ఖమ్మం: బాజా భజంత్రీలు, బంధుమిత్రులతో సందడిగా ఉన్న పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. కుమార్తెకు అప్పగింతలు చేసి అత్తారింటికి పంపిన రోజునే తల్లిదండ్రులు కుమారుడికి దహన సంస్కారాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన టేకులపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కార్పెంటర్ వెనగంటి రవీంద్రాచారి, భవాని దంపతులకు కుమార్తె నవ్యశ్రీ, కుమారుడు రేవంత్(22) ఉన్నారు. రేవంత్ నాలుగేళ్ల వయసు వరకు ఆరోగ్యంగానే ఉండగా ఆతర్వాత కాళ్లల్లో గుజ్జు కరిగి నడవలేని స్థితికి చేరడమే కాక మానసిక అనారోగ్యానికి గురయ్యాడు.
వైద్యం చేయించినా నయం కాకపోవడంతో 22ఏళ్ల్లు వచ్చి నా చిన్న పిల్లల మనస్తత్వంతో ఉండేవాడు. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుండేవి. కాగా డిగ్రీ పూర్తి చేసిన రవీంద్రాచారి కుమార్తె నవ్యశ్రీకి నల్లగొండకు చెందిన యువకుడితో వివాహం కుదిర్చారు. శుక్రవారం ఉదయం 10.53 గంటలకు ముహూర్తం కాగా, బంధుమిత్రులతో ఇల్లు కళకళలాడుతోంది. ఇంతలోనే 9 గంటలకు రేవంత్ ఫిట్స్‌తో పడిపోయాడు. దీంతో తల్లిదండ్రులను పెళ్లి వద్దే ఉంచి ఇతర కుటుంబ సభ్యులు సులానగర్ పీహెచ్‌సీకి, అక్కడి నుంచి కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో మృతి చెందా డని ధ్రువీకరించారు.
కాగా కుమారుడు చికిత్స పొందుతున్నాడని భావించి తల్లిదండ్రులు కూతురు వివాహం జరిపించి అప్పగింతలు చేసి అత్తారింటికి పంపారు. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో ఒక్కసారిగా గుండెలవిసేలా రోదించారు. కుమార్తెను కన్యాదానం చేసిన రోజునే కుమారుడికి అంత్యక్రియలు చేయా ల్సి వచ్చిందని కన్నీరుమున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment