సమృద్ధిగా ఆక్సిజన్‌ నిల్వలు | Oxygen reserves as abundance in AP | Sakshi
Sakshi News home page

సమృద్ధిగా ఆక్సిజన్‌ నిల్వలు

Published Tue, May 19 2020 4:25 AM | Last Updated on Tue, May 19 2020 4:25 AM

Oxygen reserves as abundance in AP - Sakshi

సాక్షి, అమరావతి: అత్యవసర సమయంలో ఊపిరి పోసే ఆక్సిజన్‌ నిల్వలు ఆస్పత్రుల్లో తగినంత ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం బాధితులకు ఊరట కలిగిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో చూసినా ఆక్సిజన్‌ లేక అవస్థలే కనిపించేవని, ఇప్పుడు ఎక్కడా కొరత అనే మాటే లేదని, 5 రాష్ట్ర కోవిడ్‌ ఆస్పత్రులు, 13 జిల్లా కోవిడ్‌ ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో అవసరానికి మించి ఆక్సిజన్‌ నిల్వలున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అన్ని బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో 1,685 క్యూబిక్‌ మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ నిల్వలున్నాయి. దీనికి ‘డి’ టైప్‌ సిలిండర్లు అదనం. అవసరమైతే నిల్వలు మరింత పెంచుతామని, ఆక్సిజన్‌ అవసరమైన ప్రతి ఒక్కరికీ అందించి కాపాడటమే లక్ష్యమని  వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో 95 శాతం మంది ఆక్సిజన్‌ అవసరం లేకుండానే డిశ్చార్జి అవుతున్నారు. ఆస్పత్రుల్లో డిశ్చార్జిలు పెరగడంతో ఆక్సిజన్‌ వినియోగం మరింత తగ్గుతోంది. 

అవసరమైతే ఇతర రాష్ట్రాలకూ సరఫరా..
► రాష్ట్రంలోని బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో 1,685 క్యూబిక్‌ మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ నిల్వలు ఉండగా రోజూ 13 – 15 క్యూబిక్‌ మెట్రిక్‌ టన్నులు మాత్రమే వినియోగిస్తున్నారు.
► కరోనా దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఆక్సిజన్‌ నిల్వలు పెంచారు.
► తాజాగా 6,500 ఐసీయూ పడకలకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నట్టు అంచనా.
► కోవిడ్‌ బాధితుల్లో ఆక్సిజన్‌ అవసరమయ్యేవారు 5 శాతం కంటే తక్కువగానే ఉన్నారు.
► అత్యవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేసే స్థాయిలో ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

‘డి’ టైప్‌ సిలిండర్లూ అందుబాటులో..
► రాష్ట్రంలో ‘డి’ టైప్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు 1,265 అందుబాటులో ఉంచారు
► రాష్ట్ర కోవిడ్‌ ఆస్పత్రుల్లో తిరుపతిలో 311, విశాఖపట్నంలో 305, కర్నూలులో 332, విజయవాడలో 317 ‘డి’ టైప్‌ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి.
► ఒక్కో సిలిండర్‌లో 7.1 క్యూబిక్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది. ‘డి’ టైప్‌ సిలిండర్ల ద్వారా 900 క్యూబిక్‌ మెట్రిక్‌ టన్నులకుపైగా ఆక్సిజన్‌ అందుబాటులో ఉంది. 

ఎప్పుడు అవసరమంటే...?
‘ఐసీయూలో ఉన్న పేషెంట్లందరికీ వెంటిలేటర్‌ అవసరం లేదు. శరీరంలో ఆక్సిజన్‌ 93% కంటే తగ్గితే కృత్రిమంగా మాస్కు ద్వారా అందిస్తాం. 85% కంటే తగ్గితే సీ–పాప్‌ మెషీన్‌ ద్వారా ఆక్సిజన్‌ పెడతాం. 70% కంటే తగ్గితే వెంటిలేటర్‌ సపోర్ట్‌తో ఆక్సిజన్‌ అందిస్తాం. ఆరోగ్యవంతులు నిమిషానికి 12 సార్లు గాలి పీల్చుకుంటారు. ఆక్సిజన్‌ శాతం తగ్గితే 35 సార్లు తీసుకుంటారు. ఈ పరిస్థితుల్లోనే ఆక్సిజన్‌ అవసరమవుతుంది’     
– డా.కె.ప్రభాకర్‌రెడ్డి,  హృద్రోగ నిపుణులు, స్టేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement