‘పాలడుగు’ మృతి కాంగ్రెస్‌కు తీరనిలోటు | 'Paladugu' death, the deficit is desperate to Congress | Sakshi
Sakshi News home page

‘పాలడుగు’ మృతి కాంగ్రెస్‌కు తీరనిలోటు

Published Tue, Jan 20 2015 2:04 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

‘పాలడుగు’ మృతి కాంగ్రెస్‌కు తీరనిలోటు - Sakshi

‘పాలడుగు’ మృతి కాంగ్రెస్‌కు తీరనిలోటు

ఆంధ్రరత్నభవన్‌కు చేరిన పార్థీవ దేహం
నేడు నూజివీడు తరలింపు
 

విజయవాడ సెంట్రల్ : మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాలడుగు వెంకట్రావు పార్థీవ దేహానికి పలువురు నేతలు నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు పాలడుగు పార్థీవ దేహం ఆంధ్రరత్న భవన్‌కు చేరింది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, మాజీమంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ), సిటీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు, కడియాల బుచ్చిబాబు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు ఆకుల శ్రీనివాస్‌కుమార్, నరహరిశెట్టి నరసింహారావు, పార్టీ నాయకులు సుంకర పద్మశ్రీ భక్త, సలీమ్ సర్వేజ్, సి.రమేష్‌తో పాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం మంగళవారం ఉదయం 11 గంటల వరకు ఆంధ్రరత్న భవన్‌లో పాలడుగు భౌతికకాయాన్ని ఉంచనున్నట్లు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు తెలిపారు. అనంతరం నూజివీడు తరలిస్తామన్నారు.
 
విలువలున్న నేత


రాజకీయాల్లో పాలడుగు విలువలున్న నేత అని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ కొనియాడారు. నేటితరం నాయకులకు ఆయన ఆదర్శమన్నారు. రెండు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీలో ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం తనకు ఉందని చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ, పి.వి. నరసింహారావు లాంటి జాతీయస్థాయి నాయకులతో సన్నిహిత సంబంధాలను పాలడుగు కొనసాగించారన్నారు.

 పోరాట యోధుడు

జమీందారీ వ్యతిరేక పోరాటాన్ని నడిపిన ఘనత పాలడుగుకే దక్కుతోందని మాజీమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) అన్నారు. నూజివీడు ప్రాంతంలో పాలడుగు చేసిన భూ పోరాటాల ఫలితంగా ఎందరో పేదలకు భూములు దక్కాయన్నారు. తాను విద్యార్థి నాయకుడిగా ఉండగానే పాలడుగు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే వారని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీగా మొదలైన ఆయన రాజకీయ జీవితం ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే ముగిసిందని చెప్పారు.
 
తీరని లోటు

పాలడుగు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు చెప్పారు. పి.వి. నరసింహారావుతో మంచి సంబంధాలు కలిగిన పాలడుగు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అప్పట్లోనే తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పారన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన పాలడుగును నేటి తరం నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
  విజయవాడ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు మృతికి పలువురు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. వెంకట్రావు మరణం కాంగ్రె స్ పార్టీకి తీరని లోటని కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ఆయన ఎనలేని సేవలందించారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని పిళ్లా కోరారు.
  గాంధీనగర్ : ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు మృతిపై ఏపీ ఫార్మర్ లెజిస్లేటర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కె. సుబ్బరాజు సంతాపం తెలిపారు. నూజివీడు మ్యాంగో మార్కెట్‌తో పాటు కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ అభివృద్ధికి పాటుపడ్డారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement