'లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి'
ఒంగోలు: ‘తెలుగు జాతిని అత్యంత అన్యాయంగా విభజించినవారు ముందుకు వచ్చి లెంపలు వేసుకుని తప్పు చేశామని క్షమాపణ చెప్పేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని’ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రకాశం భవనంలో శనివారం జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులు 143వ జయంతి వేడుకల్లో ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రసంగించారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణ కాదని ఆంధ్రప్రదేశ్ అన్నారు.
రాజధాని లేదు, సచివాలయం లేదు, న్యాయస్థానం లేదు, ఎలాంటి మౌలిక వసతులు లేవన్నారు. ఇప్పటికీ సీఎం చంద్రబాబు ఒక చిన్న అతిథిగృహంలో పనిచేస్తున్నారని తెలిపారు. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, నాలుగు క్యాంపెయిన్లతో ఏపీ అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలుపుతామన్నారు.
2029 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఏపీ ఆవిర్భవిస్తుందని పరకాల పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాను ఇండస్ట్రీయల్ హబ్‌గా మారుస్తామని, జిల్లాలో ఎయిర్‌పోర్ట్‌తో పాటు సీపోర్ట్‌ను ఏర్పాటుకు కృషి చేస్తామని పరకాల హామీ ఇచ్చారు. దొనకొండను ఇండస్ట్రియల్ హబ్‌గా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.