పార్టీ కార్యాలయానికి ప్రభుత్వ స్థలం | Party office in public space | Sakshi
Sakshi News home page

పార్టీ కార్యాలయానికి ప్రభుత్వ స్థలం

Published Thu, Jun 11 2015 11:55 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Party office in public space

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యాలయ భవన నిర్మాణంలోనూ రియల్ వ్యాపార దృక్పథం వీడలేదు. గతంలో కారుచౌకగా కొనుగోలు చేసిన స్థలాన్ని పెద్ద మొత్తానికి విక్రయించి... తద్వారా వచ్చిన సొమ్ముతో సర్కారు స్థలాన్ని తక్కువ మొత్తానికి సేకరించి అక్కడ నిర్మించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకోసం అధికారాన్ని అడ్డం పెట్టుకుని కలెక్టర్‌పై ఒత్తిడి తేవాలని యోచిస్తున్నారు. సర్కారు స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి జిల్లాలోని తమ్ముళ్లు తెగ హడావుడి చేస్తున్నారు. గతంలో పార్టీకోసం కొనుగోలు చేసిన స్థలా న్ని లాభానికి అమ్మి ఆ మొత్తంతో ఇక్కడ నిర్మాణం చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. అయితే ఇందుకు ఒక వర్గం అభ్యంతరం చెబుతోంది. అంతేగాకుండా తక్కువ ధరకు గతంలో అమ్మిన కార్యకర్త తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
 జిల్లా కేంద్రంలో టీడీపీ కార్యాలయ నిర్మించే నిమిత్తం పదిహేనేళ్ల క్రితం బలగ సమీపంలో ఓ ప్రైవేట్ వ్యక్తి నుంచి సుమారు 40సెంట్ల స్థలాన్ని చంద్రబాబు పేరిట జిల్లా నేతలు కొనుగోలు చేశారు. ఆ స్థలంలో అప్పటి సీఎం చంద్రబాబే పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అన్న ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో ప్రైవేట్ వ్యక్తి చాలా తక్కువ ధరకే స్థలాన్ని విక్రయించారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ నేతృత్వంలో స్థలం కొనుగోలు జరిగింది. ఇప్పుడు ఆ స్థలం కోట్ల విలువ చేస్తుంది. దీంతో జిల్లా నాయకులు ఆ స్థలాన్ని మార్కెట్ ధరకు విక్రయించాలని భావించింది. ఊరు మధ్యలో పార్టీ కార్యాలయం ఉంటే కార్యక్రమాలకు ఇబ్బంది అవుతుందన్న సాకుతో దానిని భారీ ధరకు విక్రయించాలని భావిస్తున్నారు. పార్టీపై ఉన్న అభిమానంతో తాను టీడీపీకి స్థలం తక్కువ ధరకు విక్రయించానని, ఇప్పుడు ధర పెరగడంతో విక్రయించి పార్టీనేతలు సొమ్ము చేసుకోవడం ఎంతవరకు సబబని ఆయన వాదిస్తున్నారు.
 
 ప్రభుత్వ స్థలంపై కన్ను
 అయితే కొత్తభవనాన్ని నిర్మించేందుకు సర్కారు స్థలాన్ని ఇప్పుడు ఎంచుకున్నారు. 80ఫీట్ రోడ్డుకు సమీపంలో వాంబే కాలనీకి ఆనుకుని ఉన్న ఓ ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ ధరకే కొనుగోలు చేసి అక్కడ పార్టీ కార్యాలయం నిర్మించాలని నేతలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన మహానాడులో సీఎం చంద్రబాబు దృష్టికి ఇక్కడి నేతలు ఇదే విషయాన్ని తీసుకువెళ్లారు. పాత స్థలాన్ని ఇప్పటికిప్పుడు విక్రయిస్తే భారీ లాభం వస్తుందని, కొత్త కార్యాలయానికి ప్రభుత్వం గతంలో సాం ఘిక సంక్షేమ విభాగం కోసం భద్రపరిచిన సుమారు ఒక ఎకరా 10సెంట్ల స్థలాన్ని కేటాయించేందుకు అవసరమైన జీవో జారీ చేయాలని సూచించినట్టు తెలిసింది.
 
 ఇందుకు సాంఘిక సంక్షేమశాఖ అంగీకరించకపోతే జిల్లా కలెక్టర్ ద్వారా ఒత్తిళ్లు తీసుకువచ్చి పార్టీ కార్యాలయం కోసం త్వరిత గతిన నిర్మాణ పనులు చేపట్టాలని స్థానిక మంత్రి సహా జిల్లా నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ పేరిట ప్రభుత్వం నుంచి సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా స్థలం కొనుగోలు చేయించి అదే స్థలాన్ని మళ్లీ పార్టీకి విక్రయించేలా టీడీపీ నేతలు స్కెచ్ వేసినట్టు తెలిసింది. వాస్తవాని కి ఇలా జరగాలంటే చాలా తతంగమే కా దు... న్యాయపరమై న చిక్కులూ తలెత్తే అవకాశం ఉంది. ఓ ప్రభుత్వ విభాగం కోసం గతంలో ప్రభుత్వమే కొనుగోలు చేసిన స్థలాన్ని మళ్లీ ప్రభుత్వమే వెనక్కు తీసుకుని అదే స్థలా న్ని పార్టీకోసం విక్రయిస్తే ఎవరైనా పబ్లిక్ పిల్ వేసే అవకాశమూ లేకపోలేదు. కానీ టీడీపీ నాయకులు జిల్లా కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకువచ్చి అదే స్థలాన్ని మార్కెట్ ధర కాకుండా ప్రభుత్వ ధరకే విక్రయించేలా ఎత్తుగడ వేశారు.
 
 ఏడాదిలోగా నిర్మాణం
 కొత్త స్థలంలో ఏడాది వ్యవధిలో కాన్ఫరెన్స్‌హాలు, విలేకరుల సమావేశం నిర్వహించేందుకు మరో గది, పార్కింగ్, వైఫై, లైటింగ్, పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో, అధునాతన వ్యవస్థలతో భవిష్యత్ అవసరాలకు అనువుగా నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement