padmavathi ammavari karthika bramhostavam
-
అమ్మవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం
చంద్రగిరి/తిరుమల: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు గత నెల 30న ప్రారంభమై బుధవారం చక్రస్నానంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానాన్ని ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్కరిణిలో ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు అమ్మవారి పల్లకి ఉత్సవం నిర్వహించారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు అమ్మవారు, చక్రత్తాళ్వార్లకు చూర్ణాభిషేకం, ఆస్థానం నిర్వహించి వేంచేపుగా పుష్కరిణిలోని పంచమితీర్థం మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం తిరుమల నుంచి తన దేవేరికి శ్రీవారు పంపించిన ముత్తయిదువు సారెతో అమ్మవారు, చక్రత్తాళ్వార్లకు జీయర్ స్వాముల నేతృత్వంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 11.52 నుంచి 12 గంటల మధ్య కుంభలగ్నంలో ఆలయ అర్చకులు చక్రత్తాళ్వార్లకు చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు నిర్వహించిన ధ్వజావరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తం అయ్యాయి. గురువారం సాయంత్రం అమ్మవారికి పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో జవహర్‌రెడ్డి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ప్రభుత్వ విప్, టీటీడీ బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బోర్డు సభ్యుడు పోకల అశోక్ కుమార్, జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో కస్తూరిబాయి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి శ్రీవారి సారె: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు. 825 గ్రాములు బరువుగల కెంపులు, పచ్చలు, నీలం, ముత్యాలు పొదిగిన బంగారు పతకం, రెండు బాజీ బందులు శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పించారు. -
కల్పవృక్ష వాహనం పై పద్మావతి అమ్మవారు
-
చిన్నశేషునిపై చిద్విలాసం
జగజ్జనని, శ్రీవారి పట్టపురాణి శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10గంటలకు ధనుర్లగ్నంలో గజచిత్రపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. రాత్రి మంగళ వాయిద్యాలు, భజన బృందాల ప్రదర్శనలు, కోలాట నృత్యాలు, జియ్యర్ స్వాముల దివ్యప్రబంధ పారాయణం, వేదపండితుల వేదపారాయణం నడుమ అమ్మవారు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. అద్దాల మండపంలోనే అమ్మవారు తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు శ్రీపద్మావతి అమ్మవారు(ఉత్సవర్లు) అద్దాల మండపంలోనే కొలువై ఉంటారు. బుధవారం రాత్రి వాహన సేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో కొలువుదీర్చారు. రోజూ ఉదయం అద్దాల మండపం నుంచి అమ్మవారిని తీసుకొచ్చి వాహనసేవలు, ఇతర సేవలు నిర్వహిస్తారు. రాత్రి వాహన సేవ పూర్తవ్వగానే అమ్మవారిని అద్దాల మండపానికి వేంచేపు చేస్తారు. తొమ్మిదో రోజు పంచమీతీర్థం నాడు రాత్రి అమ్మవారిని సన్నిధిలో కొలువుదీరుస్తారు. ఇలా బ్రహ్మోత్సవాల్లో మాత్రమే అమ్మవారి ఉత్సవర్లు సన్నిధిలో కాకుండా అద్దాల మండపంలో కొలువై ఉండడం ఇక్కడి విశేషం. నేటి వాహన సేవలు కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం ఉదయం 8గంటలకు పెద్ద శేష వాహనం, రాత్రి 8గంటలకు హంస వాహంపై అమ్మవారు తిరువీధుల్లో విహరిస్తారు. మధ్యాహ్నం 12.30గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో స్నపన తిరుమంజనం, సాయంత్రం 6గంటలకు ఆస్థాన మండపంలో ఊంజల్ సేవ జరుగుతుంది. తిరుచానూరు: శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం 6గంటలకు చక్రతాళ్వార్ ముందు సాగగా వెనుకనే అమ్మవారికి అభిముఖంగా గజచిత్రపటాన్ని తిరువీధుల్లో ఊరేగిస్తూ ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం ధ్వజ స్తంభానికి తిరుమంజనం నిర్వహించారు. ఉదయం పది గంటలకు ధనుర్లగ్నంలో గజచిత్రపటాన్ని ధ్వజ స్తంభంపై అవరో హింపజేయడంతో తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జేఈఓ పోల భాస్కర్, సీవీఎస్ఓ ఆకె.రవికృష్ణ, అదనపు సీవీఎస్ఓ శివకుమార్‌రెడ్డి, వీజీఓ అశోక్‌కుమార్‌గౌడ్, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యుటీ ఈఓ పి.