ఫీ‘జులుం’!
వ్యాధి పేరు: ‘మే-జూనో ఫోబియా’. గత ఐదేళ్లుగా పాఠశాల స్థాయి విద్యార్థులున్న తల్లిదండ్రుల్ని పీడిస్తున్న కొత్త వ్యాధి.
వ్యాధి లక్షణాలు: అప్పులు చేయాలనిపించడం. నగలు, వస్తువులు తాకట్టు దుకాణాలవైపు మోజు పెంచుకోవడం. ఆకలి మందగించడం. భోజనం, ఇతర అవసరాలకు ప్రాధాన్యత క్షీణించడం. రాత్రిళ్లు కలలో రూ.వేలు, లక్షల్లో కట్టాల్సిన ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం ధరలు అందనంత ఎత్తున గాల్లో ఉన్నట్టు కనిపించడం.
వ్యాధి సమయం: ఏటా మే నెల ప్రారంభం నుంచి నెమ్మదిగా గుండెల్లో గుబులు రేపుతుంది. మే నెల మధ్యలోకొచ్చేసరికి తీవ్రత పెరుగుతుంది. జూన్ తొలి వారంలోనైతే ఊపిరి సలపనీయదు.
- సాక్షి, విశాఖపట్నం
నగరంలో పేద, మధ్య తరగతి తల్లిదండ్రుల పరిస్థితి ఇంతకంటే ఘోరమేనని చెప్పుకోవచ్చు. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్న వీరి ఆరాటం ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల పాలిట వరమవుతోంది. టెక్నో, ఇ-టెక్నో, డిజీ, ఐఐటీ, ఒలింపియాడ్, స్మార్ట్ ఇలా.. పేర్లు వేరైనా దోపిడీ మాత్రం ఒక్కటే. తల్లిదండ్రుల్ని అదనపు హంగుల పేరిట ఆకర్షించి భారీగా ఫీజులు దండుకోవడమే. ప్రస్తుత విద్యా సంస్థల నైజంగా మారింది. వీటిని నియంత్రించేందుకు పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీలు, ప్రభుత్వ మార్గదర్శకాలున్నా.. విద్యాశాఖ నిర్లిప్త వైఖరి పేదల పాలిట శాపంగా మారుతోంది. జిల్లాలో ఏటా సుమారు రూ.400 కోట్లు మేర విద్య పేరిట వ్యాపారం జరుగుతోంది.
ఏటా పెంచిన ఫీజు రూ.360 కోట్లు!
జిల్లాలో సుమారు 1000 వరకు గుర్తింపు పొందిన, గుర్తింపులేని ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లున్నాయి. వీటిలో సుమారు లక్షా 30 వేల మంది విద్యార్థులు విద్యార్జన చేస్తున్నారు. ఏసీ గదులు, అంతర్జాతీయ ప్రమాణాల పేరిట పెన్, పుస్తకాల మాటెరగని చదువుల కోసం ప్రీ స్కూల్ విద్యార్థులకు కూడా రూ.లక్షకు పైనే ఫీజులు చెల్లించాలి. ఇక్కడంతా కంప్యూటర్‌తో కూడిన డిజిటల్ ప్రపంచమే.. తల్లిదండ్రులు అప్పు చేసైనా రూ.లక్షలు చెల్లించేంత ధైర్యాన్నిస్తోందని నిఫుణులు చెప్తున్న మాట. సాధారణ, మధ్య తరహా విద్యా సంస్థల్లోనైతే నర్సరీ విద్యార్థులు రూ.10 వేలు నుంచి రూ.50 వేలు వరకు ముట్టజెప్పుకోక తప్పదు. ప్రతి తరగతికీ ఫీజులు పెరుగుతూనే ఉంటాయి. నిబంధనల మేరకు ఏటా 10 శాతానికి మించి ఫీజులు పెంచేందుకు లేదు. అయితే నగరంలోని విద్యా సంస్థలు మాత్రం ఏకంగా 30-50 శాతం ఫీజులు పెంచిన దాఖలాలు కోకొల్లలు. ఏటా ఫీజుల రూపంలోనే జిల్లాలో ఏకంగా రూ.360 కోట్ల వరకు వ్యాపారం జరుగుతోందని అంచనా.
పుస్తకాలు, యూనిఫాంకు రూ.60 కోట్లు
ఇక పుస్తకాలు, యూనిఫాం పేరిట అదనపు బాదుడు తప్పనిసరి. స్కూళ్ల ఆవరణలో వీటి అమ్మకాలు నిషేధమైనప్పటికీ, దాదాపు అన్ని ప్రయివేటు యాజమాన్యాలు మే, జూన్ మాసాల్లో తమ పాఠశాలల్నే దుకాణాలుగా మార్చేస్తాయి. ఒక్కో పుస్తకం ఎమ్మార్పీపై కనీసం 30-40 శాతం తక్కువకు తెచ్చుకుని, తల్లిదండ్రులకు మాత్రం పైసా కూడా తగ్గించని పరిస్థితి. దీని ద్వారా ఏటా రూ.60 కోట్లుపైనే వ్యాపారం జరుగుతున్నట్టు సమాచారం.
వీటిని బయట మార్కెట్లో కొనుగోలు చేసుకుంటామంటే అసలు ఒప్పుకోరు. ఫీజులు, పుస్తకాల విక్రయాలపై గతంలో టింపనీ స్కూల్ యాజమాన్య వైఖరికి నిరసనగా తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై అప్పటి కలెక్టర్ రంగంలోకి దిగి తల్లిదండ్రులతో కమిటీ వేశారు. ఫీజులు, ఉపాధ్యాయుల అర్హతలు, వసతులు తదితర అన్ని వివరాల్నీ నోటీసు బోర్డులో పేర్కొనాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఆ దిశగా విద్యాశాఖ చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.
తీర్మానం తప్పనిసరి
ప్రతి స్కూల్లో యాజమాన్యం, సిబ్బంది, తల్లిదండ్రులతో కూడిన గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలి. పాఠశాల నిర్వహణకయ్యే వ్యయం ఆధారంగా ఫీజుల నిర్ణయంపై గవర్నింగ్ బాడీ తీర్మానం తప్పనిసరి. వసూలైన ఫీజుల్లో దేనికి ఎంత వినియోగిస్తున్నారన్న వివరాలు ఏటా ఆడిట్ నిర్వహించి, ఆ నివేదికను ఇన్‌స్పెక్టింగ్ అధికారికి నివేదించాలి. ఇందులో తేడాలున్నట్టు తనిఖీల్లో బయటపడితే కఠిన చర్యలు తప్పవు.
- ఎం.వి.కృష్ణారెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి