మహిళల శస్త్రచికిత్సల వార్డులో ఉన్న నర్సింగ్ విద్యార్థి
పెద్దాస్పత్రిని నమ్ముకుని చాలా మంది పేదలు జిల్లా మొత్తం నుంచి వైద్యం కోసం వస్తుంటారు. వారందరికీ సేవలు అందించాల్సిన బాధ్యత ఆస్పత్రిదే. సిబ్బంది అరకొరగా ఉండడంతో రాత్రయితే నర్సులు లేక రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. సుమారు 70 మంది రోగులకు ఒక్కరే నర్సు ఉండడం.. అందరికీ ఆమె సేవలు అందించలేకపోవడంతో పేషంట్ల అవస్థలు వర్ణనాతీతం..
విజయనగరం ఫోర్ట్: రెండు వార్డుల్లో సుమారు 60 నుంచి 70 మంది రోగులు ఉంటారు. రాత్రి వేళ ఒకే స్టాఫ్ నర్సు ఉండడంతో వారందరికి సేవలు అందించడం ఆమె ఒక్కర్తికే భారంగా ఉంటుంది. ఒక వార్డులో సేవలు అందిస్తున్న సమయంలో మరోవార్డులో అత్యవసరం అయితే పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు వార్డులకు ఒకే స్టాఫ్ నర్సు: ఒక్కో వార్డులో 28 నుంచి 35 మంది వరకు రోగులు ఉంటారు. నిబంధన ప్రకారం 15 మంది రోగులకు ఒక స్టాఫ్ నర్సు ఉండాలి. పోనీ ఒక వార్డుకు ఒక స్టాప్ నర్సు ఉన్నా కాస్త ఊరటగా ఉంటుంది. రాత్రి వేళ రెండు వార్డులకు ఒక స్టాఫ్ నర్సు ఉండడం వల్ల వైద్య సేవలు సకాలంలో అందక రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
స్టాఫ్‌నర్సుల సంఖ్య పెంచాల్సి ఉంది..
జిల్లాలో అతిపెద్ద ఆస్పత్రి కావడంతో రోగులు అధికంగా వస్తారు. అదే స్థాయిలో సిబ్బంది కూడా ఉండాలి. వార్డుకు ముగ్గురు స్టాఫ్ నర్సులు చొప్పన ప్రతి సిఫ్టుకూ విధుల్లో ఉండాల్సిన అవసరం ఉంది. అలా అయితే సేవలు సకాలంలో రోగులకు అందుతాయి. ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుల సంఖ్య పెంచాల్సి ఉంది.
రాత్రి అయితే ఒక్క నర్సే..
రాత్రి వేలలో కేంద్రాస్పత్రి అధికారులు రెండు వార్డులకు ఒకే స్టాఫ్ నర్సును ఉంచుతున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో రోగులు ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్థితి. ఒకే నర్సు ఉండడం వల్ల సేవలు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇది ఒక్కోసారి రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది.
ఎన్ని వార్డులున్నాయంటే...
కేంద్రాస్పత్రిలో ఎమర్జన్సీ, ఆరోగ్యశ్రీ, పేవార్డు, పిల్లల వార్డు, మహిళల ఫీవర్ వార్డు, శస్త్రచికిత్సల వార్డు, పురుషుల మెడికల్ వార్డు, శస్త్రచికిత్సల వార్డు, టీడీ వార్డు, బర్నంగ్ వార్డు ఉన్నాయి. వీటన్నింటికీ సరిపడా సిబ్బంది కావాలి.
గుండెనొప్పితో బెడ్‌పై ఇబ్బంది పడుతున్న శాంతి
ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు శాంతి. ఈమెది పట్టణంలోని రెల్లి వీధి. శనివారం ఉదయం జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వస్తే వైద్యులు ఇన్‌పేషేంట్‌గా ఫీవర్ వార్డులో జాయిన్ చేశారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆమెకు గుండెనొప్పి రావడంతో బెడ్‌పై ఉండలేక నరకయాతన అనుభవించింది. ఈ విషయాన్ని సహాయకులుగా వచ్చిన వారు స్టాఫ్ నర్సుకు చెప్పగా ఆమె వచ్చి ఇంజిక్షన్ చేసి వెరే వార్డులో రోగికి ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి వెళ్లింది. ఇంజిక్షన్ చేసినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో పెద్ద కేకలు వేసింది. ఈ విషయాన్ని సూపరింటెండెంట్ దృష్టికి సాక్షి తీసుకెళ్లగా ఆయన ఆస్పత్రిలో అత్యవసర విభాగానికి మార్చి చికిత్స అందజేశారు. ఇటువంటి పరిస్థితి ఇక్కడ నిత్యం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చర్యలు తీసుకుంటాం..
సిబ్బంది కొరత వల్ల రాత్రి వేల రెండు వార్డులకు ఒకే స్టాఫ్ నర్సు ఉంటున్నారు. ప్రతి వార్డుకు ఒక స్టాఫ్ నర్సు ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం.-సీతారామరాజు, సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment