జియ్యమ్మవలస: లారీపై తరలిస్తున్న రోడ్డు రోలర్ పరోక్షంగా ఒకరి ప్రాణాన్ని బలిగొంది. మండలంలోని బీజే పురంలో మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తుంబలి నుంచి గెడ్డ సింగుపురం వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల కోసం ఓ రోడ్డు రోలరును చినమేరంగి నుంచి జియ్యమ్మవలస వైపు లారీపై తరలిస్తుండగా విద్యుత్ వైర్లు అడ్డుతగిలాయి. లారీని డ్రైవర్ ఆపకపోవటంతో రోడ్డురోలర్ వైర్లను ఈడ్చుకెళ్లింది. దీంతో ఆరు స్తంభాలు విరిగిపడ్డాయి. వీటిలో ఒక స్తంభం బీజేపురంలోని ఎస్సీ వీధిలో మంచంపై నిద్రిస్తున్న కోమటిపల్లి అప్పలస్వామి(47)పై పడింది.
తీవ్రంగా గాయపడిన అతడిని 108 వాహనంలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్టు నీలకంఠాపురం ఎస్సై, జియ్యమ్మవలస ఇన్‌చార్జి ఎస్సై షేక్ ఫకృద్దీన్ తెలిపారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవటంతో పెను ముప్పు తప్పింది. అప్పలస్వామి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడినికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆడపిల్లలకు వివాహాలు జరగ్గా కుమారుడు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణం తీసిన రోడ్డు రోలర్
Published Wed, Jul 8 2015 12:42 AM | Last Updated on Thu, Aug 30 2018 3:51 PM
Advertisement
Advertisement