సిఫార్సులకే పెద్దపీట..
అంగన్‌వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు
విశాఖ డివిజన్‌లో 120 పోస్టులకు ఇంటర్వ్యూలు
పాతిక పోస్టులకు ఒక్కొక్కరే హాజరు
విశాఖపట్నం : భీమిలి, గాజువాక, విశాఖ అర్బన్ ప్రాజెక్టుల పరిధిలో 120 అంగనవాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీ కోసం గురువారం విశాఖ ఆర్డీఒ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఏజెన్సీలో ఐటీడీఏ పీఒ, మైదాన ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీలో ఐసీడీఎస్ పీడీ కన్వీనర్‌గా వ్యవహరిస్తుండగా, ప్రాజెక్టు సీడీపీఒ, డీఎంఅండ్‌హెచ్‌ఒలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉండేవారు. ఇటీవలే అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో అధికార టీడీపీ ఎమ్మెల్యేలు భారీగా అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యేల స్థానంలో ఆర్డీఒలకు చోటు కల్పించారు. నియామక కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న ఐటీడీఎ పీడీ విజయలక్ష్మి, విశాఖ ఆర్డీఒ వెంకటేశ్వర్లుతో పాటు ఆయా ప్రాజెక్టుల సీడీపీఒలు, అదనపు డీఎంఅండ్‌హెచ్‌ఒలు గురువారం జరిగిన ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు.
సుమారు పాతిక పోస్టుల వరకు ఒక్కో పోస్టుకు ఒక్కరే దరఖాస్తు చేయగా, కొన్ని పోస్టులకు ఇద్దరేసి, మరికొన్ని పోస్టులకు గరిష్టంగా ఎనిమిది మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రాజెక్టు పరిధి లో నియామక కమిటీల పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు చేపట్టారు. ఇంటర్వ్యూల ప్రక్రియను ఐసీడీఎస్ పీడీనిర్వహించగా, ఆర్డీఒ పర్యవేక్షించారు. పోస్టుకు ఒక్కో దరఖాస్తు మాత్రమే రావడం పట్ల అధికారులు సైతం విస్తుపోయారు. ఈ పోస్టుల వెనుక భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇద్దేరి చొప్పున హాజరైన చోట కూడా భారీగా చేతులు మారినట్టు తెలుస్తోంది. భీమిలి, రూరల్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో భారీగా అవకతవకలు జరిగి నట్టుగాఆరోపణలు గుప్పుమన్నాయి. కొన్నిపోస్టులకు వేలం పాటలు కూడా జరిగినట్టు సమాచారం. కమిటీల్లో స్థానం లేకున్నప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే ఇంటర్వ్యూలు జరుగు తున్నట్టుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులకు తొలుత మూడురోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందిం చినప్పటికీ చివరకు ఎమ్మెల్యేల ఒత్తిళ్ల మేరకు ఒకరోజులోనే ముగించేందుకు ఏర్పాట్లు చేశారు. 16, 17 తేదీల్లో అనకాపల్లి, నర్సీపట్నం డివిజన్ల పరిధిలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.