అయ్యో బిడ్డా..
లావేరు: తమ బంధువుకు చెందిన గేదెలు లారీ ఢీకొని మృతి చెందాయని తెలిసి ఆ యువకుడు బాధపడ్డాడు. పరామర్శించి వద్దామని బయలుదేరాడు. మరికొద్ది సేపట్లో అక్కడకు చేరిపోతాడు. అయితే ఇంతలోనే మృత్యువు ముంచుకొచ్చింది. కారు రూపంలో కాటేసింది. ఓ కుటుంబానికి ఒక్కగానొక్క మగబిడ్డను దూరం చేసింది. లావేరు మండలంలోని బెజ్జిపురం గ్రామానికి చెందిన గొర్లె రాములు అనే రైతుకు చెందిన మూడు గేదెలు ఆదివారం సాయంత్రం బెజ్జిపురం కూడలి వద్ద జాతీయ రహదారిపై లారీ ఢీకొని మృతి చెందాయి. మరో రెండు గాయపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న లావేరు మండలంలోని నాగంపాలెంకు చెందిన రాములు బంధువు గొర్లె కృష్ణ (24) రాములును పరామర్శించడానికి బెజ్జిపురం ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు.
బెజ్జిపురం కూడలి వద్ద గ్రామంలోకి వెళ్లేందుకు జాతీయరహదారిని దాటుతున్నాడు. ఈ సమయంలో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు స్పీడుగా వెళుతున్న కారు బలంగా ఢీకొంది. దీంతో కృష్ణ ద్విచక్ర వాహనంతో ఎత్తుకు ఎగిరి జాతీయరహదారి మధ్యలో పడ్డాడు. అతని తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం జరిగి సంఘటనా స్థలంలోనే మృతి చెండాడు. కారు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. ఎస్‌ఐ అప్పారావు, హెచ్‌సీ రాంబాబులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాద వివరాలును సేకరించారు. రణస్థలంలో కారును పట్టుకున్నారు. తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేశారు.
కన్నీరుమున్నీరు..: కృష్ణ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. కృష్ణ ఒక్కగానొక్క కొడుకు. ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఆ కుటుంబానికి కృష్ణే పెద్దదిక్కు. కొడుకుకు ఈ ఏడాది వివాహం చేయాలని తల్లి సత్యవతి చూస్తోంది. ఇంతలోనే దారుణం జరిగిపోయింది. మృతుని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి వచ్చి బోరున విలపించారు. పరామర్శకు వచ్చిన తన కొడుకు తిరిగి ఇంటికి వస్తాడని అనుకున్నాను గాని తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతాడని అనుకోలేదని గుండెలు బాదుకుంటూ ఆ తల్లి ఏడుస్తోంది.