గోదావరిఖని, న్యూస్‌లైన్ : ‘సింగరేణి సంస్థకు మా విలువైన భూములిచ్చాం... గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుందని అనుకున్నాం... మా పిల్లలకు నౌకర్లు వస్తయని ఆశపడ్డాం... కానీ, మా బతుకులను బుగ్గిపాలు చేసే అభివృద్ధి మాత్రం మాకొద్దు...’ అంటూ సింగరేణిపై ప్రభావిత గ్రామాల ప్రజలు మండిపడ్డారు. సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే 1, 3 గ్రూపు గని, జీడీకే 2, 2ఏ గ్రూపు గని, జీడీకే 5వ గనికి సంబంధించి గతంలో సేకరించిన స్థలం 1272.44 హెక్టార్ల నుంచి 1356.85 హెక్టార్లకు విస్తరించేందుకు అవసరమైన ప్రతిపాదనలు చేసేందుకు శుక్రవారం స్థానిక సింగరేణి వొకేషనల్ ట్రెయినింగ్ సెంటర్‌లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఏటా బొగ్గు ఉత్పత్తిని 1.154 మిలియన్ టన్నుల నుంచి 1.734 మిలియన్ టన్నులకు పెంచేందుకు దీనిని విస్తరించనున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సింగరేణి ప్రభావిత గ్రామాలైన జనగామ, సుందిళ్ల, ముస్త్యాల, జల్లారం గ్రామాల ప్రజలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అరుణ్‌కుమార్ సంధానకర్తగా వ్యవహరించారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే వివిధ గ్రామాల ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేయగా కొద్ది సేపటికి జనగామ నుంచి 400 మంది ప్లకార్డులు చేతబూని వేదిక వద్దకు చేరుకున్నారు. ‘మా గ్రామం కింద బొగ్గు తీయొద్దు - మా బతుకులు ఆగం చేయొద్దు’ అంటూ నినాదాలు చేశారు.
వీరు సభాస్థలి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమైన నాయకులను మాత్రం లోపలికి ఆహ్వానించారు. ఈ సందర్భంలో కూడా సింగరేణికి వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేశారు. 54 ఏళ్ల క్రితం తమ భూములను సింగరేణికి ఇష్టంతో అప్పగించామని, కానీ, ఇప్పుడు ఇచ్చేందుకు తమకు ఎందుకు కష్టం అనిపిస్తోందో కాలుష్య నియంత్రణ మండలి, ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. గ్రామాల్లో కుంటలు ఎండిపోయాయని, పశువులకు తాగేందుకు నీరు దొరకడం లేదని, చెరువులు పూడికతో నిండిపోయి నీరు ఉండడం లేదని, రోడ్లు నెర్రెలు బారాయని, ఇళ్లకు బీటలు పడ్డాయని గ్రామస్తులు ముక్తకంఠంతో తమ అభిప్రాయం వ్యక్తకీకరించారు. సింగరేణి సంస్థ వల్ల అభివృద్ధి జరిగిందని, అదే సమయంలో తమ బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గామాల్లో ఎంతో అభివృద్ధి చేశామని సింగరేణి గొప్పులు చెప్పుకుంటున్నా... వాస్తవంలో కనిపించడం లేదని విమర్శించారు. ఎక్కడో అభిప్రాయం సేకరించేకంటే గ్రామాల్లోకి వచ్చి సింగరేణి వల్ల ప్రజలు పడుతున్న బాధలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ను కోరారు. అప్పటిదాకా ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జనగామ, ముస్త్యాల గ్రామాల ప్రజలు ఈ సభను గుర్తించడం లేదని పేర్కొంటూ సభాస్థలి నుంచి నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, ఆర్జీ-1 సీజీఎం సుగుణాకర్‌రెడ్డితోపాటు వివిధ గ్రామాల ప్రజలు, కార్మిక సంఘాల నాయకులు తమ అభిప్రాయాలు సభ దృష్టికి తీసుకువచ్చారు. డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఐ శ్రీధర్, ఎస్సైలు, సీఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీగార్డులు బందోబస్తు నిర్వహించారు.
ప్రజాభిప్రాయాన్ని నివేదిస్తాం : ఇన్‌చార్జి కలెక్టర్
కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ప్రజలు తెలిపిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అరుణ్‌కుమార్ చెప్పారు. ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ప్రజలు కోరారని, కానీ, ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం తనకు లేదని ఆయన వెల్లడించారు.
మా బతుకులు ఆగం చేయొద్దు
Published Sat, Dec 21 2013 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement