తొగుట, న్యూస్‌లైన్: పాఠశాల వాతావరణాన్ని కలుషితం చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను విధుల నుంచి తప్పించాలని తొగుట వాసులు డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల గేటు ముందు ఇద్దరి ఉపాధ్యాయుల పనితీరును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మూడు రోజుల క్రితం పాఠశాలలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సమయంలో ఇంగ్లిష్ టీచర్ సుధాకర్ రెడ్డి ప్రధానోపాధ్యాయుడితో వాదనకు దిగారు.
మీ పనితీరు సరిగ్గా లేదని, దీంతో ఉత్తీర్ణత శాతం పడిపోయిందని నిలదీశారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగింది. నన్నే ప్రశ్నిస్తావా? అంటూ ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ రెడ్డిపై చేయి చేసుకున్నాడు. ఈ విషయాన్ని బాధిత ఉపాధ్యాయుడు డీఈఓకు ఫిర్యాదు చేశారు. శనివారం వివరాలు సేకరించడానికి డిప్యూటీ ఈఓ మోహన్ పాఠశాలకు వచ్చారు. పాఠశాలలోని ఉపాధ్యాయుల నుంచి గొడవకు గల కారణాలను తెలుసుకున్నారు. బాధిత ఉపాధ్యాయుడు సుధాకర్‌రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా పాఠశాల నిర్వహణ, బోధనపై వివరాలు సేకరించాలని డిప్యూటి ఈఓను కోరారు. దీనికి ప్రధానోపాధ్యాయుడు కనుకయ్య అంగీకరించలేదు.
దీంతో సుధాకర్‌రెడ్డి విచారణ ఏకపక్షంగా జరుగుతోందని పెద్ద ఎత్తున నినాదాలు చేశాడు. విచారణ జరుగుతున్న విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. బాధిత ఉపాధ్యాయుడికి అండగా నిలిచారు. ప్రధానోపాధ్యాయుడు కనుకయ్య, మరో ఉపాధ్యాయుడు గోపీనాథ్ వల్ల పిల్లల చదువు సక్రమంగా సాగడంలేదని, పాఠశాల వాతావరణం కూడా చెడిపోతోందని డిప్యూటీ ఈఓకు ఫిర్యాదు చేశారు.
వీరిని తప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో డిప్యూటీ ఈఓ మోహన్ సోమవారం పాఠశాలకు వస్తానని పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి డీఈఓకు నివేదిక సమర్పించి, న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎంఈఓ రాజేశ్వర్‌రెడ్డి, తహశీల్దార్ పద్మారావు, నాయకులు సుధాకర్ రెడ్డి, మల్లేశం, వెంకట్‌రెడ్డి, ఏఎస్‌ఐ మంజూర్ హుస్సేన్ గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ ఉపాధ్యాయులు మాకొద్దంటూ ఆందోళన
Published Sun, Jan 26 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
Advertisement