Farmer pass book
-
అవినీతి తిమింగళాలు..
సాక్షి, షాద్‌నగర్: ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా రెవెన్యూ సిబ్బందిలో మార్పు కానరావడం లేదు. యథేచ్ఛగా అక్రమాలను కొనసాగిస్తున్నారు. చిన్నచిన్న పనుల కోసం వచ్చే రైతులను లంచాల పేరుతో వేధిస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ రైతు నుంచి కొందుర్గు వీఆర్వో రూ.4లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. హైదరాబాద్‌లోని కేశంపేట వీఆర్వో ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. ఒకే రోజు జరిగిన ఈ రెండు ఘటనలు రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపాయి. భూమి ఆన్లైన్లో నమోదుకు రూ.9లక్షలు లంచం డిమాండ్ కొందర్గు వీఆర్ఓ అనంతయ్య ఇటీవల కేశంపేట నుంచి బదిలీపై వచ్చారు. కాగా, కేశంపేట మండలం దత్తాయపల్లె శివారులో సర్వే నంబర్ 85/ఆ లో 9–07 ఎకరాల విస్తీర్ణం భూమి మామిడిపల్లి చెన్నయ్య పేరున పట్టా ఉంది. వీఆర్ఓ అనంతయ్య చెన్నయ్యకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చే సమయంలో రూ.30 వేలు లంచం తీసుకున్నాడు. ఆ తర్వాత అనంతయ్య జూన్ 13న కొందుర్గు బదిలీపై వచ్చారు. అయితే, రైతు చెన్నయ్యకు సంబందించిన భూమి 2019 జూన్ 18 వరకు ఆన్లైన్లో ఆయన పేరుపైనే కనిపించింది. కానీ, జూన్ 24న ఆన్లైన్లో చూడగా ఆ భూమి కనిపించలేదు. దీంతో బాధిత రైతు సంబందిత వీఆర్ఓ అనంతయ్యను సంప్రదించారు. దీంతో ఆన్లైన్లో నమోదు చేయడం కోసం రూ.9 లక్షలు కావాలని, తనతోపాటు తహశీల్దార్ లావణ్యకు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని అనంతయ్య రైతు చెన్నయ్య, అతడి కుమారుడు భాస్కర్‌కు చెప్పాడు. దీంతో వారు రూ.8 లక్షలు లంచం ఇవ్వడానికి వీఆర్ఓ అనంతయ్యతో ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయమై రైతు చెన్నయ్య కుమారుడు భాస్కర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న వీఆర్ఓ అనంతయ్యకు బుధవారం భాస్కర్ రూ.4 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ దాడల్లో డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు గంగాధర్, మాజీద్, రామలింగారెడ్డి, నాగేంద్రబాబు పాల్గొన్నారు. రూ.9లక్షలు అడిగాడు : భాస్కర్ 1951లో మా నాన్న చెన్నయ్య భూమి కొనుగోలు చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు కూడా వచ్చాయి. ఆన్లైన్లో కూడా నమోదు చేశారు. కానీ, తిరిగి ఆన్లైన్లో నుంచి తొలగించారు. ఆన్లైన్ నమోదు చేయాలంటే రూ.9 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ. 8లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నాం. నాలుగు బృందాలుగా ఏర్పడి.. అవినీతికి పాల్పడుతున్న రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి అవినీతి చేపలను పట్టుకున్నారు. అయితే బుధవారం ఏసీబీ అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి కొందుర్గు, షాద్‌నగర్, కేశంపేట రెవెన్యూ కార్యాలయాలతో పాటుగా, హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్న కేశంపేట తహిసీల్దార్ లావణ్య ఇంటిపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కొందుర్గు తహిసీల్దార్ కార్యాలయంలో రైతు మామిడిపల్లి భాస్కర్ రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో షాద్‌నగర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంతో పాటు కేశంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాల్లో రైతుకు సంబంధించిన భూరికార్డులను అధికారులు పరిశీలించారు. ఐదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం కార్యాలయంలోని కంప్యూటర్లతో పాటుగా, రికార్డులను పరిశీలించారు. భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసి తీసుకోవడం వెనక ఎవరెవరు ఉన్నారన్న విషయంపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. రైతు మామిడిపల్లి భాస్కర్‌కు సంబంధించిన భూమి వివరాలను ఓసారి ఆన్లైన్లో నమోదు చేసి కొన్ని రోజుల తర్వాత ఏవిధంగా తొలగించారన్న విషయంపై ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. వీఆర్వో బదిలీ అయినా కేశంపేట మండలంలో సుమారు పదేళ్ళకు పైగా అనంతయ్య వీఆర్వోగా పనిచేశారు. కేశంపేట మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ, దత్తాయపల్లి, ఇప్పలపల్లి, కేశంపేట గ్రామాల్లో వీఆర్వోగా పనిచేసిన అనంతయ్యపై పలు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కేశంపేటకు చెందిన చందన అనే మహిళా రైతుకు సంబంధించిన భూమిని ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో ఆమె తహిసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఈ వ్యవహారంలో తహిసీల్దార్ లావణ్య, వీఆర్వోలు ఇబ్బందులు పెడుతున్నారని మహిళా రైతు ఆరోపణలు చేసింది. ఇటీవల జిల్లా అధికారులు వీఆర్వోల బదిలీల నేపథ్యంలో అనంతయ్యను కొందుర్గు మండల కేంద్రానికి బదిలీ చేశారు. ఆయన బదిలీ అయినా కేశంపేట మండలానికి సంబంధించిన రైతుల భూ వ్యవహరాల్లో తలదూర్చి ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ఇటీవల షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ రైతు కేశంపేట తహిసీల్దార్ లావణ్య కాళ్లుపట్టుకొని భూ సమస్యను పరిష్కరించాలని వేడుకున్న సంఘటన ఆ రోజు చర్చనీయాంశమైంది. ఆర్డీఓ కార్యాలయ అధికారుల పాత్ర? వీఆర్వో భారీ ఎత్తున లంచం డిమాండ్ చేయడంలో ఆర్డీఓ కార్యాలయంలో పనిచేసే అధికారుల హస్తం ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నా.. తొలగించాలన్నా.. ఆర్డీఓ కార్యాలయం అధికారుల ప్రమేయం కూడా ఉంటుంది. అయితే భూమికి సంబంధించిన వివరాలను ఒకసారి ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత.. తొలగించడంలో ఎవరెవరి పాత్ర ఉంది, లంచాలు ఎవరెవరు డిమాండ్ చేశారు అనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాపు చేపడుతున్నట్లు తెలిసింది. ఉలిక్కిపడిన అధికారులు రెవెన్యూ అధికారులు ఏసీబీకి పట్టుబడటంతో షాద్‌నగర్ డివిజన్లోని అన్ని శాఖల అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కొందరు అధికారులు సమయాని కంటే ముందే కార్యాలయాల నుంచి వెళ్లిపోయారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున లంచం తీసుకుంటూ పట్టుబడటం, ఏకకాలంలో కార్యాలయాల్లో తనిఖీలు జరగడంతో అసలు ఏం జరుగుతుందోనని, ఎవరెవరు మెడకు ఉచ్చుబిగించుకుంటుందనే చర్చ జరుగుతోంది. అవినీతి దందాలో కుమ్మక్కు తహసీల్దార్, వీఆర్వో ఇద్దరు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే రైతుకు సంబంధించిన భూమి వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. భూ వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించాలంటే.. ఎందుకు తొలగించాల్సి వస్తుందోనన్న