ఉద్యోగులు ఔట్ | out sourcing Employees out | Sakshi
Sakshi News home page

ఉద్యోగులు ఔట్

Published Tue, May 20 2014 12:10 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

out sourcing Employees out

 సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న రీతిలో రాష్ట్ర విభజన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట శాపమైంది. పది సంవత్సరాల నుంచి కనీస వేతనాలతో వెట్టి చాకిరి చేస్తున్న ఈ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని శాఖల్లో వీరి అవసరం ఉందని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ఈ ఉత్తర్వుల కారణంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 3 వేల ఉద్యోగులు ఈ నెల 31 నుంచి రోడ్డున పడనున్నారు. 2005 సంవత్సరం నుంచి వివిధ శాఖల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, స్టెనోలు, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లుగా రూ.6000 నుంచి రూ.9500 వేతనానికి పనిచేస్తున్నారు.
 
 పదేళ్ల నుంచి పనిచేస్తున్న తమ సర్వీసును కొత్త ప్రభుత్వం పర్మినెంట్ చేస్తుందని, జీతాలు పెరుగుతాయని, ఉద్యోగ భద్రత ఉంటుందని అంతా భావించారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తరువాత తమ బాధలు విన్నవించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే పిడుగులాంటి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో మున్సిపాల్టీలు, డీఆర్‌డీఏ, డ్వామా, డీఎంహెచ్ వో, జీజీహెచ్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ వంటి 77 విభాగాలోల ఈ తరహా ఉద్యోగులు ఉన్నారు. వచ్చేనెల 2 నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడనుండటంతో కొత్త ప్రభుత్వంపై భారం పడకూడదనే ఉద్దేశంతో వీరిని తొలగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు అరకొర జీతాలతో జీవితాలను నడుపుకొస్తున్న ఈ ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్ ఒక్కసారిగా అగమ్యగోచరంగా మారనున్నది. ఈ సమాచారం తెలుసుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నతాధికారులను కలిసినా ఫలితం లేకపోయింది.
 
 సాగునీటి ప్రాజెక్టుల సిబ్బందీ తొలగింపు..
 జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలోని 28 ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 450 సిబ్బందిని కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పులిచింతల, వంశధార, తోటపల్లి బ్యారేజి, ముసురుమిల్లి రిజర్వాయరు, పి.ఎస్.వెలిగొండ, పోలవరం, సింగూరు, చేవెళ్ల, ప్రాణహిత వంటి ముఖ్య ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వీరిని తొలగిస్తే పనులకు ఆటంకం కలుగుతుందని ఆ ప్రాజెక్టుల ఇంజినీర్లు, ఆయా జిల్లాల కలెక్టర్లు ఫ్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు ముఖ్యమైన పులిచింతల ప్రాజెక్టు పనులు తుది దశలో ఉన్నాయని, భూసేకరణ, ముంపు బాధితులకు నష్టపరిహారం అందచేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయాల్లోని సిబ్బందిని తొలగిస్తే ప్రతిష్టంభన ఏర్పడుతుందని, గుంటూరు జిల్లాలో ఈ ప్రాజెక్టు కింద పనిచేస్తున్న 38 మంది తొలగించకూడదని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ తొలగింపు ఉత్తర్వులు జారీ కావడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వం తాము చేస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగంలోకి తీసుకోవాలని, పర్మినెంట్ చేయాలని కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement