చలాన్లను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ సీఐ అశోక్
ఖమ్మంక్రైం: రహదారి నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు అటు రవాణా శాఖ, ఇటు ట్రాఫిక్ పోలీసులు జరిమానా చలానా విధించడం పరిపాటి. అయితే, ఈ చలాన్లను ఎప్పటికప్పుడు చెల్లించకపోతే తనిఖీల్లో దొరికినప్పుడు వాహనాన్ని సీజ్ చేసే అవకాశముంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో చలాన్లు పేరుకుపోయినట్లు గుర్తించిన ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలపై 80శాతం, కార్లు, ట్రాలీలు వంటి నాలుగు చక్రాలు, లారీలు, ఇతర భారీ వాహనాల పై 60శాతం రాయితీని ప్రకటించినా చెల్లించడంలో వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
కమిషనరేట్ పరిధిలో 9లక్షల చలాన్లు
ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో చాన్నాళ్లుగా చలాన్లు పేరుకుపోయాయి. ట్రాఫిక్ స్టేషన్లలో సిబ్బంది కొరత కారణంగా జరిమానా విధించడమే తప్ప వసూళ్లపై పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో చలాన్లు నానాటికీ పెరిగి 9లక్షలకు చేరాయి. వీటి చెల్లింపునకు ప్రభుత్వం భారీగా రాయితీ ప్రకటించినా వాహనదారుల నుంచి స్పందన రావడం లేదు. గతనెల 26వ తేదీ నుంచి రాయితీ అమల్లోకి రాగా బుధవారం నాటికి కేవలం 1,12,125 మంది మాత్రమే చలాన్లపై జరిమానా చెల్లించారు. వీటి ద్వారా రూ.70,13,485 ఆదాయం లభించింది. అంటే ఇంకా 7,87,875 పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, రాయితీ గడువు ఈనెల 10వ తేదీతో ముగియనున్నందున వాహనదారులు ముందుకు రావాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆతర్వాత తనిఖీల్లో దొరికితే వాహనాలు సీజ్ అవకాశముంది.
అవగాహన లేమితోనే..
నిత్యం వీవీఐపీలు, వీఐపీల బందోబస్తులో నిమగ్నమవుతున్నట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వం రాయితీ కల్పించిన అంశంపై వాహనదారులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. దీంతో కమిషనరేట్ పరిధి లోని 9లక్షల చలాన్లలో కనీసం 20శాతం కూడా చెల్లింపులు జరగలేదు. ఈనెల 10వ తేదీతో గడువు ముగియనన్న నేపథ్యాన ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా రాయితీపై అవగాహన కల్పించాల్సిన అవసరముంది.
సకాలంలో చెల్లించండి
ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్న వారు ఈనెల 10వ తేదీలోగా చెల్లించాలి. తద్వారా ప్రభుత్వం ప్రకటించిన రాయితీ వర్తిస్తుంది. మీ సేవ కేంద్రాల్లో లేదా ఆన్‌లైన్‌లో సొంతంగానూ చెల్లించవచ్చు. గడువులోగా చెల్లిస్తేనే రాయితీ వర్తిస్తుందనే విషయాన్ని వాహనదారులు గుర్తించాలి.
– అశోక్, ట్రాఫిక్ సీఐ
Comments
Please login to add a commentAdd a comment