ఇదేంది బాబూ..! | Opposition leader Chandrababu discrimination on the district | Sakshi
Sakshi News home page

ఇదేంది బాబూ..!

Published Mon, Sep 1 2014 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM

ఇదేంది బాబూ..!

ఇదేంది బాబూ..!

- ప్రతిపక్ష నేత జిల్లాపై చంద్రబాబు వివక్ష
- జేఎన్‌టీయూ, ట్రిపుల్ ఐటీలకు నిధుల కోత
- సాగునీటి ప్రాజెక్టులకు అంతంతే
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్ జిల్లా అంటేనే ఎందుకో గిట్టనట్లుంది. సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయలేదనే ఏకైక కారణంతో జిల్లాపై వివక్ష చూపుతున్నారు. వైఎస్ హయాంలో ఇబ్బడిముబ్బడిగా నిధులు విడుదల చేసి జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేయకుండా జిల్లాను తిరోగమనంలోకి నెడుతున్నారు.
సాక్షి,కడప : రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపక్ష నేతల నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు విషయంలో వివక్ష చూపుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తూ వచ్చారు. అయితే, సీఎం చంద్రబాబు త మ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చిన నియోజకవర్గాలను ఒక విధంగా, ప్రతికూల ఫలితాలు వచ్చిన సెగ్మెంట్లను మరో రకంగా చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.  

అనంతపురం, కాకినాడ జేఎన్‌టీయూ కళాశాలలకు భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయించడాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతోపాటు మాజీ సీఎం కిరణ్ సొంత నియోజకవర్గమైన పీలేరుకు కూడా బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష చూపడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.  
 
జేఎన్‌టీయూ, ట్రిపుల్ ఐటీలకు నిధుల కోత
గ్రామీణ పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చి వారిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని భావించిన దివంగత సీఎం వైఎస్సార్ పులివెందులలో జేఎన్‌టీయూను నెలకొల్పగా, 2012లో మాజీ సీఎం కిరణ్ పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జేఎన్‌టీయూను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ఇతర జేఎన్‌టీయూలకు ఇబ్బడి ముబ్బడిగా కావాల్సిన నిధులు కేటాయించిన కొత్త సర్కార్.. కొత్తగా ఏర్పాటైన కలికిరిలోని జేఎన్‌టీయూ కళాశాలకు రూ. 212 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపితే, కేవలం రూ. 12 కోట్లు మాత్రమే మొక్కుబడిగా కేటాయించి చేతులు దులుపుకుంది.

అలాగే అనంతపురం జేఎన్‌టీయూకు రూ. 24 కోట్లతో బ్లాక్ గ్రాంటుతోపాటు అదనంగా రూ. 5.71 కోట్లు కేటాయించారు. అదే పులివెందుల జేన్‌టీయూకు బ్లాక్ గ్రాంట్ కింద వచ్చే రూ. 24 కోట్లలోనే కోత విధించారు. దాదాపు రూ. 22 లక్షలను కోత పెట్టడంతో పాటు కొత్త నిధులు ఇవ్వకపోవడం గమనార్హం.

ఈ బ్లాక్ గ్రాంటుతో కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది జీతభత్యాలతోపాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రతియేటా ఈ గ్రాంటు కింద నిధులను విడుదల చేస్తుంది. ఇక వేంపల్లె సమీపంలోని ఇడుపులపాయలో నెలకొల్పిన ట్రిపుల్ ఐటీకి కూడా పెద్దగా ప్రాధాన్యత కల్పించలేదు. కొత్తగా నిధులేమీ విడుదల చేయలేదు. యోగి వేమన యూనివర్సిటీకి బడ్జెట్ విడుదల కాక.. అభివృద్ధి లేక యూనివర్సిటీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రిమ్స్‌కు కూడా బడ్జెట్‌లో ఒరిగిందేమీ లేదు. కనీసం ఎయిమ్స్ స్థాయికి విస్తరిస్తారని ఆశించినా దాని ఊసే లేదు.
 
