
ఆన్‌లైన్ మోసం
- భారీ గిఫ్టుల పేరిట మెసేజ్‌లు
- నిలువునా మునిగిపోతున్న వినియోగదారులు
- పరువుపోతుందని బయటపడని వైనం
యలమంచిలి: సెల్‌ఫోన్లలో భారీ గిఫ్టుల సందేశాలు వినియోగదారులను నిలువునా ముంచేస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ కంపెనీల పేర్లతో సెల్‌ఫోన్లద్వారా మెసేజ్‌లు పంపిస్తూ వినియోగదారుల నుంచి ఎక్కువ మొత్తంలో నగదు కాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కొం దరు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ కంపెనీలు, పేరొందిన సంస్థల నుంచి మీకు రూ. కోటి గిప్టుగా వచ్చిందంటూ సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు పంపిస్తున్నారు.
ఇటువంటి మోసాలపై పట్టణప్రాంతాల్లో వినియోగదారులకు అవగాహన ఉండడంతో పెద్దగా స్పందించడంలేదు. ఇప్పుడు మోసగాళ్ల దృష్టి గ్రామీణులపై పడింది. ఏదోలా సెల్‌ఫోన్ నంబర్లను సేకరిస్తున్న వీరు సంబంధిత వినియోగదారులకు మీకు రూ.కోటి గిప్టు వచ్చిందంటూ మెసేజ్ పంపిస్తున్నారు. దానికి స్పందిస్తున్న కొందరు ఫోన్‌లోనే మాట్లాడుతున్నారు.
కంపెనీ గిఫ్టు పొందాలంటే ముం దుగా మీరు రూ. 20వేల నుంచి రూ.30వరకు తమ ఆన్‌లైన్ అకౌంట్‌లో జమచేయాలని నమ్మిస్తున్నారు. గిప్టు నగదును ట్యాక్స్ మినహాయించి చెక్ రూపంలో ఇస్తామని నమ్మబలుకుతున్నారు.ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లేడే వారితో ఇవన్నీ చెప్పిస్తున్నారు. నమ్మకం కలగడానికి ఆన్‌లైన్ అకౌంట్‌లో నగదును జమచేశాక ఆధార్ కార్డుతో రావాలని సూచిస్తున్నారు.
ఇంత పెద్దమొత్తంలో గిప్టు ఏవిధంగా ఇస్తున్నారని ఎవరైనా గట్టిగా నిల దీస్తే ఫోన్ కట్ చేస్తున్నారు. ఆన్‌లైన్ అకౌం ట్‌లో సొమ్ము జమచేశాక మోసపోయామని తెలుసుకున్న కొందరు లబోదిబో మంటున్నారు. ఇది మోసమని తెలిసిన కొందరు మెసేజ్‌లను పట్టించుకోవడంలేదు. మరి కొందరు మాత్రం ఆయా మెసేజ్‌ల గురించి సంబంధిత వ్యక్తులతో ఫోన్‌లో మాట్లాడి అన్‌లైన్ అకౌంట్‌లలో సొమ్ము జమచేస్తూ మోసపోతున్నారు.