
కాసులుండీ మీనమేషాలు
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ప్రజాప్రతినిధులు ఇంకా ఓ అవగాహనకు రాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కొలువుతీరి ఐదు నెలలు గడిచిపోయింది. అందుబాటులో నిధులున్నాయి. అరుునా ప్రతిపాదనలు పంపడంలో ఆలస్యం చేస్తున్న వీరికి తీరిక లేదనుకోవాలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఏలూరు :పార్లమెంట్ నియోజకవర్గాల్లో తొలి విడత అభివృద్ధి పనుల నిమిత్తం కేంద్రం ఒక్కొక్క ఎంపీకి రూ.2.50 కోట్లు గత నెల 7న విడుదల చేసింది. మొత్తంగా చూసుకుంటే ఇద్దరు లోక్‌సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులకు రూ.10 కోట్లు విడుద లయ్యాయి. వాస్తవంగా ప్రతి ఎంపీకి రూ.5 కోట్లను ఎంపీ ల్యాడ్స్ కింద కేటాయిస్తున్న విషయం తెల్సిందే. ఆర్థిక సంవత్సరం ముగింపులో ఉన్న నేపథ్యంలో రూ.2.50 కోట్ల పనులకే ప్రతిపాదనలను కలెక్టర్ల ద్వారా పంపాలని కేంద్రం పేర్కొంది. సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, కమ్యూనిటీ హాళ్లు, స్కూల్ కాంపౌండ్లు, పాఠశాల క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేయవచ్చు. ఉత్తర్వులు వచ్చి నెల కావస్తున్నా మన ఎంపీలు ప్రతిపాదనల రూపకల్పనపై ఇంకా సంప్రదింపులు చేసినట్టు కనిపించడం లేదు. నిధులు మురిగిపోయే ప్రమాదం లేన ప్పటికీ వేగంగా ప్రతిపాదనలు వస్తేనే వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులకు టెండర్లు పిలిచేందుకు కలెక్టర్ బాధ్యతలు అప్పగించడానికి వీలౌతుంది. నేరుగా ప్రభుత్వ శాఖలు ఈ పనులు చేయడానికి వీల్లేదు. ఎంపీలు, కలెక్టర్‌ల సమన్వయంతోనే పనులు సాగాల్సి ఉంటుంది.
సీతమ్మ ముందంజ
ప్రతిపాదనల తయారీ విషయంలో రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అందరి కంటే ముందంజంలో నిలిచారు. ఇప్పటి వరకు రూ.కోటిన్నర వరకు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలను పంపారు. ఇందులో దాదాపుగా ఎనిమిది నియోజకవర్గాల్లోని సీసీ రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైప్‌లైన్ల అభివృద్ధికి అంచనాలు ఇచ్చారు. ఏలూరు ఎంపీ మాగంటిబాబు కూడా రూ.20 లక్షల మేర అభివృద్ధికి అంచనాలిచ్చారు. కాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, నర్సాపురం ఎంపీలు గోకరాజు గంగరాజులు ఇంకా ప్రతిపాదనలు పంపలేదు. మంత్రి నిర్మలా సీతారామన్‌కు సంబంధించి నిధులు రెండు రోజుల క్రితం జమ అయ్యాయని ముఖ్య ప్రణాళిక శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆదర్శ గ్రామాల అభివృద్ధిపై తర్జన భర్జనలు
ఎంపీలు ఒక గ్రామాన్ని, కేంద్రమంత్రులు రెండేసి గ్రామాలను దత్తత తీసుకుని వెనుకబడిన పంచాయతీల్లో సౌకర్యాలను కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన(ఎస్‌ఏజీవై) కింద మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. దీని ప్రకారం మొదటిగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నర్సాపురం మండంలోని తూర్పుతాళ్లు, పెదమైనివానిలంకలను ఎంపిక చేసుకున్నారు. తాజాగా ఏలూరు ఎంపీ మాగంటిబాబు కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం పెదగొన్నూరు, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఉండి మండలం మహదేవపట్నం, రాజ్యసభ్య సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆకివీడు మండలం పెదకాపవరంను, రాజమండ్రి ఎంపీ,సినీనటుడు మాగంటి మురళీమోహన్ గోపాలపురం మండలం సంజీవపురం, సినీనటుడు రాజ్యసభ సభ్యుడు కొణిదల చిరంజీవి మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్‌ను దత్తత గ్రామాలుగా ఎంపిక చేశారు. వారికొచ్చే నిధుల్లో దాదాపుగా రూ.కోటి వరకు ఇక్కడే ఖర్చు చేయవచ్చు? లేదా అంతకంటే ఎక్కువే ఖర్చు చేయడానికి కూడా వెసులుబాటు ఉంది. ఈ విషయంలో ఎలా చేయాలనే దానిపై ఎంపీలు తర్జనభర్జనలు సాగిస్తున్నట్టు తెలియవచ్చింది.