అట్టహాసంగా పయ్యావుల కేశవ్ నామినేషన్
అనంతపురం క్రైం : స్థానిక శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి పయ్యావుల కేశవ్ నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా కొనసాగింది. శనివారం కలెక్టరేట్‌లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ బి. లక్ష్మీకాంతం చాంబర్‌లో పయ్యావుల కేశవ్ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత, జెడ్పీ చైర్మన్ చమన్. ప్రభుత్వ ఛీప్ విప్ కాలువ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ యామినీ బాల, ఎమ్మెల్సీలు శమంతకమణి, గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యేలు బీకే పార్థసారధి, జేసీ ప్రభాకర్‌రెడ్డి, గోనుగుంట్ల సూర్యనారాయణ, ప్రభాకర్‌చౌదరి, హనుమంతరాయ చౌదరి, జితేంద్ర గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ శ్రేణులు కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పయ్యావుల కేశవ్ 3 సెట్లు నామినేషన్ దాఖలు చేయగా, కేశవ్‌కు మద్దతుగా వై. వెంకటసుబ్బన్న మరో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు కేశవ్ కృతజ్ఞతలు తెలిపారు.
పల్లె వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
నామినేషన్ సందర్భంగా విచ్చేసిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి వాహనాన్ని కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి పరిటాల సునీత వాహనాన్ని మాత్రం అనుమతించారు. నామినేషన్ సందర్భంగా మూడు వాహనాలను మాత్రమే అనుమతించాల్సిన నిబంధనలను ఎన్నికలు అధికారులు తుంగలో తొక్కారు.