మునిరత్నంరెడ్డి, పేష్కా ర్ రాధాకృష్ణ, సూపరింటెండెంట్లు రవి, మాధవకుమార్, ఏవీఎస్ఓ పార్థసారథి పాల్గొన్నారు. బుధవారం రాత్రి చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో బద్రీనారాయణుడిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 12.30గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో వేదోక్తంగా అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. నేత్రపర్వంగా సాగిన స్నపన తిరుమంజన సేవను తిలకించి భక్తులు తన్మయత్వం చెందారు. సాయంత్రం ఆస్థానమండపంలో వేడుకగా ఊంజల్‌సేవ జరిగింది. అనంతరం అమ్మవారిని వాహన మండపానికి వేంచేపు చేసి పట్టుపీతాంబర వజ్రవైఢూర్య ఆభరణాలతో బద్రీనారాయణుడిగా అలంకరించారు. తర్వాత చిన్నశేష వాహనంపై కొలువుదీర్చారు. రాత్రి 8గంటలకు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ అమ్మవారు భక్తులను కటాక్షించారు. ప్రభుత్వం తరçఫున పట్టు వస్త్రాల సమర్పణ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరేళ్లుగా పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం జిల్లాకు చెందిన రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమర నాథరెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శిం చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం మహద్భాగ్యమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఆలయం ఎదుట మంత్రికి తుడా చైర్మన్ నరసింహయాదవ్, టీడీపీ నాయకులు ఆర్సీ.మునికృష్ణ, శ్రీధర్‌వర్మ, శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఆశాలత, చల్లా బాబు తదితరులు స్వాగతం పలికారు. భక్తులకు మెరుగైన వసతులు – ఈఓ తిరుచానూరు: శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించామని, ఇందుకోసం అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఫలపుష్ప ప్రదర్శన ప్రారంభించిన తరువాత ఆయన విలేకర్లతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు అదనపు శోభను తెచ్చేలా విద్యుత్ అలంకరణలు, కటౌట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలో మెరుగైన పారిశుద్ధ్యం కల్పించేందుకు అదనపు సిబ్బందిని నియమించామన్నారు. భక్తులందరికీ లభించేలా లడ్డూ ప్రసాదాలను నిల్వ ఉంచినట్లు తెలిపారు. భక్తులందరికీ అన్నప్రసాదం అం దేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సీవీఎస్ఓ, తిరుపతి అర్బన్ ఎస్పీతో సమీక్ష నిర్వహించి పంచమితీర్థం రోజున పటిష్ట భద్రతను కల్పించనున్నట్లు ఈఓ తెలిపారు. వజ్ర కిరీటంలో దర్శనం శ్రీపద్మావతి అమ్మవారు(మూలవర్లు) బుధవారం వజ్రకిరీటం, సహస్ర లక్ష్మీ కాసుల హారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ధ్వజా రోహణాన్ని పురస్కరించుకుని వజ్రకిరీట అలంకారంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. విశేష పర్వదినాల్లో మాత్రమే అమ్మవారికి వజ్రకిరీటాన్ని అలంకరించడం పరిపాటి. -
ముత్యపుపందిరిపై కాళంగి మర్ధినియై..
తిరుచానూరు : పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజైన శుక్రవారం ఉదయం కాళంగి మర్ధిని రూపంలో ముత్యపుపందిరి వాహనమెక్కి అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున 2 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు, అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి అక్కడే సిద్ధంగా ఉంచిన ముత్యపుపందిరి వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర వజ్రవైఢూర్య స్వర్ణాభరణాలతో అమ్మవారిని కాళంగి మర్ధనం చేస్తున్న శ్రీకృష్ణునిగా అలంకరించారు. అనంతరం 8 గంటలకు భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, జియ్యర్ స్వాముల దివ్య ప్రబంధ ప్రవచనం, వేదపండితుల వేదమంత్రోచ్ఛారణ నడుమ తెల్లని, చల్లని ముత్యపుపందిరిపై అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి 8 గంటలకు సింహవాహనంపై యోగనరసింహుని అలంకరణలో అమ్మవారు భక్తులకు తిరువీధుల్లో సాక్షాత్కరించారు. వాహనసేవలో టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఏఈవో నాగరత్న, వీజీవో రవీంద్రారెడ్డి, ఏవీఎస్వో రెడ్డెప్పరెడ్డి పాల్గొన్నారు. వాహన సేవలో పుస్తకాల ఆవిష్కరణ తిరుచానూరు : పద్మావతి అమ్మవారి ముత్యపుపందిరి వాహన సేవలో భాగంగా శుక్రవారం ఉద యం వాహన మండపం వద్ద టీటీడీ ఈవో రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. అమ్మవారి విశేషాలు, స్త్రోత్రాలు, స్థలపురాణం, బ్రహ్మోత్సవ వైభవం వంటి అంశాలతో రచించిన అలమేలుమంగాపుర వైభవం, శ్రీవారి ఆలయంలోని రాములవారిమేడ విశేషాలతో డాక్టర్ మేడసాని మోహన్ ఈ పుస్తకాలను రచించారు. వీటిని టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, జేఈవో పోలా భాస్కర్, డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య ఆవిష్కరించారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు ఆవిర్భవించిన పద్మసరోవరం(పుష్కరిణి) నిర్మాణమే ఓ అద్భుతం. నాటి కాలపు పనితీరుకు నిదర్శనం. పుష్కరిణి నైరుతి, ఈశాన్యం మూలల్లో భారీ తూములను ఏర్పాటుచేశారు. పొన్నకాలువ నుంచి ఒక పాయ గుండా ప్రవహించే నీరు నైరుతి మూలలోని తూము గుండా పుష్కరిణికి చేరేది. పుష్కరిణి నిండిన తరువాత ఈశాన్యం మూల నుంచి నీరు (ప్రస్తుతం కాలువగడ్డ వీధిలోని కాలువ) గుండా ప్రవహిస్తూ దామినేడు చెరువుకు వెళ్లేది. అలా పుష్కరిణిలో నీళ్లు ఎప్పుడు స్వచ్ఛంగా ఉండేది. అయితే కాలువలు అంతరించాక పుష్కరిణిలోకి నీరు రాకపోవడంతో నిల్వ చేరి పాచిపట్టేది. ఇప్పుడు పుష్కరిణిలోకి బోరు నీటి ద్వారా నీటిని నింపుతున్నారు. ఐదేళ్ల క్రితం సిమెంటు కాంక్రీటు వేశారు. నీళ్లు పరిశుభ్రంగా, తాజాగా ఉండేందుకు ఫిల్టర్లు ఏర్పాటుచేసి క్లోరిన్‌తో శుభ్రం చేస్తున్నారు. భద్రత దృష్ట్యా చుట్టూ ఇనుప గ్రిల్స్‌ను ఏర్పాటుచేశారు.