ఏప్రిల్ నుంచి దాతలకు ఆన్‌లైన్‌లో సేవలు
డోనార్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభంలో టీటీడీ ఈవో
తిరుపతి అర్బన్: టీటీడీ పరిధిలోని కాటేజీలకు విరాళాలు అందించిన దాతలకు ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తెలిపారు. టీటీడీ ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి నేతృత్వంలో రూపొందించిన డోనార్ మేనేజ్‌మెంట్ ఆన్‌లైన్ సిస్టమ్‌ను తిరుపతిలోని పరిపాలన భవనంలో ఈవో బుధవారం ప్రారంభించారు. ఇప్పటివరకు 4,486 మంది దాతలు కాటేజీలకు విరాళాలు అందించారన్నారు.
వారిలో 2,300 మంది దాతలు ఏటా టీటీడీ నిర్దేశించిన మేరకు గదులను సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దాతల ద్వారా 6,051 గదులు అందుబాటులోకి వచ్చాయన్నారు. దాతలకు మరింత మెరుగైన సేవలు పారదర్శకంగా అందించేందుకు ఈ–మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ల వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. నూతన ఆన్‌లైన్ అప్లికేషన్ విధానం ద్వారా దాతలు డోనార్ స్లిప్పులను ఆన్‌లైన్‌లోనే పొందవచ్చన్నారు. తద్వారా టీటీడీ కల్పించే అన్ని సేవలనూ పొందేందుకు అవకాశం కలుగుతుంద న్నారు. టీటీడీకి గదుల నిర్మాణం కోసం మరింత మంది దాతలు సహకరించాలని ఈవో విజ్ఞప్తి చేశారు.