ఎస్‌ఐ రంగనాథ్, రజియాల కేసు విచారణ
గుంటూరు, న్యూస్‌లైన్: సంచలనం రేకెత్తించిన ఎస్‌ఐ రంగనాథ్ గౌడ్, రజియా సుల్తానా వివాహేతర సంబంధం కేసు నాలుగేళ్ల అనంతరం బహిరంగ విచారణకు నోచుకుంది. గుంటూరు పోలీస్ క్లబ్‌లో ప్రకాశం జిల్లా ఒంగోలు డీఎస్పీ జాషువా శుక్రవారం సాక్షులను విచారించారు. అప్పట్లో హోటల్‌లో సిబ్బందిగా పనిచేసిన వారితోపాటు, ఇద్దరు డీఎస్పీలు విచారణకు హాజరయ్యారు.
పొన్నూరు ఎస్‌ఐగా పని చేసిన రంగనాథ్‌గౌడ్ తనని ప్రేమ పేరుతో మోసం చేసినట్లు రజియా సుల్తానా ఆరోపించిన విషయం తెలిసిందే. తనకు న్యాయం చేయాలని రజియా నాలుగేళ్లుగా పోరాటం చేస్తోంది. అప్పట్లో ఎస్‌ఐ రంగనాథ్‌గౌడ్ పారిపోయాడు. మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అతని కోసం వెతికాయి. చివరకు అతను హైదరాబాద్‌లో దొరికాడు. ఆ తరువాత అతనిని సస్పెండ్ చేశారు. ఒక పక్క రజియా ఆందోళన చేస్తూనే ఉంది. రంగనాథ్ మరో పక్క పెళ్లి కూడా చేసుకున్నాడు. రజియా పోరాటం కొనసాగిస్తూనే ఉంది.