ఎజెండా పాయింట్లు నాలుగైదే
''చట్టం అందరికీ సమానంగా ఉండేలా చూస్తాం, బ్లాక్ మార్కెటింగ్ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా అరికడతాం, స్త్రీ రాత్రి వేళ కాకపోయినా కనీసం పట్టపగలు అయినా క్షేమంగా బయటకు వచ్చి తిరిగి వెళ్లేలా వచ్చే సమాజాన్ని స్థాపిస్తా. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తాం. కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరితోనైనా చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నా''. ఇదీ స్థూలంగా పవన్ కళ్యాణ్ రెండు గంటలకు పైగా చేసిన ప్రసంగం సారాంశం. తాను పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పే ప్రయత్నం, టీఆర్ఎస్ నాయకుల మీద రివ్వురివ్వున సంధించిన శస్త్రాలు, కాంగ్రెస్ పార్టీ మీద చేసిన విమర్శలు.. ఇవన్నీ కలిసి తొలి భేటీలో అభిమానులను ఉర్రూతలూగించాయి. అయితే, మామూలుగా పది రూపాయలు కూడా చేయని కప్పు కాఫీ 200 రూపాయలుండే నోవోటెల్ హోటల్లో పేదవాళ్ల గురించి చెప్పడం పట్ల మాత్రం కొన్ని విమర్శలు కూడా లేకపోలేవు. అమ్మ తిడుతుంది, కొట్టినా కొడుతుందని, అన్నయ్యకు ఎదురెళ్తున్నానని కుటుంబకథా చిత్రాన్ని కూడా పవన్ ఆవిష్కరించారు. చిన్నతనంలో పోలీసు స్టేషన్ సంఘటనను మాత్రం పూర్తిస్థాయిలో ఆవిష్కరించడంలో కాస్త విఫలమైనట్లే కనిపించింది.
కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీల మీద చేసిన విమర్శలకు మాత్రం జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ''తగలబెట్టండి, నాలుకలు కోస్తాం, అడ్డంగా నరికేయండి అనే పదజాలం తెలంగాణ మాండలికం కాదు. కంచె ఐలయ్య మాటల్లో చెప్పాలంటే అది ప్యూడలిస్టు భావజాలం. ఎకరాకు కోటి రూపాయలు ఆయన ఎలా సంపాదించారో తెలంగాణలో రైతులందరికీ చెబితే వాళ్లు కూడా సంపాదిస్తారు. అమ్మా... కవితా.. నీవు నా చెల్లెలులాంటి దానివి. నీ వేదనను అన్నయ్యలా అర్థం చేసుకున్నా. తెలంగాణ జాగృతి కోసం దేశ విదేశాల్లో సేకరించిన కోట్ల రూపాయల విరాళాలు ఏమయ్యాయో వెల్లడించు'' అని పవన్ చెప్పినప్పుడు జనం అది నోవోటెల్ అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఈలలు, కేకలు వేశారు.
''జంపింగ్ జోకర్స్‌కు నా దగ్గర చోటులేదు. వాళ్లంటే నాకు చిరాకు. అలాంటివాళ్లను నా దగ్గరకు రానివ్వను. వాళ్ల కంటే ఒక సిద్ధాంతానికి కట్టుబడి, మొదట్నుంచి ఇప్పటివరకు ఒకేచోట పనిచేసిన టీఆర్‌ఎస్ నాయకులకు మాత్రం సలాం. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఒకలా, ఆయన వెళ్లిపోయాక మరోలా కొత్త వాదంతో మాట్లాడే కాంగ్రెస్ నేతలు నాకు నచ్చరు. వాళ్లను క్షమించను'' అన్నప్పుడు కూడా ప్రజలు బాగానే స్పందించారు.
అయితే తన పార్టీ విధానాలను జనంలోకి తీసుకెళ్లడానికి మాత్రం పవన్ ఈ రెండు గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శకులు అంటున్నారు. రాత్రి పది గంటల వరకు పోలీసుల అనుమతి ఉన్నా, 9.10 గంటల సమయంలోనే ఆయన తన ప్రసంగం ముగించి, చివర్లో కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో అంటూ ఆవేశం నినాదం ఇచ్చి, వేగంగా వెళ్లిపోతూ.. మర్చిపోయినట్లు మళ్లీ వెనక్కొచ్చి తన ప్రసంగం పుస్తకాన్ని తీసుకుని నవ్వుకుంటూ వేదిక దిగిపోయారు.