సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీకి అరుదైన గౌరవం దక్కింది. ఇదేంటని అనుకుంటున్నారా? సీఎం రాక నేపథ్యంలో ప్రతి సారీ తనకు అవమానం జరుగుతోందని వాపోతున్న ఆయనకు శనివారం మాత్రం పోలీసులు పూర్తిస్థాయిలో గౌరవ మర్యాదలు అందించారు. తాను ఎమ్మెల్యే అయినప్పటికీ గతంలో రణస్థలంలో జరిగిన ముఖ్యమంత్రి స్వాగత కార్యక్రమానికి పోలీసులు అడ్డుకున్నారని అప్పట్లో ఆరోపించారు. ఇటీవల జెడ్పీలో జరిగిన కీలక సమావేశానికి హాజరైనప్పుడూ, తాజాగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకట్రావు కుమారుడి పెళ్లి సందర్భంగా సీఎం వస్తారని హెలీప్యాడ్ వద్దకు స్వాగతం పలకడానికి వెళ్లే సమయంలోనూ పోలీసులు తనను అడ్డుకున్నారని ఆయన బహిరంగంగా వాపోయారు. అయితే శనివారం కూడా జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు రాక నేపథ్యంలో శివాజీ తప్పకుండా వస్తారని భావించిన పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఆయన్ను గుర్తుపట్టి కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఓ డీఎస్పీనే ఏర్పాటు చేశారు. శివాజీ వ స్తే అనుమతి పేరిట అడ్డు తగలొద్దని పోలీసు సిబ్బందికి ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యే గన్‌మెన్, డ్రైవర్‌లతో పోలీసులు టచ్‌లో ఉంటూ ‘సార్ ఎక్కడున్నార’ంటూ పదే పదే వాకబు చేసినట్టు తెలిసింది. ఆయన ముఖ కవళికలు ఫలనా విధంగా ఉంటాయని, ఆయన కారు నెంబర్ ఇది అని, ఆయన ఒక వేళ ఏమైనా ఆగ్రహం వ్యక్తం చేస్తే చూసీ చూడనట్టు వ్యవహరించండంటూ పోలీసు అధికారులు తమ కింది స్థాయి సిబ్బందికి సూచించినట్టు తెలిసింది.
గతంలో శివాజీ హాజరైనప్పుడు పోలీసులు గుర్తు పట్టలేకపోవడంతో జిల్లా మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో శనివారం అలా జరగకుండా ప్రతి పోలీసు ఉన్నతాధికారీ జాగ్రత్త వహించారనే గుసగుసలు వినిపించాయి. నరసన్నపేటలో జరిగిన సీఎం బహిరంగ సభ కార్యక్రమానికి శివాజీ స్థానంలో ఆమె కుమార్తె కనిపించింది. అయినా పోలీసులు ఎక్కడా తగ్గకుండా ఆమెనూ గౌరవించారు. అదే విధంగా శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎం రాకకు ఇంకా సమయం ఉండడంతో అప్పటికే అక్కడకు వచ్చిన శివాజీకి ఓ డీఎస్పీ ఏకంగా కుర్చీ వేసి రండిసార్ అంటూ షేక్‌హ్యాండ్ ఇచ్చి గౌరవ మర్యాదలు ప్రవర్తించారు. సీఎం వచ్చిన సమయంలో వేదిక వద్దకు తోడ్కొని వెళ్లారు.
రండి రండి ఎమ్మెల్యే గారూ!
Published Sun, Feb 15 2015 1:14 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement