విచారణ బాధ్యత పోలీసులకు! | Passport investigation Responsibility to police department | Sakshi
Sakshi News home page

విచారణ బాధ్యత పోలీసులకు!

Published Mon, Nov 13 2017 8:18 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

Passport investigation Responsibility to police department - Sakshi

మర్రిపాలెం(విశాఖ ఉత్తరం): పాస్‌పోర్ట్‌ మంజూరు ప్రక్రియ మరింత వేగవంతంగా జరపడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం కొత్త ప్రతిపాదన సిద్ధం చేశారు. ప్రస్తుతం పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో సేవలు విస్తృతంగా అందుతున్నాయి. అయితే పోలీస్‌ విచారణలో జాప్యంతో మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇప్పటి వరకూ పాస్‌పోర్ట్‌ విచారణ బాధ్యతలు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు చేపడుతున్నారు. దరఖాస్తులు వందల సంఖ్యలో వస్తుండటంతో వారికి శక్తికి మించిన భారంగా ఉంటోంది. ప్రతీ జిల్లాలో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసుల కొరతతో విచారణ ఆలస్యంగా జరుగుతోంది. పాస్‌పోర్ట్‌ కార్యాలయంలో సేవలు వేగంగా జరగడం... పోలీసుల విచారణ ఆధారంగా మంజూరు జరపాలని ఆంక్షలు ఉండటంతో మార్పులు జరుపుతున్నట్టు తెలిసింది. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసుల నుంచి పోలీస్‌స్టేషన్లకు బాధ్యతలు బదిలీ చేయాలని చర్చలు జరిగాయి.

నివాసమున్న స్టేషన్‌ పరిధిలోనే...
పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్నాడో అదే పోలీస్‌స్టేషన్‌కు విచారణ బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. పాస్‌పోర్ట్‌ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించిన అభ్యర్థి వివరాలు అదే రోజు సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు చేర్చడంతో వేగవంతంగా విచారణ జరపవచ్చని తీర్మానించారు. పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల నుంచి అభ్యర్థి వివరాలు తొలుతగా పోలీస్‌ కమిషనరేట్‌కు, గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల వివరాలు జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాలకు పంపుతారు. అక్కడి నుంచి స్థానిక పోలీస్‌స్టేషన్లకు విచారణ జరపాలని ఆదేశిస్తారు. ఒకటి నుంచి రెండు రోజుల వ్యవధిలో విచారణ పూర్తి చేయడంతో పాస్‌పోర్ట్‌ మంజూరు సేవలు వేగవంతం అవుతాయనే ఆలోచనలతో పాస్‌పోర్ట్‌ అధికారులు ఉన్నట్టు సమాచారం.

త్వరగా మంజూరే లక్ష్యంగా
ఇప్పటికే విశాఖపట్నం పాస్‌పోర్ట్‌ కార్యాలయం పరిధిలో 2015 ఏడాదిలో సగటున 11 రోజుల వ్యవధిలో అభ్యర్థులకు పాస్‌పోర్ట్‌ అందింది. అదే ఏడాదిలో 2,26,109 దరఖాస్తులు రాగా అందులో 2,24,144 కచ్చితమని నిర్ధారించారు. చివరగా 2,20,168 పాస్‌పోర్ట్‌లు మంజూరు చేశారు. అలాగే 2016 ఏడాదిలో సగటున 9 రోజుల వ్యవధిలో పాస్‌పోర్ట్‌ చేతికి చేరింది. 2,25,225 దరఖాస్తులు పరిశీలనకు రాగా 2,21,947 అనుమతి లభించింది. అదే ఏడాదిలో 2,15,383 పాస్‌పోర్ట్‌లు మంజూరు చేశారు. 2017లో సగటున 5 నుంచి 7 రోజుల వ్యవధిలో పాస్‌పోర్ట్‌ అందించే లక్ష్యంతో యంత్రాంగం కృషి జరుపుతోంది. ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించాలనే ధృడ సంకల్పంతో అధికారులు ఉన్నారు.

త్వరలో అమలులోకి ప్రతిపాదనలు
స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసుల నుంచి స్థానిక పోలీస్‌స్టేషన్లకు బాధ్యతలు బదిలీ చేయాలనే ప్రతిపాదనలు త్వరలో అమలులోకి రానున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. పాస్‌పోర్ట్‌ విచారణకు సంబంధించిన శిక్షణ ఇచ్చేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు సిద్ధపడుతున్నట్టు బోగట్టా. పాస్‌పోర్ట్, పోలీస్‌ ఉన్నతాధికారుల చర్చల అనంతరం విచారణ బాధ్యతలు అప్పగిస్తారని వినికిడి. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆయా రకాల విచారణలతో ఒత్తిడికి గురికావడంతో పాస్‌పోర్ట్‌ విచారణ బాధ్యతల నుంచి ఉపశమనం లభించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement