సాక్షి ప్రతినిధి, కడప : జిల్లా కలెక్టర్ తీరు పసువుదళంలో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. ఏకపక్ష చర్యలకు పాల్పడ్డమే కాకుండా ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని అధికార పార్టీ నేతల నుంచే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అందులో భాగంగానే ఆదివారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో కలెక్టర్ డౌన్‌డౌన్ అంటూ ఆ పార్టీ కార్యకర్తల్లు నినాదాలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నప్పటికీ అధికార పార్టీ నాయకులు సమర్థించడంపై పలువురు భగ్గుమంటున్నారు. ప్రజావ్యతిరేక పద్దతులు వీడాలంటూ ప్రజాసంఘాలు గళమెత్తాయి. ప్రజలు ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు సైతం ఆందోళన చేపట్టారు. తుదకు ప్రభుత్వ విఫ్ సైతం రాజీనామాకు సిద్ధపడ్డారు. ఉద్యోగులు సైతం మానసిక ఆవేదన చెందుతున్నారు. అన్ని వర్గాల వారికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ వివాదాస్పదమయ్యారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయన ధోరణిలో మార్పు రాకపోవడం మరింత వివాదాస్పదమైంది.
మినీ మహానాడుకు తాకిన కలెక్టర్ సెగ
అధికార పార్టీ, ప్రతిపక్షం, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు జిల్లా కలెక్టర్ తీరుపై వరసగా ఆరోపణలు గుప్పించాయి. ఇక్కడ పనిచేసి వెళ్లిన ఏ కలెక్టర్‌పై ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన దాఖలాలు లేవు. ఒకరి తర్వాత మరొకరు ఆరోపణలు గుప్పిస్తుంటే ఉన్నతాధికారి ఎవరైనా పనితీరు సవరించుకోవడం పరిపాటి. అయితే కలెక్టర్ తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. తుదకు ఆ సెగ అధికార పార్టీకి సైతం తాకింది. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో ఆ పార్టీ కార్యకర్తలు ‘కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలు చెబితే అధికారులు పనులు చేయాల్సిందేనని సదరు మంత్రి గట్టిగా నొక్కి చెప్పిన నేపథ్యంలో.. జిల్లా కలెక్టర్ వల్ల తాము ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని కార్యకర్తలు భగ్గుమన్నారు. కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో సర్ది చెప్పడానికి పలువురు నేతలు కాస్త శ్రమించాల్సి వచ్చింది. కాగా, వేదికపై ఉన్న కొందరు నేతలు కలెక్టర్‌ను సమర్థిస్తుండటం వల్లే ఆయన అలా వ్యవహరిస్తున్నారని.. ఆ విషయం మంత్రి దృష్టికి వెళ్లాలనే నినాదాలు చేసినట్లు తెలుస్తోంది.
నేతల్నీ వదలని తమ్ముళ్లు
కలెక్టర్ తీరుపై కొందరు నినాదాలు చేస్తే మరికొందరు ‘చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న’వైనాన్ని ఎండగడుతూ మినీ మహానాడులో కరపత్రాలు పంచిపెట్టారు. టీడీపీ నేతలు గోవర్ధన్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి, దుర్గాప్రసాద్, సుభాన్‌భాషల తీరుపై ఆరోపణలు గుప్పించారు. ఇవన్నీ పరిశీలిస్తే పార్టీ అభివృద్ధి కాంక్షించిన కార్యకర్తలు వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు జిల్లా కలెక్టర్ తీరు, ఇటు పార్టీ అంతర్గత వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే టీడీపీకి గడ్డు పరిస్థితులు తప్పవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
టీడీపీకి కలెక్టర్ సెగ!
Published Tue, May 26 2015 2:29 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement