నిమిషమాగితే ఇంటికి..
ఇంటికి సమీపంలోనే దుర్మరణం
పాలైన పదో తరగతి విద్యార్థి
మోపెడ్‌ను లారీ ఢీకొనడంతో దుర్ఘటన
ఇద్దరు యువకులను
బలిగొన్న మృత్యుశకటం
ఒక్క నిమిషం ఆగితే ఆ విద్యార్థి ఇంటికి వెళ్లిపోతాడు. ఈలోగానే మృత్యువు లారీ రూపంలో వచ్చి అతనితో పాటు, అతనకు లిప్ట్ ఇచ్చిన యువకుడిని కబళించింది. పదో తరగతి పరీక్ష రాసి ఇంటికి వస్తాడని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు తీరాన్ని శోకాన్ని మిగిల్చింది. ఔరంగబాద్ సమీపంలోని వెదుళ్లమ్మ ఆలయ సమీపంలో టీవీఎస్ మోపెడ్‌ను లారీ ఢీకొట్టిన దుర్ఘటనలో గురువారం ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఔరంగబాద్ కి చెందిన మట్టా దుర్గాప్రసాద్(17) అనే యువకుడు వాడపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రంలో భౌతికశాస్త్రం పరీక్ష రాసి తిరుగు ప్రయాణంలో పెనకనమెట్టకి చెందిన తాడి రమేష్(22) టీవీఎస్ మోపెడ్‌పై లిప్టు అడిగి ఎక్కాడు. ఔరంగబాద్ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడడంతో మోటారు సైకిల్ నడుపుతున్న రమేష్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనుక కూర్చున్న దుర్గాప్రసాద్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆటోలో రాజమండ్రి ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే మృతుడు ప్రసాద్ స్వగృహం ఉంది.
మరో నిమిషంలోనే ఇంటి చే రతాడనుకున్న సమయంలో ప్రమాదానికి గురికావడంతో కుటుంబ సభ్యుల దుఃఖం కట్టలు తెచ్చుకుంది. ప్రసాద్‌కి సోదరుడు ఉన్నాడు. ఇక తాపీ పనిచేసుకుంటూ జీవనం సాగించే రమేష్ వాడపల్లిలో పని ముగించుకుని స్వగ్రామైమైన పెనకనమెట్ట బయల్దేరాడు. మార్గ మధ్యలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. పట్టణ ఎస్సై ఎస్‌ఎస్‌ఎస్ పవన్‌కుమార్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు.