కష్ట జీవికి కంట నీరు
సత్తెనపల్లి: మార్కెట్‌లో పత్తి ధర కష్ట జీవికి కంట నీరు తెప్పిస్తోంది. గత ఏడాది క్వింటా రూ. 5వేల నుంచి రూ. 6వేల వరకు ధర పలికింది. ప్రస్తుతం రూ. 2900 నుంచి రూ. 3,200 వరకు మాత్రమే ఉండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 4.5 లక్షల పైచిలుకు ఎకరాల్లో పత్తి సాగు చేశారు.
వర్షాలు సకాలంలో కురవకపోవడంతో మొక్కలు గిడసబారి ఎదుగుదల లోపించింది. పల్నాడు ప్రాంతంలో కొంత మేర ఆశాజనకంగా ఉన్నా డెల్టాలో రైతులు నష్టపోయారు. ఉన్నట్లు ఉండి పంట ఎర్రబారి తెగుళ్లు సోకడంతో పూత,పిందె రాలిపోయాయి. దిగుబడులు తగ్గడంతోపాటు మార్కెట్‌లో పత్తి ధరలు చూసి రైతు ఆవేదన చెందుతున్నాడు.
పెట్టుబడికి దిగుబడికి తప్పిన లంకె..
పత్తి తీత ఆరంభంలో క్వింటా ధర రూ. 3500 నుంచి రూ. 4300 వరకు పలికింది. క్రమేణా ధర తగ్గింది. గత ఏడాది ఎకరం పత్తి సాగుకు పెట్టుబడి రూ. 15వేలకు మించలేదు. ఈ ఏడాది ఖర్చులు విపరీతంగా పెరగడంతో రూ. 30వేలుఅయిందంటున్నారు. కౌలు రైతు అయితే మరో 10 నుంచి రూ. 15వేలు అదనం.
ప్రస్తుతం ఎకరాకు సగటున ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పుడున్న ధర ప్రకారం రూ. 15 వేలు వస్తాయి. పెట్టుబడి రూ. 30వేలు, కౌలు రూ. 15వేలు కలిపితే, మరో రూ. 30వేలు రైతే బాకీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చేసిన అప్పులు తీరే మార్గం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.
27 నాటికి జిల్లాలో 11 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలి....
జిల్లాలో పత్తి రైతుల పరిస్థితిని ఆలకించిన జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శ్రీధర్ సోమవారం సాయంత్రం మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష చేశారు. జిల్లాలో 11 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ మాచర్ల, పిడుగురాళ్ళ, నడికు డి, ఫిరంగిపురంలో మాత్రమే ప్రారంభించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే ఈనెల 27నాటికి మిగిలిన ఏడు కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశిం చారు. శాసనసభ్యులను ప్రారంభోత్సవాలకు ఆహ్వానించి గుంటూరు, తాడికొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, పెదనందిపాడు, సత్తెనపల్లి, క్రోసూరు మార్కెట్‌యార్డుల్లో పత్తి కొనుగోళ్లు చేపట్టాలన్నారు.
సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. మంగళవారం రైతులు పెద్ద ఎత్తున మార్కెట్ యార్డుకు పత్తి బోరాలను తీసుకొచ్చారు.
ఆంక్షలు లేకుండా పత్తి కొనుగోలు చేయాలి
నేను ఈ ఏడాది నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశా. ఎకరాకు రూ. 32వేలు పెట్టుబడి పెట్టా. ఇప్పటి వరకు ఐదు క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. గ్రామాల్లో రూ. 3 వేలకు మించి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. సీసీఐ కేంద్రంలో ఆంక్షలు విధించకుండా గిట్టుబాటు ధర కల్పించాలి. మద్దతు ధర రూ.4,050లుగా, నాణ్యత తగ్గితే రూ. 3800లుగా సీసీఐ కేంద్రంలో నిర్ణయించారు. దీన్ని సవరించి కనీసం క్వింటా రూ. 5,500 నుంచి రూ. 6వేల వరకు కొనుగోలు చేస్తే రైతు కష్టాలు కొంత మేర తీరతాయి.
- కుంచాల వెంకయ్య, రైతు, భీమవరం