పరిశ్రమల స్థాపనకు ఏదీ బడ్జెట్
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ జిల్లాలో పరిశ్రమలకు చంద్రబాబు సర్కార్ పెద్దగా బడ్జెట్ కేటాయించ లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనలో భాగంగా ప్రకటించిన ఒక్క సెయిల్ మినహా ఎలాంటి పరిశ్రమలకు నిధుల కేటాయింపులు లేవు. పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన వైఎస్సార్ జిల్లాలో అగ్రిజోన్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు ఎలాంటి నిధులు కేటాయింలేదు. ఆస్‌బెస్టాస్, ముగ్గురాయి, నాపరాయి లాంటి ఖనిజ సంపద కలిగిన జిల్లాలో కనీసం ఆ స్థాయి పరిశ్రమకు ప్రభుత్వం ప్రోత్సాహం చూపకపోవడంతో పారిశ్రామికవేత్తల్లో నిరుత్సాహం నెలకొంది.
 
ఐజీ కార్ల్‌లో పరిశోధనలు కరువు
650 ఎకరాల్లో రూ. 385 కోట్లతో చేపట్టిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రంలో పరిశోధనలు కరువయ్యాయి. వైఎస్ హయాంలో వంద కోట్ల బడ్జెట్‌ను కేటాయించేవారు. ప్రస్తుత టీడీపీ సర్కార్ కేవలం రూ. 15.18 కోట్లను విడుదల చేయనుంది. అయితే రూ. 15 కోట్లతో టీకాల ఉత్పత్తి, గడ్డి పెంపకం, లేగదూడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఎంతోమంది ఉన్నత స్థాయి అధికారులు వచ్చి అది చేస్తాం..ఇది చేస్తామని చెప్పారేగానీ ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటికీ పాడుబడ్డ భవనాలు, దుమ్ము ధూళితో నిండి లోపల అధ్వానంగానే ఐజీ కార్ల్ దర్శనమిస్తోంది. రూ.15 కోట్లతో అధికారులు ఎలాంటి పరిశోధనలు చేస్తారో వేచి చూడాల్సిందే.
 
సాగునీటి ప్రాజెక్టులకు అంతంత మాత్రమే
పులివెందుల నియోజకవర్గంతోపాటు జిల్లాలోని ప్రాజెక్టులకు కూడా బడ్జెట్‌లో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. వైఎస్సార్ హయాంలో జిల్లా అభివృద్ధికి నిధుల వర్షం కురిస్తే..నేడు అంతంత మాత్రంగానే టీడీపీ సర్కార్ బాబు మార్క్ బడ్జెట్‌ను చూపుతోంది. తెలుగుగంగ ప్రాజెక్టుకు 2012-13లో రూ. 160 కోట్లు, 2013-14లో రూ. 195 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు మాత్రం రూ. 89 కోట్లతో మాత్రమే సరిపెట్టారు.

అలాగే జీఎన్‌ఎస్‌ఎస్‌కు సంబంధించి 2012-13లో రూ. 419.86 కోట్లు, 2013-14లో రూ. 380 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయిస్తే ప్రస్తుతం రూ. 55.14 కోట్లు ఆధునికీకరణకు కేటాయించారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ)కి సంబంధించి 2012-13లో రూ. 279.39 కోట్లు, 2013-14లో రూ. 90 కోట్లు వైఎస్సార్ అందించగా, టీడీపీ సర్కార్ ప్రస్తుతం రూ. 27.81 కోట్లను మాత్రమే కేటాయించింది. అలాగే మైలవరానికి రూ. 8.16 కోట్లు, కేసీ కెనాల్‌కు రూ. 8.40 కోట్లు అంతంతమాత్రంగానే అందించారు. హంద్రీ-నీవాకు గతంలో వందల కోట్లు కేటాయిస్తే, ప్రస్తుతం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించి సాగునీటి రంగానికి కావాల్సిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను అందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement