.
నాలుగేళ్ల వయసులో కూతురుకు..
పెద్ద కూతురు భార్గవి నాలుగేళ్ల వయస్సులో ఉన్న సమయంలో ఫిట్స్ వచ్చి పడిపోయింది. ఆమెకు రూ.3 లక్షల వరకు అప్పు చేసి కేర్ ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ చేపించినా ఫలితం లేకుండా పోయింది. ఆమెకు శరీరంలో ఒక పక్కకు చలనం లేని పరిస్థితి. చేయి, కాలు, నోరు పనిచేయవు. ఎప్పుడు ఫిట్స్ వచ్చి పడిపోతుందో తెలియని దయనీయమైన పరిస్థితి.
29 ఏళ్లుగా చంద్రమౌళి బీడీ పరిశ్రమలో పని చేస్తుండగా శ్యామల పిల్లలకు సపర్యలు చేసుకుంటూ వచి్చంది. ఈ క్రమంలో విధి ఆ కుటుంబంపై మళ్లీ పగబట్టినట్లుగా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న క్రమంలోనే చంద్రమౌళికి గతేడాది పక్షవాతం వచ్చి కుప్పకూలిపోయాడు. చంద్రమౌళికి ఆసుపత్రిలో చూపిద్దామన్నా ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో నామమాత్రం చికిత్స చేపించడంతో మంచానికే
పరిమితమయ్యాడు.
కొడుకుకు ఏడాది వయసులో..
చంద్రమౌళి, శ్యామలకు 35 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి రాజు(30), భార్గవి(28), భవ్య ముగ్గురు సంతానం. భార్యాభర్తలిద్దరు బీడీలు చుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న క్రమంలోనే కుమారుడు రాజు ఏడాది వయస్సు ఉండగానే ఫిడ్స్ వచ్చి కింద పడిపోయాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రాజును ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు నరాల బలహీనత అని చెప్పారు.
ఎన్ని మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. రాజుకు కళ్లు సరిగా కనిపించవు. మాటలు రావు. పూర్తిగా మెంటల్లీ వీక్ పేషెంట్. రోజుకు 20 సార్ల వరకు ఫిడ్స్‌వచ్చి పడిపోతుంటాడు.
మందులకు కూడా ఇబ్బంది
వృద్ధాప్యంలో తనకు సేవలు చేస్తారనుకున్న పిల్లలు, ఫోషించే భర్త మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబం పరిస్థితి కడుదయనీయంగా తయారైంది. పిల్లలకు వస్తున్న ఆసర పింఛన్ చెరో రూ.3 వేలు కలిపి రూ.6 వేలు, భర్తకు రూ.2 వేలు మొత్తం రూ.8 వేలతోనే ఎళ్లదీస్తోంది. ముగ్గురికి మందులకే నెలకు రూ.10 వేలు కావాల్సి వస్తుండటంతో రేషన్ దుకాణంలో వస్తున్న బియ్యం, మిగిలిన డబ్బులతో వచ్చినన్ని మందులు తెచ్చి వేయడం తప్పా మరేం చేయలేని గత్యంతరం ఏర్పడింది.
మందులు సరిగ్గా వేయకుంటే పిల్లలు ఎక్కువ సార్లు ఫిడ్స్ వచ్చి కింద పడిపోతూ తీవ్ర గాయాలకు గురవుతున్నారు. ఇప్పటికే తెలిసిన వారు, బంధువుల వద్ద తెచ్చిన అప్పులు ఉండటంతో భయట అడేగేయలేని పరిస్థితితో మందులకు కూడా డబ్బులు లేక దినదిన గండంలా కాలం గడుపుతున్నారు.
చిన్నకూతురు పెళ్లికి అండగా నిలిచిన ఎమ్మెల్యే
ముగ్గురి సంతానంలో చిన్న కూతురు భవ్య ఆరోగ్యంగా ఉండటంతో ఆమెకు ఆరు నెలల క్రితమే వివాహం అయింది. ఈ కుటుంబం పరిస్థితిని చూసి చలించిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భవ్య పెళ్లికి అండగా నిలిచారు. ఎమ్మెల్యే చేయూతతో బంధువులు భవ్యకు వివాహం జరిపించారు.
ఆదుకోండ్రి
మా కుటుంబం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నా పిల్లలు, భర్త మంచానికే పరిమితమయ్యారు. కనీసం మందులు కూడా తెచ్చేందుకు నా వద్ద చిల్లి గవ్వలేదు. మందులు సరిగ్గా వాడకపోతుండటంతో నా పిల్లలు రోజుకు 20 సార్లకంటే ఎక్కువగా ఫిడ్స్‌వచ్చి పడిపోతుండ్రు. మా పరిస్థితి బాగాలేదు దయుంచి మానవతావాదులు మా కుటుంబాన్ని ఆదుకోవాలని చేతులెత్తి దండంపెట్టి వేడుకుంటున్నా. – శ్యామల
Comments
Please login to add a commentAdd a comment