వివరాలను రైతుకు తెలియజేయడంతో పాటుగా దీనికి సంబంధించిన ప్రొసీడింగ్‌లు విధిగా ఉండాలని, అప్పుడే ఆన్లైన్లో నుంచి తొలగించేందుకు అవకాశం ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కానీ, ఇక్కడ మాత్రం అలాందేమీ లేకుండా ఆన్లైన్లో వివరాలు తొలగించినట్లు తెలుస్తోంది. లంచం అడిగితే సమాచారం ఇవ్వండి ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సూర్యానారాయణ సూచించారు. అధికారులు లంచం అడిగితే 9440446140 సంప్రదించాలని తెలిపారు. -
కాల్మొక్తా.. పాసుపుస్తకం ఇప్పించండి
దుగ్గొండి: రైతుకు ఉచితంగా పట్టాదారు పాసు పుస్తకం అందిస్తామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో రైతులకు న్యాయం జరగడం లేదు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి తనిఖీ నిమిత్తం వచ్చిన వరంగల్ రూరల్ జిల్లా జాయింట్ కలెక్టర్ రావుల మహేందర్‌రెడ్డి కాళ్లపై పడి మైసంపల్లి గ్రామానికి చెందిన రైతు గంగారపు మొగిళి తన పాసుపుస్తకం సమస్యను మొరపెట్టుకున్నాడు. వెంటనే తనకు పట్టా పుస్తకం ఇప్పించి కేసీఆర్ సారు ఇచ్చే పైసలు వచ్చేటట్టు చేయాలని వేడుకున్నాడు. ఇలా పది గ్రామాలకు చెందిన రైతులు తమ సమస్యను జేసీకి వివరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ సమస్యలు ఉన్న భూములకు తప్ప మిగతా రైతుల భూములన్నీంటికి పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తామని చెబుతూ భూములను సర్వే చేయాలని అక్కడికక్కడే సర్వేయర్‌ను ఆదేశించారు. అలాగే, అక్రమాలకు పాల్పడే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రైతులు శాంతించారు. -
పెట్టుబడి జమ
ఆదిలాబాద్‌టౌన్: రైతుబంధు పథకానికి సంబంధించిన నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో చెక్కుల రూపంలో ఇవ్వకుండా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా సోమవారం జిల్లాలోని 1,365 మంది రైతుల ఖాతాల్లో రూ.2.30 కోట్లు జమ చేశారు. అకౌంట్లలో నగదును జమ చేయడం వల్ల రైతులకు కలిగే ఇబ్బందులను ఏఈఓలు రైతుల వద్దకు వెళ్లి సేకరించారు. సోమవారం రైతు ఖాతాల్లో నగదు జమ కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విడతల వారీగా హైదరాబాద్‌లోని ట్రెజరీ కార్యాల యం నుంచి నగదు జమ కానుంది. చాలామంది రైతులు తమ బ్యాంక్ ఖాతాలను ఏఈఓలకు ఇవ్వకపోవడంతో జాప్యం జరిగే అవకాశం లేకపోలేదు. నేరుగా ఖాతాల్లోకి.. రైతుబంధు పథకం రెండో విడత పెట్టుబడి నేరుగా రైతు ఖాతాల్లో సోమవారం నుంచి వ్యవసాయ శాఖ జమ చేసింది. మొదటిరోజు జిల్లాలోని 5,458 ఎకరాలకు సంబంధించి 1,365 మంది రైతులకు గాను రూ.2.30 కోట్లు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం లక్షా 32వేల మంది రైతులు ఉన్నారు. రబీ పంటకు సంబంధించి మొత్తం రూ.2 కోట్ల 10లక్షలు జమ కావాల్సి ఉండగా, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌కు సంబంధించి ఇంకా డబ్బులు జమ కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో 1,14,228 మంది రైతులకు గాను రూ.178.76 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటివరకు ఆయా మండలాల ఏఈఓలు 45,307 మంది రైతుల ఖాతాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు(ఏఓ) వాటిని పరిశీలించి 19,449 నిర్ధారణ చేసి నగదు జమ కోసం ఖాతాలను పంపించారు. మొదటిరోజు తొమ్మిది మండలాలు ఆదిలాబాద్‌రూరల్, బజార్హత్నూర్, బోథ్, గాదిగూడ, గుడిహత్నూర్, జైనథ్, మావల, తలమడుగు, ఉట్నూర్లకు సంబంధించిన 42 గ్రామాల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. నేడు 18 మండలాల రైతులకు.. మొదటి రోజు ప్రయోగాత్మకంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో మంగళవారం జిల్లాలోని 18 మండలాల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 30,873 ఎకరాలకు సంబంధించిన 7523 మంది రైతులకు గాను రూ.12కోట్ల 34 లక్షలు రబీ పంట సాయం ఖాతాల్లో జమ కానుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 20 శాతం మాత్రమే రైతుల ఖాతాలను నగదు జమ కోసం హైదరాబాద్‌కు పంపించారు. మిగతా 80 శాతం ఖాతాలను ఆన్లైన్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఖాతాలు ఇవ్వని రైతులు ఉంటే సంబంధిత మండల ఏఈఓకు అందిస్తే ఆన్లైన్లో నమోదు చేసి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. నగదు జమ చేస్తున్నాం.. రైతుబంధు రెండో విడత పెట్టుబడి సాయం కింద సోమవారం 1,365 మంది రైతుల ఖాతాల్లో రూ.2కోట్ల 30లక్షలు ప్రయోగాత్మకంగా జమ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో మంగళవారం జిల్లాలోని 18 మండలాలకు చెందిన 7523 మంది రైతుల ఖాతాల్లో రూ.12కోట్ల 34 లక్షలు జమ చేయనున్నాం. ఇప్పటివరకు 45,307 ఖాతాలను ఆన్లైన్ చేయడం జరిగింది. నగదు జమ కోసం 19,449 ఖాతాలను పంపించాం. ఇంకా ఖాతాల వివరాలను అందించని రైతులు మండల ఏఈఓలకు అందించాలి. – ఆశ కుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఆదిలాబాద్ -
పట్టాదార్ ‘బ్లాక్'
నెల్లూరు రూరల్ మండలానికి చెందిన వెంకటరామయ్య అనే రైతు పాస్ పుస్తకం కోసం ఆరు నెలల కిందట దరఖాస్తు చేసుకున్నాడు. ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. కావలి మండలానికి చెందిన నరసింహులు అనే మరో రైతు దరఖాస్తు చేసుకుని ఎనిమిది నెలలు అయినా ఇంత వరకు పాస్ పుస్తకం మంజూరు చేయలేదు. వీరే కాదు జిల్లాలో ఇలాంటి వేలాది మంది రైతుల పరిస్థితి ఇదే. కారణం వీరు ముడుపులు ఇవ్వలేదు. పొలం కొన్నాం కదా మన పేరిట పాస్ పుస్తకం మంజూరు చేస్తారనే అమాయకత్వంతో నెలల తరబడి రెవెన్యూ అధికారులు చెప్పే సమాధానం వింటూ తిరుగుతున్నారు. - కొద్ది నెలల క్రితం బోగోలు పంచాయతీలో పశువుల మేత పొరంబోకు భూమిగా ఉన్న ప్రైవేట్ భూమి సుమారు ఎడెకరాలకు ఓ అనామకుడితో కొందరు బడాబాబులు రిజిస్ట్రేషన్ చేయించుకుని కేవలం రెండు వారాల్లోనే పట్టాదారు పాస్ పుస్తకాలు తెచ్చుకున్నారు. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పత్రాలు, 13 ఏళ్ల ఈసీని పరిశీలించకుండానే రెవెన్యూ అధికారులు పాస్‌పుస్తకాలు మంజూరు చేయడం వెనుక పెద్ద మొత్తంలోనే చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు వెళ్లిన విషయం విదితమే. తాజాగా వెలుగు చూసిన మరో సంఘటనలో విడవలూరు మండలంలో 66 ఎకరాల ఫారెస్ట్ భూములకు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం చూస్తే రెవెన్యూ అధికారుల పనితీరు ఇట్టే అర్థమవుతోంది. నెల్లూరు (పొగతోట): జిల్లాలో వ్యవసాయ భూమి యాజమాన్యానికి సంబంధించి రైతుల పాస్ పుస్తకాల ‘బ్లాక్ మార్కెట్’ జోరందుకుంది. భూమి కొనుగోలు చేసిన రైతులు తమ పేరిట పాస్ పుస్తకాలు పొందడం కోసం నెలల తరబడి తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయాలపై జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాస్‌పుస్తకాల మంజూరుకు భారీ మొత్తంలో స్థానిక రెవెన్యూ అధికారులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం పట్టాదార్ పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లో మంజూరు చేయాలి. కాని వీఆర్వో నుంచి తహశీల్దార్ల వరకు సిబ్బంది కొరతనో.. ఖాళీ పాస్ పుస్తకాలు అందుబాటులో లేవనో నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు. ముడుపులు ఇచ్చుకున్న వారికి క్షణాల్లో మంజూరు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 15 వందల మంది రైతులు పాస్ పుస్తకాలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 200 మంది రైతులకు మాత్రమే పాస్‌పుస్తకాలు మంజూరు చేశారు. 1,300 మంది రైతులు పాస్ పుస్తకాల కోసం తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదు. ఒక్కొక్క పాస్ పుస్తకం మంజూరు కోసం రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు వసులు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాస్‌పుస్తకం కోసం రైతులు రిజిస్టర్ సేల్‌డీడ్ పత్రం, 13 ఏళ్లకు సంబంధించిన ఈసీ, రెండు రైతు ఫొటోలతో ఫారం-6ను పూర్తి చేసి తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. రైతు దరఖాస్తుకు తహశీల్దార్ రశీదు ఇస్తారు. 45 రోజుల్లో పాస్ పుస్తకం మం జూరు చేసి ఆర్డీఓకు పంపాలి. ఆర్డీఓ వద్ద 15 రోజుల లోపు ప్రక్రియ పూర్తి చేసి రైతుకు పాస్‌పుస్తకం మంజూరు చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. దళారుల ప్రమేయం : పాస్ పుస్తకాల మంజూరులో దళారుల ప్రమేయం అధికంగా ఉంది. రెవెన్యూ అధికారులు మాత్రం కుంటి సాకులు చెప్పి నెలల తరబడి జాప్యం చేస్తుంటారు. దీంతో దళారులు రంగ ప్రవేశం చేస్తారు. ‘నేను కూడా నీలాగే నెలల తరబడి తిరిగితిరిగి విసిగిపోయా. ఓ వేలాది రూపాయిలు తీసుకెళ్లి చేతిలో పెట్టా.. నాలుగు రోజులకల్లా పిలిచి చేతులో పెట్టారు’ అంటూ ఆ రైతును మానసికంగా సిద్ధం చేస్తారు. నువ్వు డబ్బులు రెడీ చేసుకో నేను మాట్లాడి త్వరగా పుస్తకాలు తెప్పిస్తానంటూ చెప్పి పంపుతారు. ఇలా దళారులు పొలాన్ని బట్టి మొత్తాన్ని నిర్ణయించి అందులో సగం అధికారులకు ఇచ్చి పనులు చేయిస్తున్నట్లు సమాచారం. లక్షల్లో నగదు చెలిస్తే ప్రభుత్వ భూములకు కూడా పాస్‌పుస్తకాలు మంజూరు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో జిల్లాలో విధులు నిర్వహించిన జాయింట్ కలెక్టర్ సౌరబ్‌గౌర్ పాస్ పుస్తకాలు మంజూరులో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆయన బదిలీ అయిన తరువాత పాస్ పుస్తకాల మంజూరులో చొరవ చూపే వారు లేకపోవడంతో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా స్పం దించి సకాలంలో పాస్ పుస్తకాలు మంజూరు చేసేలా చర్యలు రైతులు కోరుతున్నారు. ఎంతటి వారైనా సహించేది లేదు : ఎన్. శ్రీకాంత్, కలెక్టర్ పాస్ పుస్తకాలు మంజూరులో జాప్యం జరుగుతుందని అనేక మంది రైతులు ఫిర్యాదు చేశారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. పాస్ పుస్తకాల మంజూరులో జాప్యం చేయ డం, నగదు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలకు, తహశీల్దార్లకు ఆదేశాలిచ్చాం. అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులకు సకాలంలో పాస్ పుస్తకాలు మంజూరు చేసేలా చర్యలు చేపడతాం.