శ్రీవారి దేవేరితో పాటు చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్న అర్చకులు
చంద్రగిరి/తిరుమల: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు గత నెల 30న ప్రారంభమై బుధవారం చక్రస్నానంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానాన్ని ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్కరిణిలో ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు అమ్మవారి పల్లకి ఉత్సవం నిర్వహించారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు అమ్మవారు, చక్రత్తాళ్వార్లకు చూర్ణాభిషేకం, ఆస్థానం నిర్వహించి వేంచేపుగా పుష్కరిణిలోని పంచమితీర్థం మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు.
అనంతరం తిరుమల నుంచి తన దేవేరికి శ్రీవారు పంపించిన ముత్తయిదువు సారెతో అమ్మవారు, చక్రత్తాళ్వార్లకు జీయర్ స్వాముల నేతృత్వంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 11.52 నుంచి 12 గంటల మధ్య కుంభలగ్నంలో ఆలయ అర్చకులు చక్రత్తాళ్వార్లకు చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు నిర్వహించిన ధ్వజావరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తం అయ్యాయి. గురువారం సాయంత్రం అమ్మవారికి పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో జవహర్‌రెడ్డి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ప్రభుత్వ విప్, టీటీడీ బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బోర్డు సభ్యుడు పోకల అశోక్ కుమార్, జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో కస్తూరిబాయి తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారికి శ్రీవారి సారె: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు. 825 గ్రాములు బరువుగల కెంపులు, పచ్చలు, నీలం, ముత్యాలు పొదిగిన బంగారు పతకం, రెండు బాజీ బందులు శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment