నిరీక్షణ! | Pakistan Coast Guars Arrest Srikakulam Fishermens | Sakshi
Sakshi News home page

నిరీక్షణ!

Published Sat, Dec 1 2018 8:42 AM | Last Updated on Sat, Dec 1 2018 8:42 AM

Pakistan Coast Guars Arrest Srikakulam Fishermens - Sakshi

పాక్‌కు చిక్కిన తమవారి ఫొటోలను చూపిస్తున్న కుటుంబ సభ్యులు

వారి కళ్ల వెంట కన్నీరు ఆగడం లేదు. గుండె దడ తగ్గడం లేదు. నిద్ర లేదు.. తిండి లేదు.. ఏ క్షణంలో ఎలాంటి సమాచారాన్ని వినాల్సి వస్తుందోననే ఒకటే గుబులు.. ఇది పాకిస్థాన్‌  భద్రతా దళాల చెరలో ఉన్న జిల్లాకు చెందిన మత్స్యకార కుటుంబాల పరిస్థితి. బతుకు తెరువు కోసం గుజరాత్‌లోని వీరావలి వెళ్లి.. అక్కడ ఓ చేపల కాంట్రాక్టర్‌ వద్ద పని చేస్తున్న మత్స్యకారులు సముద్రంలో చేపల వేట సాగిస్తూ అనుకోకుండా పాక్‌ జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో వారిని ఆ దేశ కోస్టుగార్డు అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. అయితే వీరి యోగ క్షేమాలు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులతోపాటు.. అధికారుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. కుటుంబీకులు తమ వారి కోసం నిరీక్షిస్తుంటే.. అధికారులు బందీలుగా ఉన్నవారిని క్షేమంగా విడిపించేందుకు చర్యలు ముమ్మరం చేశారు.

ఎచ్చెర్ల క్యాంపస్‌: పాకిస్థాన్‌ భద్రతా సిబ్బందికి పట్టుబడిన జిల్లా మత్స్యకారులు ఇంకా వారి చెరలోనే ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం జిల్లాను.. మత్స్యకారుల కుటుంబాలను కలవరానికి గురిచేస్తోంది. జిల్లాకు చెందిన 14 మందితోపాటు.. విజ యనగరం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన ఏడుగురు.. మొత్తం 21 మంది ఈ నెల 28వ తేదీ పాక్‌ కోస్టు గార్డుకుచిక్కారు. భారత్‌కు పాకిస్థాన్‌ శత్రు దేశం కావడంతో ఎలాంటి ముప్పు తలపెడతారోనని మత్స్యకార కుటుంబీకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎచ్చెర్ల మండలంలోని డి.మత్స్యలేశం, బడివానిపేట గ్రామాలకు చెందిన మత్స్యకార కుటుంబాలు తమ వారికోసం ఎదురు చూస్తున్నారు. కాగా పాక్‌ చెరలో ఉన్న మత్స్యకారుల విషయమై జిల్లా కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో తరచూ సప్రదింపులు జరుపుతున్నారు. మొత్తం 21 మంది మత్స్యకారులు పాకిస్థాన్‌లోని కారాచీలో భద్రతా దళాల కస్టడీలో ఉన్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా.. మత్స్యకారుల  విషయాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి కిమిడి కళావెంకటరావు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని శుక్రవారం ఓ ప్రకటన జారీ చేశారు. మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్‌ రామశంకర్‌ నాయక్‌కు ఇక్కడ పరిస్థితిని జిల్లా కలెక్టర్‌ వివరించారు. ఢిల్లీలోని ఏపీ కార్యాలయం, భారత రాయభార కార్యాలయాలకు సైతం లేఖ రాశారు. మత్స్యకారుల విషయాన్ని భారత హైకమిషన్‌ పాక్‌ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో పాక్‌ చెరలో ఉన్న వారంతా ప్రస్తుత కరాచీలో ఉన్నట్లు జిల్లా అధికారులకు సమాచారం అందింది. కాగా బతుకు తెరువు కోసం గుజరాత్‌ వెళ్లిన మత్స్యకారులు.. చేపల కోసం సముద్రంలోకి బోట్లపై వేటకు వెళ్లారు. అనుకోకుండా పాక్‌ జలాల్లోకి ప్రవేశించి ఆ దేశ కోస్టుగార్డుకు పట్టుబడ్డారు. వీరిపై పాక్‌ భద్రతా దళాలు కేసులు పెడతాయా? పొరపాటున తీరందాటిన మత్స్యకారులను కరుణించి విడిచి పెడతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

పాక్‌ చెరలో ఎవరెవరు ఉన్నారంటే..
  రాష్ట్రానికి చెందిన 21 మంది మత్స్యకారులు ఈ నెల 28వ తేదీన గుజరాత్‌లోని వీరవలి నుంచి నాలుగు బోట్లలో అరేబియన్‌ సముద్రంలో చేపల వేటకు మత్స్యకారులు వెళ్లారు. వీరంతా పొరపాటున భారత్‌ జలాలను దాటి.. పాక్‌ జలాశయాల్లోకి చొరబడ్డారు. దీంతో ఆ దేశ కోస్టుగార్డు వెంబడించి మూడు బోట్లలో ఉన్న 21 మంది పట్టుకుంది. మరో బోటు తప్పించుకొని భారత్‌ జలాల్లోకి వచ్చేసింది. పాక్‌కు పట్టుబడిన వారిలోఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన గనగల్ల రామారావు, కేశం ఎర్రయ్య, కేశం రాజు, మైలపల్లి సన్యాసి, మైలపల్లి రాంబాబు, సూరాడ అప్పారావు, సురాడ కిశోర్, సురాడ కల్యాణ్, చీకటి గురుమూర్తి, సేకియా సుమంత్, ఇదే మండలం బడివానిపేటకు చెంది న వాసిపల్లి రామారావు, బడే అప్పన్న, కొండా వేంకటేశం, తోటపాలెం గ్రామానికి చెందిన మణి, శ్రీకాకుళం దమ్మల వీధికి చెందిన శివ, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం, తిప్పలవలస, భోగాపురం, ముక్కం గ్రామాలకు చెందిన నక్కా అప్పన్న, నక్కా కొండ, నక్కా ధనరాజు, బర్రి బవిరుడు, మైలపల్లి గురువులు ఉన్నారు. ఎచ్చెర్ల మండలానికి చెందిన వారు 14 మంది ఉండడంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ వారి కోసం కళ్లుకాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు. 

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..
పాక్‌ చెరలో ఉన్నవారిలో ఒకే కుటుంబానికి చెందిన సూరాడ అప్పారావు, కుమారులు కిశోర్, కల్యాణ్‌ ఉన్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అప్పారావు భార్య ముగతమ్మ తమ కుటుంబ సభ్యుల యోగ క్షేమాల కోసం అత్రుతగా ఎదురు చూస్తుంది. అలాగే  మైలపల్లి సన్యాసి, అతని కుమారుడు రాంబాబు పాక్‌ భద్రత దళాలకు చిక్కు కున్నావారిలో ఉన్నారు. దీంతో సన్యాసి భార్య ఎర్రమ్మ, చిన్న కుమారుడు రాంబాబు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమవారి యోగాక్షేమాలను అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా మత్స్యశాఖ ఏడీ గోవిందరావు, ఎచ్చెర్ల ఎస్సై కృష్ణ మత్స్యకారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి.. వివరాలను సేకరించారు. కాగా డి.మత్స్యలేశం గ్రామాన్ని జెడ్పీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి శుక్రవారం సందర్శించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. అలాగే జిల్లా కలెక్టర్‌ ధనంజయరెడ్డి కూడా ఉన్నతాధికారులతో నిరంతరం చర్చిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement