రేపటి నుంచి జగన్ ‘రైతు భరోసా యాత్ర’
వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎక్కడ జరిగాయని మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సాధించిన విజయమని ఆ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారథి పేర్కొన్నారు. వైఎస్ జగన్.. ఆదివారం నుంచి అనంతపురంలో రైతు భరోసా యాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలోనే బాబు ప్రభుత్వం ఈ ప్రకటన చేసిందన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాకపోయినా జగన్‌మోహన్‌రెడ్డి కృషి, పోరాటాల వల్ల రాష్ట్రంలో రైతాంగానికి న్యాయం జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ‘రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్సార్ సీపీ అసెంబ్లీలో చెబితే.. ఎక్కడ చేసుకుంటున్నారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. అనంతపురానికి చెందిన మంత్రి, చీఫ్ విప్‌లు అసలు ఆత్మహత్యలే జరగలేదన్నారు. ఇంకో సందర్భంలో వ్యవసాయ మంత్రి కేవలం 8 మంది చనిపోతే, వైఎస్సార్ సీపీ మాత్రం 40 నుంచి 50 మంది చనిపోయినట్టు చెబుతోందంటూ విమర్శించారు. ఇప్పుడు అనంతపురం కలెక్టర్ 29 మంది రైతులు, 11 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారికంగా ప్రకటించారు. జగన్ కృషితోనే ప్యాకేజీ రూపంలో రైతుకు న్యాయం జరుగుతోంది’ అని సారథి చెప్పారు.
మైండ్‌సెట్ మార్చుకోవడం సంతోషం
సీఎం చంద్రబాబు తన మైండ్‌సెట్ మార్చుకుని దివంగత వైఎస్ తరహాలో రైతులకు పరిహారం ప్రకటించడంపై తమ పార్టీ సంతోషంగా ఉందని సారథి తెలిపారు. జగన్.. ‘ఉద్యమం’ అన్నప్పుడల్లా ప్రభుత్వం ఏదో ఒకటి చేసేందుకు ప్రయత్నమైనా చేస్తోందని చెప్పారు. తాజాగా రైతు భరోసా యాత్రకు జగన్ సిద్ధమవగానే ప్యాకేజీ ప్రకటించారన్నారు. ‘నీరు-చెట్టు’ కార్యక్రమం.. పంచాయితీలు, మున్సిపాలిటీలకు సర్కారు ఇవ్వాల్సిన నిధులు ఎగ్గొట్టడానికేనని సారథి దుయ్యబట్టారు.
రిఫరెండానికి సిద్ధమా?
తిరుపతి ఉప ఎన్నికలో.. చనిపొయిన ఎమ్మెల్యే కుటుంబంపై సానుభూతితో వైఎస్సార్ సీపీ పోటీ చేయని కారణంగా టీడీపీ విజయం సాధిస్తే.. దాన్ని పాలనకు రిఫరెండమని గొప్పగా చెప్పడం విడ్డూరమని సారథి అన్నారు. టీడీపీకి తమ పాలనపై నమ్మకముంటే 10 స్థానాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అక్కడ పోటీకి తాము సిద్ధమని సవాల్ చేశారు.
రైతు ప్యాకేజీ.. జగన్ విజయమే!
Published Sat, Feb 21 2015 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement
Advertisement