మా నగలు ఉన్నాయో.. పోయాయో?
బందరు కెనరాబ్యాంకు ఖాతాదారుల్లో ఆందోళన
నగల మాయంపై అంతర్గత విచారణ
మచిలీపట్నం : మచిలీపట్నం కెనరా బ్యాంకులో బంగారు నగల మాయం కుంభకోణంపై విచారణ జరుగుతోంది. కెనరా బ్యాంకు కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారుల వివరాలను పరిశీలిస్తున్నారు. బంగారం మిస్సింగ్ ఘటనతో తాము కుదువపెట్టని నగలు, దాచుకున్నవి ఉన్నాయో పోయాయోనంటూ ఖాతాదారులు పెద్దసంఖ్యలో గురువారం బ్యాంకు వద్ద బారులుతీరడంతో గందరగోళం నెలకొంది. ఆర్ పేట సీఐ వరప్రసాద్ బ్యాంకు వద్ద బందోబస్తు చేపట్టాల్సి వచ్చింది. ఒకానొక దశలో పోలీసులు, ఖాతాదారులకు మధ్య వాగ్వాదం జరిగింది.
సోమ మంగళవారాల్లో చెబుతాం
ఉన్నతాధికారులు, బ్యాంకు సెక్యూరిటీ చీఫ్ అధికారి వి ప్రసాద్, మేనేజరు జయరాజ్ తదితరులు రికార్డుల్ని పరిశీలిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో ఖాతాదారులు బ్యాంకుకు వస్తే పూర్తి వివరాలు అందజేస్తామని అధికారులు తెలిపారు. ఖాతాదారులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.