- మున్సిపోల్స్ తరువాత సేదదీరిన నేతలు
- నేటి నుంచి స్థానిక ఎన్నికల ప్రచారం ముమ్మరం
సాక్షి, తిరుపతి: దాదాపుగా నెల నుంచి ప్రచారంలో మునిగితేలిన నేతలు చాలామంది ఉగాది రోజైన సోమవారం సేద దీరారు. ఆయా పార్టీల ముఖ్య నాయకులు ఇంతకాలం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో ఆశించిన స్థాయిలో పాల్గొనలేకపోయారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగ్గా నాయకులు సోమవారం ఉగాది పండుగ కావడంతో ప్రచారంలో పాల్గొనలేదు. కొద్దిరోజులుగా అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో బిజీగా గడిపిన నాయకులకు సోమవారం కాస్తంత సేదదీరే సమయం లభించింది.
పండుగ రోజు కూడా ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఇబ్బందిపెట్టడం ఎందుకని ఒక రోజు విరామం ఇచ్చారు. అయితే కొందరు నాయకులు మాత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లాలో స్థానిక ఎన్నికలు మొదటి విడతకు ఏప్రిల్ 6వ తేదీన మదనపల్లె డివిజన్‌లో పోలింగ్ నిర్వహిస్తారు. మిగిలిన రెండు డివిజన్లలో 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ రెండు విడతల్లోనూ 65 జెడ్పీటీసీ స్థానాలు, 887 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
తొలివిడత ఎన్నికల ప్రచారానికి ఇక నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో ఎన్నికల ప్రచారం మంగళవారం నుంచి ముమ్మరం కానుంది. అన్ని రాజకీయ పక్షాల నేతలూ ప్రచారాన్ని ఉరకలెత్తించనున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఎన్నికల వాతావరణం ఇక పల్లెలను తాకనుంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది.
ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంతాల్లో ఓటర్లు, ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలు మద్యం మత్తులో మునిగితేలుతున్నారు. మంగళవారం నుంచి ఈ పరిస్థితి మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించనుందనడంలో సందేహం లేదు.