one people died
-
ప్రాణం తీసిన రోడ్డు రోలర్
జియ్యమ్మవలస: లారీపై తరలిస్తున్న రోడ్డు రోలర్ పరోక్షంగా ఒకరి ప్రాణాన్ని బలిగొంది. మండలంలోని బీజే పురంలో మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తుంబలి నుంచి గెడ్డ సింగుపురం వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల కోసం ఓ రోడ్డు రోలరును చినమేరంగి నుంచి జియ్యమ్మవలస వైపు లారీపై తరలిస్తుండగా విద్యుత్ వైర్లు అడ్డుతగిలాయి. లారీని డ్రైవర్ ఆపకపోవటంతో రోడ్డురోలర్ వైర్లను ఈడ్చుకెళ్లింది. దీంతో ఆరు స్తంభాలు విరిగిపడ్డాయి. వీటిలో ఒక స్తంభం బీజేపురంలోని ఎస్సీ వీధిలో మంచంపై నిద్రిస్తున్న కోమటిపల్లి అప్పలస్వామి(47)పై పడింది. తీవ్రంగా గాయపడిన అతడిని 108 వాహనంలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్టు నీలకంఠాపురం ఎస్సై, జియ్యమ్మవలస ఇన్చార్జి ఎస్సై షేక్ ఫకృద్దీన్ తెలిపారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవటంతో పెను ముప్పు తప్పింది. అప్పలస్వామి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడినికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆడపిల్లలకు వివాహాలు జరగ్గా కుమారుడు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యో బిడ్డా..
లావేరు: తమ బంధువుకు చెందిన గేదెలు లారీ ఢీకొని మృతి చెందాయని తెలిసి ఆ యువకుడు బాధపడ్డాడు. పరామర్శించి వద్దామని బయలుదేరాడు. మరికొద్ది సేపట్లో అక్కడకు చేరిపోతాడు. అయితే ఇంతలోనే మృత్యువు ముంచుకొచ్చింది. కారు రూపంలో కాటేసింది. ఓ కుటుంబానికి ఒక్కగానొక్క మగబిడ్డను దూరం చేసింది. లావేరు మండలంలోని బెజ్జిపురం గ్రామానికి చెందిన గొర్లె రాములు అనే రైతుకు చెందిన మూడు గేదెలు ఆదివారం సాయంత్రం బెజ్జిపురం కూడలి వద్ద జాతీయ రహదారిపై లారీ ఢీకొని మృతి చెందాయి. మరో రెండు గాయపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న లావేరు మండలంలోని నాగంపాలెంకు చెందిన రాములు బంధువు గొర్లె కృష్ణ (24) రాములును పరామర్శించడానికి బెజ్జిపురం ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. బెజ్జిపురం కూడలి వద్ద గ్రామంలోకి వెళ్లేందుకు జాతీయరహదారిని దాటుతున్నాడు. ఈ సమయంలో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు స్పీడుగా వెళుతున్న కారు బలంగా ఢీకొంది. దీంతో కృష్ణ ద్విచక్ర వాహనంతో ఎత్తుకు ఎగిరి జాతీయరహదారి మధ్యలో పడ్డాడు. అతని తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం జరిగి సంఘటనా స్థలంలోనే మృతి చెండాడు. కారు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. ఎస్ఐ అప్పారావు, హెచ్‌సీ రాంబాబులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాద వివరాలును సేకరించారు. రణస్థలంలో కారును పట్టుకున్నారు. తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేశారు. కన్నీరుమున్నీరు..: కృష్ణ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. కృష్ణ ఒక్కగానొక్క కొడుకు. ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఆ కుటుంబానికి కృష్ణే పెద్దదిక్కు. కొడుకుకు ఈ ఏడాది వివాహం చేయాలని తల్లి సత్యవతి చూస్తోంది. ఇంతలోనే దారుణం జరిగిపోయింది. మృతుని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి వచ్చి బోరున విలపించారు. పరామర్శకు వచ్చిన తన కొడుకు తిరిగి ఇంటికి వస్తాడని అనుకున్నాను గాని తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతాడని అనుకోలేదని గుండెలు బాదుకుంటూ ఆ తల్లి ఏడుస్తోంది. -
వాహనం ఢీ - ఒకరి మృతి
బొండపల్లి, న్యూస్‌లైన్ : పొట్ట కూటి కోసం ఊరూరూ సైకిల్‌పై తిరుగుతూ టిఫిన్ అమ్ముకుని జీవనం సాగించే ఓ వ్యక్తిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటాడనగా.. టాటాఏస్ వాహనం పొట్టనబెట్టుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా గాయాలపాలయ్యారు. మండలంలోని గొట్లాం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గొట్లాం గ్రామానికి చెందిన పసుమర్తి త్రినాథ(50) సమీప గ్రామాలకు సైకిల్‌పై టిఫిన్ తీసుకెళ్లి, అమ్ముతూ జీవనం సాగించేవాడు. రోజూ మాది రిగానే ఆదివారం జియ్యన్నవలస గ్రామంలో టిఫిన్ అమ్ముకుని తిరిగి స్వగ్రామం గొట్లాం వైపు సైకిల్ నడిపించుకుని వస్తుండగా.. జాతీయ రహదారిపై ఒడిశా నుంచి విజయనగరం వైపు అతివేగంగా వస్తున్న టాటాఏస్ వాహనం బలంగా ఢీకొంది. దీంతో త్రినాథ కొంతదూరం ఎగిరిపడ్డాడు. తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. త్రినాథను ఢీకొన్న అనంతరం అదే వాహనం అటుగా చెరువు నుంచి వస్తున్న గొట్లాం గ్రామానికి చెందిన చింతపల్లి నారాయణరావు, ఓల్ల సత్యంను ఢీకొంది. ఈ ఘటన లో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని బొండపల్లి పోలీసులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మృతుడు త్రినాథకు భార్యతోపాటు, వివాహమైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.సంఘటన స్థలం వద్ద కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడివారిని కలిచివేసింది. ప్రమాద ఘటనపై ట్రెనీ ఎస్సై అశోక్‌కుమార్, ఏఎస్సై శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.