సోంపేట: జాతీయ రహదారిపై ఉన్న అడ్డదారి తమ జీవనాధారాన్ని దూరం చేస్తుందని ఆ కుటుంబ సభ్యులు ఊహించుకోలేకపోయారు. ఒక్క నిమిషంలో ఇంటికి చేరుకోబోతుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఆ ఇంటి దీపం ఆరిపోయింది. కళ్లముందు జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబానికి తీవ్ర శోకం మిగిల్చింది. జాతీయ రహదారిపై కొర్లాం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రత్నాల మోహనరావు(45) మృతి చెందగా, బెహరా చరణ్‌కు తీవ్రగాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి బారువ పోలీసులు, కొర్లాం గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో కొర్లాం గ్రామంలో జాతీయ రహదారికి ఆనుకుని రత్నాల మోహనరావు ఇల్లు కట్టుకుని నివసిస్తున్నాడు. వారి ఇంటి నుంచి పలాస వైపు వెళ్లడానికి జాతీయ రహదారి మధ్యలో చిన్న తోవ ఉంది. ఆ తోవే అతని పాలిట మృత్యుదారి అయింది.
రత్నాల మోహనరావుకు చెందిన షెడ్‌లో గొల్లవూరు గ్రామానికి చెందిన బెహరా చరణ్(20) మెకానిక్ షాపు పెట్టుకుని జీవనాధారం పొందుతున్నాడు. మోహనరావు, చరణ్ ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై పనులు నిమిత్తం శుక్రవారం ఉదయం పలాస వెళ్లారు. పలాస నుంచి తిరిగి వస్తూ, వారు జాతీయ రహదారిపై ఉన్న అడ్డదారిలో రత్నాల మోహనరావు ఇంటికి చేరుకోబోతుండగా ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళుతున్న కారు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న మోహనరావుకు, చరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటీన 108లో బారువ సామాజిక ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మోహనరావును బరంపురం, చరణ్‌ను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మోహనరావు బరంపురం వెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
దీంతో కొర్లాం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మోహనరావుకు భార్య అరుణ, కుమారుడు మధు(22), కుమార్తె హారిత(19) ఉన్నారు. మోహనరావు మృతితో వారు తీవ్రంగా రోదిస్తున్నారు. చరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయని తెలియడంతో అతని తల్లి ఊర్మిల తీవ్రంగా రోదిస్తుంది. చరణ్ ప్రస్తుతం శ్రీకాకుళంలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నట్టు గొల్లవూరు గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment