వైఎస్‌ఆర్‌సీపీలోనే కొనసాగుతానని స్పష్టంచేసిన బెరైడ్డిపల్లె ఎంపీపీ
అదే బాటలో మరో ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుడు
పార్టీ మారిన వారిని వ్యతిరేకిస్తున్న ఓటర్లు
హైదరాబాద్‌లోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఎంపీలు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, పలమనేరు నియోజకవర్గ నాయకులతో బెరైడ్డిపల్లె ఎంపీపీ విమల వైఎస్‌ఆర్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పార్టీ మారిన రోజు నుంచీ నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారం రోజులు కాక మునుపే, తన వెంట టీడీపీలో చేరారని చెబుతున్న బెరైడ్డిపల్లె ఎంపీపీ విమల తాను వైఎస్‌ఆర్‌సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అమర్ వెంట వెళ్లిన మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా వైఎస్‌ఆర్‌సీపీ బాట పట్టనున్నారు.
పలమనేరు: ఈ మధ్యనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బెరైడ్డిపల్లె ఎంపీపీ విమల కూడా టీడీపీలో చేరారని వార్తలు వచ్చిన తర్వాత ఆమె స్వగ్రామానికి చేరుకోగానే అక్కడి ఓటర్లు నిలదీశారు. దీంతో ఆమె తనను ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బలవంతంగా తీసుకెళ్లినట్టు చెప్పారు. ఆ విషయాన్ని హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో స్పష్టం చేస్తానన్నారు. ఆ వెంటనే ఆమె వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన మొత్తం ఎంపీటీసీ సభ్యులతో కలసి హైదరాబాద్‌కు బయలుదేరారు. బుధవారం వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ మిథున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి సమక్షంలో తనకు స్థానిక ఎమ్మెల్యే బలవంతంగా టీడీపీ కండువా కప్పించారని చెప్పారు. తనను ఎలా ఏమార్చి పసుపు కండువా వేయించారో పూసగుచ్చినట్టు వివరించిన వైనం మీడియాలో ప్రసారమైంది. దీంతో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ముఖ్యంగా బెరైడ్డిపల్లె నాయకులు డైలమాలో పడ్డారు. ఈ విషయం జిల్లాలో ప్రస్తుతం హాట్‌టాఫిక్‌లా మారింది. ఇదిలాఉండగా, నియోజకవర్గంలోని పలువురు ప్రజాత్రినిధులను కూడా ఎమ్మెల్యే బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీలో వారు కనీసం వారం రోజులు కూడా ఇమడలేకపోతున్నారు. స్థానికుల నుంచి వస్తున్న తీవ్రమైన విమర్శలతో మళ్లీ వైఎస్సార్‌సీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వారు తమ అనుచరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రస్తుతానికి ఓ ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుడు తిరిగి సొంత పార్టీలోకి రానున్నట్టు తెలిసింది.
మరి కొందరు కూడా పునరాలోచన లో పడ్డారు. ఈ పరిణామాలు స్థానిక ఎమ్మెల్యేని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి స్వయం గా వచ్చి పలమనేరులో పార్టీని బలోపేతం చేస్తారని తెలుస్తోంది. పలమనేరు నియోజకవర్గానికి వీరు రంగంలోకి దిగితే నియోజవర్గంలో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా బెరైడ్డిపల్లెలో ఎంపీపీ స్థానాన్ని తమఖాతాలో వేసుకోవాలని కలలు గన్న ఎమ్మెల్యేకి తొలి దెబ్బ తగి లిందని జనం చెవులు కొరుక్కుంటున్నారు.