అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అనంతపురం, ఉరవకొండ, గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, మడకశిర, కదిరి, ధర్మవరం పట్టణాల్లోని 144 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు గైర్హాజరు కావడం గమనార్హం. జిల్లాలో 202 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏపీపీఎస్‌సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. 46,578 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు మొత్తమ్మీద 74.50 శాతం మంది హాజరయ్యారు.
ఉదయం జరిగిన పేపర్-1 పరీక్షకు 34,776 (74.66 శాతం) మంది హాజరయ్యారు. 11,802 మంది గైర్హాజయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షకు 34,635 (74.359 శాతం) మంది హాజరయ్యారు. 11,943 మంది పరీక్ష రాయలేదు. పేపర్-1, 2 రాసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు కావడంతో మొత్తమ్మీద 11,943 మంది అర్హత కోల్పోయారు. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసి పరీక్ష సజావుగా నిర్వహించారు. ఇందుకోసం 2,488 మంది సిబ్బందిని వినియోగించారు.
144 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 144 మంది అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్‌లు, 144 మంది అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్‌లు, 30 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 2014 మంది ఇన్విజిలేటర్‌లు, 12 మంది పరిశీలకులు పరీక్ష నిర్వహణలో పాలుపంచుకున్నారు. అనంతపురం నగరంలోని కేఎస్‌ఆర్ జూనియర్ కళాశాల, ఎస్‌వీ డిగ్రీ కళాశాల, రవీంద్ర భారతి, భాష్యం, ఎల్‌ఆర్‌జీ, వినయ్‌కుమార్ స్కూల్ తదితర పరీక్ష కేంద్రాలను జెడ్పీ సీఈఓ విజయేందిర తనిఖీ చేశారు. సాయిబాబ్ జూనియర్ కళాశాల కేంద్రాన్ని ఏజేసీ వెంకటేశం, శ్రీ చైతన్య స్కూల్, వాణి హైస్కూల్, కేశవరెడ్డి పాఠశాల పరీక్ష కేంద్రాలను జిల్లా పంచాయతీ అధికారి టి.రమణ తనిఖీ చేశారు.
ఆర్టీసీకి రూ1.30 కోట్ల ఆదాయం
అనంతపురం అర్బన్: పంచాయతీ కార్యదర్శుల పరీక్ష వల్ల ఆర్టీసీకి రూ.1.30 కోట్ల ఆదాయం సమకూరింది. పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన అన్ని పట్టణాలకు రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి సుమారు 200 ప్రత్యేక బస్సులను నడిపారు. ఇవి ఆదివారం వేకువజాము నుంచే నడిచాయి. ఈ సర్వీసులను ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం మధుసూదన్ పర్యవేక్షించారు.
ప్రశాంతంగా పంచాయతీ కార్యదర్శుల పరీక్ష
Published Mon, Feb 24 2014 2:58 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement