పట్టాదార్ ‘బ్లాక్' | Pattadar 'black' | Sakshi
Sakshi News home page

పట్టాదార్ ‘బ్లాక్'

Published Wed, Nov 19 2014 1:39 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM

పట్టాదార్ ‘బ్లాక్' - Sakshi

పట్టాదార్ ‘బ్లాక్'

నెల్లూరు రూరల్ మండలానికి చెందిన వెంకటరామయ్య అనే రైతు పాస్ పుస్తకం కోసం ఆరు నెలల కిందట దరఖాస్తు చేసుకున్నాడు. ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. కావలి మండలానికి చెందిన నరసింహులు అనే మరో రైతు దరఖాస్తు చేసుకుని ఎనిమిది నెలలు అయినా ఇంత వరకు పాస్ పుస్తకం మంజూరు చేయలేదు.

వీరే కాదు జిల్లాలో ఇలాంటి వేలాది మంది రైతుల పరిస్థితి ఇదే. కారణం వీరు ముడుపులు ఇవ్వలేదు. పొలం కొన్నాం కదా మన పేరిట పాస్ పుస్తకం మంజూరు చేస్తారనే అమాయకత్వంతో నెలల తరబడి రెవెన్యూ అధికారులు చెప్పే సమాధానం వింటూ తిరుగుతున్నారు.
 
 - కొద్ది నెలల క్రితం బోగోలు పంచాయతీలో పశువుల మేత పొరంబోకు భూమిగా ఉన్న ప్రైవేట్ భూమి సుమారు ఎడెకరాలకు ఓ అనామకుడితో కొందరు బడాబాబులు రిజిస్ట్రేషన్ చేయించుకుని కేవలం రెండు వారాల్లోనే పట్టాదారు పాస్ పుస్తకాలు తెచ్చుకున్నారు. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పత్రాలు, 13 ఏళ్ల ఈసీని పరిశీలించకుండానే రెవెన్యూ అధికారులు పాస్‌పుస్తకాలు మంజూరు చేయడం వెనుక పెద్ద మొత్తంలోనే చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

దీనిపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు వెళ్లిన విషయం విదితమే. తాజాగా వెలుగు చూసిన మరో సంఘటనలో విడవలూరు మండలంలో 66 ఎకరాల ఫారెస్ట్ భూములకు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం చూస్తే రెవెన్యూ అధికారుల పనితీరు ఇట్టే అర్థమవుతోంది.

 
 నెల్లూరు (పొగతోట): జిల్లాలో వ్యవసాయ భూమి యాజమాన్యానికి సంబంధించి రైతుల పాస్ పుస్తకాల ‘బ్లాక్ మార్కెట్’ జోరందుకుంది. భూమి కొనుగోలు చేసిన రైతులు తమ పేరిట పాస్ పుస్తకాలు పొందడం కోసం నెలల తరబడి తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయాలపై జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాస్‌పుస్తకాల మంజూరుకు భారీ మొత్తంలో స్థానిక రెవెన్యూ అధికారులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిబంధనల ప్రకారం పట్టాదార్ పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లో మంజూరు చేయాలి. కాని వీఆర్వో నుంచి తహశీల్దార్ల వరకు సిబ్బంది కొరతనో.. ఖాళీ పాస్ పుస్తకాలు అందుబాటులో లేవనో నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు. ముడుపులు ఇచ్చుకున్న వారికి క్షణాల్లో మంజూరు చేస్తున్నారు.

 జిల్లా వ్యాప్తంగా 15 వందల మంది రైతులు పాస్ పుస్తకాలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 200 మంది రైతులకు మాత్రమే పాస్‌పుస్తకాలు మంజూరు చేశారు. 1,300 మంది రైతులు పాస్ పుస్తకాల కోసం తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదు. ఒక్కొక్క పాస్ పుస్తకం మంజూరు కోసం రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు వసులు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పాస్‌పుస్తకం కోసం రైతులు రిజిస్టర్ సేల్‌డీడ్ పత్రం, 13 ఏళ్లకు సంబంధించిన ఈసీ, రెండు రైతు ఫొటోలతో ఫారం-6ను పూర్తి చేసి తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. రైతు దరఖాస్తుకు తహశీల్దార్ రశీదు ఇస్తారు. 45 రోజుల్లో పాస్ పుస్తకం మం జూరు చేసి ఆర్డీఓకు పంపాలి. ఆర్డీఓ వద్ద 15 రోజుల లోపు ప్రక్రియ పూర్తి చేసి రైతుకు పాస్‌పుస్తకం మంజూరు చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు.  

దళారుల ప్రమేయం : పాస్ పుస్తకాల మంజూరులో దళారుల ప్రమేయం అధికంగా ఉంది. రెవెన్యూ అధికారులు మాత్రం కుంటి సాకులు చెప్పి నెలల తరబడి జాప్యం చేస్తుంటారు. దీంతో దళారులు రంగ ప్రవేశం చేస్తారు. ‘నేను కూడా నీలాగే నెలల తరబడి తిరిగితిరిగి విసిగిపోయా. ఓ వేలాది రూపాయిలు తీసుకెళ్లి చేతిలో పెట్టా.. నాలుగు రోజులకల్లా పిలిచి చేతులో పెట్టారు’ అంటూ ఆ రైతును మానసికంగా సిద్ధం చేస్తారు.

నువ్వు డబ్బులు రెడీ చేసుకో నేను మాట్లాడి త్వరగా పుస్తకాలు తెప్పిస్తానంటూ చెప్పి పంపుతారు. ఇలా దళారులు పొలాన్ని బట్టి మొత్తాన్ని నిర్ణయించి అందులో సగం అధికారులకు ఇచ్చి పనులు చేయిస్తున్నట్లు సమాచారం. లక్షల్లో నగదు చెలిస్తే ప్రభుత్వ భూములకు కూడా పాస్‌పుస్తకాలు మంజూరు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో జిల్లాలో విధులు నిర్వహించిన జాయింట్ కలెక్టర్ సౌరబ్‌గౌర్ పాస్ పుస్తకాలు మంజూరులో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

ఆయన బదిలీ అయిన తరువాత పాస్ పుస్తకాల మంజూరులో చొరవ చూపే వారు లేకపోవడంతో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా స్పం దించి సకాలంలో పాస్ పుస్తకాలు మంజూరు చేసేలా చర్యలు రైతులు కోరుతున్నారు.

 ఎంతటి వారైనా సహించేది లేదు : ఎన్. శ్రీకాంత్, కలెక్టర్
 పాస్ పుస్తకాలు మంజూరులో జాప్యం జరుగుతుందని అనేక మంది రైతులు ఫిర్యాదు చేశారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. పాస్ పుస్తకాల మంజూరులో జాప్యం చేయ డం, నగదు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలకు, తహశీల్దార్లకు ఆదేశాలిచ్చాం. అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులకు సకాలంలో పాస్ పుస్తకాలు మంజూరు చేసేలా చర్యలు చేపడతాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement