జగజ్జనని, శ్రీవారి పట్టపురాణి శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10గంటలకు ధనుర్లగ్నంలో గజచిత్రపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. రాత్రి మంగళ వాయిద్యాలు, భజన బృందాల ప్రదర్శనలు, కోలాట నృత్యాలు, జియ్యర్ స్వాముల దివ్యప్రబంధ పారాయణం, వేదపండితుల వేదపారాయణం నడుమ అమ్మవారు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.
అద్దాల మండపంలోనే అమ్మవారు
తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు శ్రీపద్మావతి అమ్మవారు(ఉత్సవర్లు) అద్దాల మండపంలోనే కొలువై ఉంటారు. బుధవారం రాత్రి వాహన సేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో కొలువుదీర్చారు. రోజూ ఉదయం అద్దాల మండపం నుంచి అమ్మవారిని తీసుకొచ్చి వాహనసేవలు, ఇతర సేవలు నిర్వహిస్తారు. రాత్రి వాహన సేవ పూర్తవ్వగానే అమ్మవారిని అద్దాల మండపానికి వేంచేపు చేస్తారు. తొమ్మిదో రోజు పంచమీతీర్థం నాడు రాత్రి అమ్మవారిని సన్నిధిలో కొలువుదీరుస్తారు. ఇలా బ్రహ్మోత్సవాల్లో మాత్రమే అమ్మవారి ఉత్సవర్లు సన్నిధిలో కాకుండా అద్దాల మండపంలో కొలువై ఉండడం ఇక్కడి విశేషం.
నేటి వాహన సేవలు
కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం ఉదయం 8గంటలకు పెద్ద శేష వాహనం, రాత్రి 8గంటలకు హంస వాహంపై అమ్మవారు తిరువీధుల్లో విహరిస్తారు. మధ్యాహ్నం 12.30గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో స్నపన తిరుమంజనం, సాయంత్రం 6గంటలకు ఆస్థాన మండపంలో ఊంజల్ సేవ జరుగుతుంది.
తిరుచానూరు: శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం 6గంటలకు చక్రతాళ్వార్ ముందు సాగగా వెనుకనే అమ్మవారికి అభిముఖంగా గజచిత్రపటాన్ని తిరువీధుల్లో ఊరేగిస్తూ ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం ధ్వజ స్తంభానికి తిరుమంజనం నిర్వహించారు. ఉదయం పది గంటలకు ధనుర్లగ్నంలో గజచిత్రపటాన్ని ధ్వజ స్తంభంపై అవరో హింపజేయడంతో తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జేఈఓ పోల భాస్కర్, సీవీఎస్‌ఓ ఆకె.రవికృష్ణ, అదనపు సీవీఎస్‌ఓ శివకుమార్‌రెడ్డి, వీజీఓ అశోక్‌కుమార్‌గౌడ్, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యుటీ ఈఓ పి.మునిరత్నంరెడ్డి, పేష్కా ర్ రాధాకృష్ణ, సూపరింటెండెంట్లు రవి, మాధవకుమార్, ఏవీఎస్‌ఓ పార్థసారథి పాల్గొన్నారు.
బుధవారం రాత్రి చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో బద్రీనారాయణుడిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 12.30గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో వేదోక్తంగా అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. నేత్రపర్వంగా సాగిన స్నపన తిరుమంజన సేవను తిలకించి భక్తులు తన్మయత్వం చెందారు. సాయంత్రం ఆస్థానమండపంలో వేడుకగా ఊంజల్‌సేవ జరిగింది. అనంతరం అమ్మవారిని వాహన మండపానికి వేంచేపు చేసి పట్టుపీతాంబర వజ్రవైఢూర్య ఆభరణాలతో బద్రీనారాయణుడిగా అలంకరించారు. తర్వాత చిన్నశేష వాహనంపై కొలువుదీర్చారు. రాత్రి 8గంటలకు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ అమ్మవారు భక్తులను కటాక్షించారు.
ప్రభుత్వం తరçఫున పట్టు వస్త్రాల సమర్పణ
బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరేళ్లుగా పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం జిల్లాకు చెందిన రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమర నాథరెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శిం చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం మహద్భాగ్యమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఆలయం ఎదుట మంత్రికి తుడా చైర్మన్ నరసింహయాదవ్, టీడీపీ నాయకులు ఆర్సీ.మునికృష్ణ, శ్రీధర్‌వర్మ, శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఆశాలత, చల్లా బాబు తదితరులు స్వాగతం పలికారు.
భక్తులకు మెరుగైన వసతులు – ఈఓ
తిరుచానూరు: శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించామని, ఇందుకోసం అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఫలపుష్ప ప్రదర్శన ప్రారంభించిన తరువాత ఆయన విలేకర్లతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు అదనపు శోభను తెచ్చేలా విద్యుత్ అలంకరణలు, కటౌట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలో మెరుగైన పారిశుద్ధ్యం కల్పించేందుకు అదనపు సిబ్బందిని నియమించామన్నారు. భక్తులందరికీ లభించేలా లడ్డూ ప్రసాదాలను నిల్వ ఉంచినట్లు తెలిపారు. భక్తులందరికీ అన్నప్రసాదం అం దేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సీవీఎస్‌ఓ, తిరుపతి అర్బన్ ఎస్పీతో సమీక్ష నిర్వహించి పంచమితీర్థం రోజున పటిష్ట భద్రతను కల్పించనున్నట్లు ఈఓ తెలిపారు.
వజ్ర కిరీటంలో దర్శనం
శ్రీపద్మావతి అమ్మవారు(మూలవర్లు) బుధవారం వజ్రకిరీటం, సహస్ర లక్ష్మీ కాసుల హారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ధ్వజా రోహణాన్ని పురస్కరించుకుని వజ్రకిరీట అలంకారంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. విశేష పర్వదినాల్లో మాత్రమే అమ్మవారికి వజ్రకిరీటాన్ని అలంకరించడం పరిపాటి.
Comments
Please login to add a commentAdd a comment