కర్ణాటక: మైసూరులో రైలు ఎక్కిన ప్రయాణికునికి ఫిట్స్ (మూర్ఛ) వచ్చి కింద పడి గిలగిలాకొట్టుకున్నాడు. కానీ చికిత్స మాత్రం దొరకలేదు. చివరకు అభాగ్యుడు రైల్లోనే మరణించాడు. ఈ ఘటనలో రైల్వే అధికారుల నిర్లక్ష్యముందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మైసూరు రైల్వేస్టేషన్‌లో నిర్లక్ష్యం
ఫిట్స్‌తో గంట పాటు వృద్ధుని ప్రయాణం
చికిత్స అందక కన్నుమూత
వివరాలు.. మైసూరు రమాబాయి నగరకు చెందిన పి.స్వామి (83) అనే వృద్ధుడు బెంగళూరుకు వెళ్లేందుకు మైసూరు రైల్వేస్టేషన్‌లో ప్యాసింజర్ రైలు ఎక్కాడు. రైలు మైసూరు స్టేషన్‌లో కదలడానికి ముందే అతడు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. వెంటనే సహ ప్రయాణికులు ఈ సమాచారాన్ని రైల్వే పోలీసులకు తెలిపారు. రైల్వేస్టేషన్‌లో ఉన్న నర్సు వచ్చి పరీక్షించి ఏమీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత రైలు బయలుదేరి ముందుకు కదిలింది. మార్గమధ్యలో శ్రీరంగపట్టణ, పాండవపుర రైల్వేస్టేషన్‌లో అస్వస్థతకు గురైన స్వామిని చికిత్స కోసం పంపించకుండా రైల్వే పోలీసులు తాత్సారం చేశారు.
దీంతో పాండవపుర రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు గొడవ చేశారు. అనంతరం చిక్కబ్యాడరహళ్లి రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకున్న తర్వాత రైల్వే సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో తోటి ప్రయాణికులు ఇక తమ గొడవను పెద్దగా చేశారు. ముందు వచ్చే యలియూరు రైల్వే స్టేషన్‌కు అంబులెన్స్ వస్తుందని, అప్పుడు స్వామిని తరలిస్తామని రైల్వే సిబ్బంది తెలిపారు. అయితే రైలు యలియూరు స్టేషన్‌కు వచ్చినప్పటికీ అక్కడ ఎలాంటి అంబులెన్స్ కనిపించలేదు. ఇదంతా జరిగి అప్పటికే గంట సమయం వృథా అయింది. దీంతో స్వామి రైలులోనే ఎంతో ఇబ్బంది పడుతూ మృతి చెందాడు.
మండ్యలోనూ అదే తంతు
మధ్యాహ్నం 3.40 గంటలకు మండ్య రైల్వే స్టేషన్‌కు రైలు వచ్చినప్పుడు పోలీసులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. పోలీసులపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రైల్వే పోలీసుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో చికిత్స లభించక స్వామి మరణించాడని ప్రయాణికులు ఆరోపించారు. తోటి ప్రయాణికుల సహాయంతో స్వామి మృతదేహాన్ని ఇతర ప్రయాణికులు రైలు నుంచి కిందకి దించి ప్లాట్‌ఫారమ్‌పై ఉంచారు. సుమారు 45 నిమిషాల పాటు మృతదేహం ప్లాట్‌ఫారమ్‌పైనే ఉంది. తరువాత మృతదేహాన్ని జిల్లాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి చొక్కాలోని ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అతడు మైసూరు రమాబాయినగర నివాసి అని గుర్తించారు. స్వామి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టమ్ నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
చికిత్స చేసి ఉంటే బతికేవాడు
నేను పాండవపుర పోలీసు స్టేషన్‌లో రైలు ఎక్కాను.. ఒక ప్రయాణికుడు కుప్పకూలిపోయి ఇబ్బంది పడుతున్నాడు. స్టేషన్ పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం కలగలేదు. పోలీసుల హామీ మేరకు యలియూరు రైల్వే స్టేషన్‌లో ఎదురు చూసినా అంబులెన్స్ రాలేదు. మైసూరులోనే అంబులెన్స్ ఏర్పాటు చేసి చికిత్స అందించి ఉంటే బతికేవాడేమో.. అయితే పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఒక ప్రాణం పోయింది. –పుష్పలతా, రైలు ప్రయాణికురాలు, బెంగళూరు
Comments
Please login to add a commentAdd a comment