సాక్షి, రాజమండ్రి :పంపిణీ నష్టాలను అధిగమించేందుకు విద్యుత్ సంస్థలు వినియోగదారులపై కొరడా ఝుళిపిస్తున్నాయి. ఉత్పాదక సంస్థల నుంచి విద్యుత్‌ను కొని అమ్ముకునే వ్యాపారం సాగిస్తున్న డిస్కంలు (పంపిణీ సంస్థలు) నష్టాలను పూడ్చుకోడానికి ఇక కఠినతరంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నాయి. విద్యుత్ కొనుగోలు, అమ్మకాల మధ్య అంతరం సంస్థలకు ఏటా తీవ్ర నష్టాలను తెచ్చి పెడుతోంది. ఓవైపు విద్యుత్తు పంపిణీ నష్టాన్ని (లైన్‌లాస్) ఎక్కడికక్కడ తగ్గించుకుంటూ ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యతను సాధించేందుకు అధికారులు అవస్థలు పడుతుండగా.. మరోవైపు కొందరు అనుమతించిన పరిమితిని మించి విద్యుత్తును వినియోగించడం, మీటర్ ట్యాంపరింగ్‌లతో విద్యుత్ చౌర్యానికి పాల్పడడం వంటివి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అధిక రెవెన్యూ లభించే రంగాలపై విజిలెన్స్ దాడులు జరిపి వినియోగంలో అక్రమాలకు చెక్ పెట్టే చర్యలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా హెచ్‌టీ విద్యుత్ వినియోగదారులపై దాడులు చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా రూ.లక్షల్లో జరిమానాలు విధిస్తున్నారు.
వినియోగదారుల్లో ‘హై టెన్షన్..’
తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో ఇప్పటి వరకూ ఎల్‌టీ వినియోగదారుల అక్రమాలపైనే దృష్టి కేంద్రీకృతం చేసిన విజిలెన్స్ శాఖ ఇప్పుడు హై టెన్షన్ వినియోగంపై దృష్టి సారించింది. ఈ పరిణామం ఆ తరగతి వినియోగదారులను కలవర పరుస్తోంది. ఈపీడీసీఎల్ సీఎండీ ఆదేశాల మేరకు గత నెల 28న రాత్రి జరిపిన దాడిలో రాయవరం మండలంలో ఓ రైస్ మిల్లు నిర్వాహకులు మీటర్‌ను ట్యాంపర్ చేసి విద్యుత్ చౌరా్యానికి పాల్పడుతుండగా పట్టుకుని రూ. 68 లక్షల అపరాధ రుసుం విధించారు. ఈ నేపథ్యంలో హెచ్‌టీ రంగంలో ‘దొరికితేనే దొంగలు’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 30న కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు సీఎండీ ఆదేశాల మేరకు ఇప్పుడు జిల్లాలోని అన్ని హెచ్‌టీ సర్వీసులనూ తనిఖీ చేయనారంభించారు. సోమవారం మండపేట, రామచంద్రపురం ప్రాంతాల్లో, మంగళవారం అనపర్తి మండలంలో జరిపిన దాడుల్లో అనుమతికి మించిన విద్యుత్ వినియోగిస్తున్నట్టు గుర్తించిన రెండు సర్వీసులకు రూ.5.90 లక్షల జరిమానా విధించారు. బుధవారం నుంచి విజిలెన్స్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. రైస్ మిల్లులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నారు. జిల్లాలో సుమారు 10,000 హెచ్‌టీ పరిశ్రమల కనెక్షన్లు నెలకు సుమారు 17 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తున్నాయి.
ఒక్క బుధవారమే 35 సర్వీసులపై దాడులు..
విజిలెన్స్ అధికారులు జిల్లాలోని అనపర్తి, రాయవరం, మండపేట మండలాల్లో బుధవారం విసృ్తతంగా దాడులు జరిపారు. అనపర్తి మండలంలోని రెండు సర్వీసులు అనుమతికి మించి లోడ్ వినియోగిస్తున్న కారణంగా రూ.1.56 లక్షల జరిమానా విధించారు. బుధవారం ఒక్కరోజే 35 హెచ్‌టీ సర్వీసులపై దాడులు చేశామని, ఈ తనిఖీలు మరిన్ని రోజులు కొనసాగుతాయని ఈపీడీసీఎల్ రాజమండ్రి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీరు యలమంచిని శ్రీమన్నారాయణ ప్రసాద్ తెలిపారు.
కరెంటు కన్నగాళ్లపై కన్ను
Published Thu, Jan 9 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement
Advertisement