ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు
కరీంనగర్ : సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే ముఖ్య భూమిక అని, ప్రభుత్వ విద్య పరిరక్షణకు ఉపాధ్యాయులు నడుం బిగించాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో 45 మందికి జ్ఞాపికలు అందించి సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నాణ్యమైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించారని స్పష్టం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్య ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు ఉపాధ్యాయులు సహకరించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయండి
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి ఉపాధ్యాయులను కోరారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సర్వీసు రూల్స్ విషయం త్వరలో తేలిపోతుందన్నారు. దీపావళిలోగా పీఆర్‌సీ వస్తుందని స్పష్టం చేశారు.
నవ తెలంగాణ నిర్మాణానికి బాటలు వేయండి
- జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ
విద్యార్థులకు ఉత్తములుగా తీర్చిదిద్దుతూ నవ తెలంగాణ నిర్మాణం కోసం ఉపాధ్యాయులు బాటలు వేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ సూచించారు. పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పిస్తామని, బోధన, బోధనేతర సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది
- రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే
తెలంగాణ సాధనలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని, విద్యాబోధనలోనూ అదే స్ఫూర్తి ప్రదర్శించాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని సమస్యలు తెలుసున్నారు. ఉపాధ్యాయుడిగా తాను పనిచేశానని, వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
విద్యార్థుల సంఖ్య తగ్గడం విచారకరం
- కలెక్టర్ వీరబ్రహ్మయ్య
ప్రభుత్వ పాఠశాలల్లో భోజనవసతి, యూనిఫామ్, స్కాలర్‌షిప్స్, పుస్తకాలు మెరుగైన వసతులు కల్పిస్తున్నా విద్యార్థుల సంఖ్య తగ్గడం విచారకరమని కలెక్టర్ వీరబ్రహ్మయ్య అన్నారు. గత సంవత్సరం కన్న ఈ విద్యా సంవత్సరం 20 వేల మంది విద్యార్థుల సంఖ్య తగ్గడం బోధపడటం లేదని అన్నారు.
గురువును మించిన దైవం లేదు
- సర్దార్ రవీందర్‌సింగ్, కరీంనగర్ మేయర్
ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ అన్నారు. డీఈవో లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రశేఖర్, డీఎస్పీ రవీందర్, ఎస్‌ఏ పీవో రాజమౌళి, డెప్యూటీ ఈవోలు బి.భిక్షపతి, బి.జయవీర్‌రావు, ఉపాధ్యాయ సంఘాల నేతలు లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, నూలి మురళీధర్‌రావు, కొమ్ము రమేశ్, పోరెడ్డి దామోదర్‌రెడ్డి, కిషన్‌నాయక్ ఉన్నారు.