ఒకే ఊరిలో అపు‘రూపాలు’
అమలాపురం రూరల్ :
చేనేత గ్రామమైన బండారులంక కవలల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. అన్ని వయసుల కవల జంటలు 30కి పైగా ఉన్నాయి. వీరిని బయట నుంచి వచ్చే వారే కాదు.. చివరకు సహచర గ్రామస్తులు సైతం చూసి తికమకపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
గ్రామంలోనే స్థిరపడిన ఈ కవలలు వివిధ రంగాల్లో స్థిరపడి రాణిస్తున్నారు. అప్పులిచ్చిన వారు ఒకరికి బదులు మరొకరిని అడగడం, పోస్టుమన్‌లు ఒకరికొచ్చిన ఉత్తరాలను మరొకరికి బట్వాడా చేయడం, ఒకరికి బదులు మరొకరిని పిలవడం వంటి సంఘటనలు ఇక్కడ సర్వసాధారణం. కవలలు పోలికలోనే కాదు..నడకలోనూ..నడతలోనూ.. వస్త్రధారణ, ఆహార వ్యవహారాల్లో కూడా ఒకే విధంగా ఉంటారు. వీరి ఆలోచనలు కూడా ఒకే విధంగా ఉంటాయి. గ్రామానికి చెందిన కాశి లక్ష్మీరాజ్యం-యర్రా రామరాజ్యం, పడవల రాంబాబు-లక్ష్మణరావు, ఇనుమర్తి రామభద్రరావు-లక్ష్మణరావు,చింతపట్ల హేమకిరణ్-హేమచరణ్, చింతా కృష్ణ ప్రియ-వంశీకృష్ణ, దొమ్మేటి భాస్కర రామమణికంఠ-లక్ష్మీ వైష్ణవిశ్రీ, దానిరెడ్డి సాయిరాం-లక్ష్మణదుర్గ, బండార్లంక బాబూజీ టెక్నోస్కూల్‌లో చదువుతున్న వి.తేజస్వి శైలు -తేజస శ్రీసాయి లు పోలికలతో పాటు చదువులోను పోటీ పడుతున్నారు.
ట్రిపుల్స్ రాగిరెడ్డి లక్ష్మణ్-రాము- మోహినిపుష్ప ఒక నిమిషం తేడాలో జన్మించారు. పదో తరగతి చదువుతున్న రావేటి వెంకటేష్-శ్రీనివాస్‌లు ఒక మార్కు తేడాతోనే ముందుంటారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న కడి భాగ్యలక్ష్మి-భాగ్యలత రూపంలో ఒకేలా ఉంటారు. కవలలైన లక్ష్మీరాజ్యం, రామరాజ్యంలను గ్రామస్తులతో పాటు వారి భర్తలు కూడా గుర్తు పట్టేందుకు ఇబ్బంది పడుతుంటారు. చేనేత కార్మికులైన పడవల రాంబాబు, లక్ష్మణరావులు అచ్చుగుద్దినట్టుగా ఒకే పోలికలో ఉండడంతో వారిని పోల్చుకోవడం చాలా కష్టం. టీడీపీలో తిరిగే ఉప్పు రాంబాబు, లక్ష్మణరావులను గుర్తించడంలో ఆ పార్టీ నాయకులు కూడా తికమకపడుతుంటారు. ఇక పిల్లల విషయానికి వస్తే స్నేహితులు.. ఉపాధ్యాయులు గుర్తుపట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారు.