పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
కర్నూలు(జిల్లా పరిషత్): ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే పలు రకాల వ్యాధులు దరిచేరవని కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఆమె నగరంలోని 50వ వార్డులోని చెన్నకేశవస్వామి దేవాలయం వద్ద, 45వ వార్డులోని బంగారుపేట మున్సిపల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన వార్డు సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు.
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణిలకు సీమంతం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం ఎంతో ఉన్నతమైనదన్నారు. పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ్ కార్యక్రమంలో పాల్పంచుకోవాలన్నారు.
చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసిన చెత్త కుండీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం లోపిస్తే అతి సారం, మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు, జీర్ణాశయం, కాలేయ వ్యాధులు వస్తాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రసాదశర్మ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణచక్రవర్తి, డీఈ నబీరసూల్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు.