పీస్‌.. పీసులు! దటీజ్‌.. చౌదరి | Peace Memorial Hall as NTR Museum | Sakshi
Sakshi News home page

పీస్‌.. పీసులు! దటీజ్‌.. చౌదరి

Published Sat, Oct 21 2017 6:53 AM | Last Updated on Sat, Oct 21 2017 6:53 AM

Peace Memorial Hall as NTR Museum

అనంతపురం న్యూటౌన్‌: మ్యూజియంతో ఆటలు.. స్మారక నిర్మాణానికి రాజకీయ రంగు.. ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి తీరు వివాదాస్పదమవుతోంది. దశాబ్ధాలుగా స్థానిక ఆదిమూర్తినగర్‌లో ఉన్న పురావస్తు శాఖ కార్యాలయాన్ని మరమ్మత్తుల పేరిట ఇటీవల పూర్తిగా కూల్చేశారు. ఏ మాత్రం భద్రత లేని స్థానిక కోర్టు రోడ్డులోని పురావస్తు శాఖ పరిధిలో ఉన్న చారిత్రాత్మక పీస్‌ మెమోరియల్‌ హాలు ప్రాంగణంలోకి మార్చారు. ఈ మార్పును అప్పటి మ్యూజియం ముఖ్య కార్యనిర్వహణాధికారి లక్ష్మిదేవమ్మ(గత జూలై నెలలో పదవీ విరమణ పొందారు) తీవ్రంగా వ్యతిరేకించారు. ఉన్నతాధికారులకు పలుమార్లు లేఖ రూపంలోనూ తెలియజేశారు.

అయితే అభివృద్ధి ముసుగులో అనుకున్నదే చేశారు. రూ.ఏడు కోట్లతో ఓ ప్రయివేటు సంస్థకు నూతన నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ఇదే సమయంలో గత నెల 11న స్థానిక కోర్టు రోడ్డులోని  పీస్‌ మెమోరియల్‌ హాలులోకి మ్యూజియాన్ని మార్పు చేశారు. తాజాగా ఇక్కడొద్దని అధికార పార్టీ మొండికేయడంతో కథ మొదటికొచ్చింది. మ్యూజియం అద్దె భవనంలో ఏర్పాటు చేసుకోవాలని స్వయంగా ఎమ్మెల్యే హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా మ్యూజియం అధికారి రెండు రోజుల క్రితం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు హుటాహుటిన విజయవాడకు బయల్దేరి వెళ్లారు.

పీస్‌ మెమోరియల్‌ హాలుపై పెత్తనం
పాలకులు మారినప్పుడల్లా చరిత్రకు దర్పణంగా నిలిచిన అపురూప కట్టడాల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రస్తుతం మొదటి ప్రపంచ యుద్ధం కాలం నాటి కట్టడమైన పీస్‌ మెమోరియల్‌ హాలుకు ఇలాంటి గతే పట్టింది. 1914–1918 మధ్య ప్రపంచమంతా యుద్ధ భయంతో వణికిపోయింది. ఎప్పుడు ఏమౌతుందోననే ఆందోళనకు తెరదించుతూ వర్‌సైల్స్‌ సంధితో ప్రపంచ యుద్ధం నిలిచిపోయింది. నాటి శాంతికి గుర్తుగా దేశమంతటా స్మారక చిహ్నాలు నిర్మించినట్టే.. జిల్లా కేంద్రంలోనూ పీస్‌ మెమోరియల్‌ హాలు నిర్మితమైంది. స్థానిక కోర్టురోడ్డులోని ఈ ప్రాచీన కట్టడం అనంతర కాలంలో చాలా మార్పులకు లోనైంది.

మూడేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పీస్‌ మెమోరియల్‌ హాలును మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని, నగరవాసులంతా శ్రమదానంతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చి కొన్ని నెలల కిందట మరమ్మతులు ప్రారంభించారు. ముఖ్యంగా ఆయనే దగ్గరుండి 2016 జూలై 16న జిల్లా అ«ధికారుల సమక్షంలో పంచనామా చేసి ఆ భవనాన్ని పురావస్తు శాఖకు అధికారికంగా అప్పగించారు. ఇతరులెవరూ తాకరాదన్న 1960 నాటి జీఓను కూడా ఆ సందర్భంగా ప్రదర్శించారు. అయితే ఇప్పుడు పీస్‌ మెమోరియల్‌ హాలుపై పూర్తి అధికారాలు తనవే అన్నట్టు ఎమ్మెల్యే పెత్తనం చెలాయిస్తున్నారు. ఉన్నఫళంగా మ్యూజియం వస్తువులను తరలించాలనడంతో దీపావళికి ముందు రోజు రాత్రి కార్యాలయాన్ని ప్రకాష్‌రోడ్డులోని ఓ అద్దె ఇంట్లోకి మార్పు చేయాల్సి రావడం గమనార్హం.

ఎన్టీఆర్‌ మ్యూజియంగా చారిత్రాత్మక కట్టడం
చరిత్ర మధుర జ్ఞాపకమైన  పీస్‌ మెమోరియల్‌ హాలుకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని టీడీపీ పెద్దలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు. పీస్‌ మెమోరియల్‌ హాలు ప్రాంగణంలోనే కొత్త శిల్పాలను ఏర్పాటు చేస్తూ దానికి ‘ఎన్టీఆర్‌ మ్యూజియం’గా పేరు మార్చాలనుకున్న ప్రయత్నమే తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అప్పట్లోనే సిటిజన్‌ ఫోరం సభ్యులు, ఇంటాక్‌(ఇండియన్‌ నేషనల్‌ ట్రస్టు ఫర్‌ ఆర్ట్‌ అండ్‌ హెరిటేజ్‌ కల్చర్‌) నిర్వాహకులు తీవ్రంగా వ్యతిరేకించారు. చారిత్రాత్మక కట్టడాలు ఎవరి సొత్తు కాదని, మరో ప్రభుత్వమొస్తే వారు కూడా ఇలానే చేయరని గ్యారెంటీ ఏమిటని ఘాటుగా ప్రశ్నించారు. కొందరైతే పేరు మార్పు తగదని హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ అధికార పార్టీ మొండిపట్టు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

నేడు పురాతన వస్తువుల బహిరంగ వేలం
జిల్లా పురావస్తుశాలలో వినియోగంలో లేని వస్తువులను బహిరంగ వేలం వేస్తున్నట్టు జిల్లా పురావస్తుశాఖ అధికారి గంగాధర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు స్థానిక కోర్టు రోడ్డులోని పీస్‌ మెమోరియల్‌ హాలు ప్రాంగణంలో వేలం నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు వేలంలో పాల్గొనవచ్చన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement