ఆన్‌లైన్‌లో తపాలా సేవలు
Published Sun, Dec 1 2013 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
బొబ్బిలి, న్యూస్‌లైన్ : రానున్న ఆరు నెలల్లో తపాలా శాఖలో పూర్తిగా ఆన్‌లైన్ చేసి ఖాతాదారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు ఆ శాఖ డిప్యూటీ డివిజనల్ మేనేజర్ కె.వెంక ట్రావురెడ్డి చెప్పారు. ఇక్కడ విలేకరులతో ఆయన శనివారం మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 బ్రాంచి కార్యాలయూలు ఉన్నట్టు తెలిపారు. వీటిలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(పీఎల్‌ఐ) ఖాతాదారులు నాలుగు లక్షల 50 వేల మంది ఉండగా, గ్రామీణ పీఎల్‌ఐ ఖాతాదారులు 50 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఇన్ఫోసిస్‌తో అంగీకారం కుదుర్చుకొని ఆన్‌లైన్ చేస్తున్నామని, వచ్చే ఏడాదిలో ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందన్నారు. వీటి వల్ల గడువు తీరిన బీమాలకు చెల్లింపులతో పాటు అదనపు సదుపాయూలు కూడా లభిస్తాయని చెప్పారు. ప్రధాన కేంద్ర కార్యాలయంలో ఉండే కంట్రోలు ప్రొసెస్ సెంటరు(సీపీపీ) ద్వారా దేశ వ్యాప్తంగా పర్యవేక్షణ ఉంటుందన్నారు.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లు ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే వారికే వర్తించేవని, ఇప్పుడు ప్రైవేటుగా నడుస్తున్న ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, హైస్కూల్, బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో పని చేస్తున్న వారికి కూడా అమలు చేస్తూ విస్తరించామన్నారు. అన్ని బీమా సంస్థల కంటే పోస్టల్ బీమా ద్వారా బోనస్, వడ్డీలు అధికంగా ఉన్నాయని చెప్పారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ డబ్బులు వస్తాయని తెలిపారు. గ్రామీణ పోస్టల్ ఇన్సూరెన్స్‌ను రూ.3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచామన్నారు. వికలాంగులు బీమా చేయించుకోవడానికి ఇప్పటి వరకు లక్ష రూపాయల వరకు ఉండేదని, ఇప్పుడు దానిని రూ.20లక్షలకు పెంచామని చెప్పారు. ఎవరికైనా సలహాలు, సూచనలు అవసరమైతే టోల్ ఫ్రీ నంబరు 18001805232 నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయన వెంట సూపరింటెండెంట్ డబ్ల్యు నాగాదిత్య కుమార్, రవి ఉన్నారు.
Advertisement
Advertisement