బంధువులు, ప్రిన్సిపాల్ తదితరులతో మాట్లాడుతున్న ఎస్సై ఎ.దుర్గారావు
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: విద్యార్థినులను దుర్భాషలాడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని స్థానిక నారాయణ పాఠశాలలో విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు బుధవారం ఆందోళనకు దిగారు. ఆందోళన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక నారాయణ పాఠశాలలో లక్ష్మీ ప్రసన్న పదో తరగతి చదువుతుండగా ఆమె చెల్లెలు సుప్రజ 6వ తరగతి చదువుతోంది. ఇటీవల తుపాను కారణంగా వీరిద్దరూ ఒక రోజు పాఠశాలకు రాలేదు. మరునాడు పాఠశాలకు వచ్చిన వీరిని ఉపాధ్యాయులు దుర్భాషలాడుతూ దూషించారు. ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు పాఠశాలలో ప్రిన్సిపాల్‌ను, ఉపాధ్యాయులను అడిగేందుకు రాగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో విద్యార్థినుల తండ్రి కె.రాంబాబు, తల్లి సీతామహాలక్ష్మి, బంధువులు ఆందోళనకు దిగారు. పాఠశాల ముందు వీరు బైఠాయించి తమకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని భీష్మించారు.
పాఠశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉపాధ్యాయులు లేరని, బోధన సరిగా లేదని వీరు ఆరోపించారు. అంతేగాక ఒక తెల్లకాగితంపై తమ పిల్లల 10/10 జీపీఏ రాకపోయినా పర్వాలేదని, తమను రాసిమ్మని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఇక్కడ చదివే కొంతమంది విద్యార్థులను విజయవాడ నారాయణ పాఠశాలకు పంపుతున్నామని దీనికి అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ విధంగానే కొంతమంది విద్యార్థులను విజయవాడ పాఠశాలకు తరలించారని, ఇక్కడ పాఠశాలలో చేర్పించుకుని విద్యార్థులను అక్కడకు తరలిస్తున్నారని, దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, బంధువులు బైఠాయించడంతో ఎస్సై ఎ.దుర్గారావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అయితే తనకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదంటూ తల్లిదండ్రులు రాంబాబు, సీతా మహాలక్ష్మి కచ్చితంగా చెప్పడంతో విజయవాడ నుంచి నారాయణ విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డీన్ భవానీ శంకర్ వస్తున్నారని, సమస్యను పరిష్కరిస్తారని ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఎస్సైకు వివరించారు. దీంతో ఎస్సై తల్లిదండ్రులతో మాట్లాడి భవానీ శంకర్ వచ్చేంత వరకు ఆందోళన విరమించి ఆయన సమక్షంలో సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. సాయంత్రానికి విజయవాడ నుంచి భవానీ శంకర్ వచ్చి విద్యార్థుల ఇంటికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఇకపై విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బంది కలగనీయమని, భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, పాఠ్యాంశాల బోధన విషయంలో కూడా పూర్తిస్థాయి సిబ్బందిని ఏర్పాటు చేశామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. విద్యార్థినులు, వారి తల్లితండ్రులతో మాట్లాడి సమస్య పరిష్కరించామని భవానీ శంకర్ విలేకరులకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment