
తుమ్మలగుంటలో ముత్యాల వినాయకుని సిద్ధం చేస్తున్న సినీ కళాకారులు
బాహుబలి సినిమా సెట్టింగ్ అర్టిస్టులతో రూపకల్పన
తిరుపతి రూరల్: రాయలసీమలోనే అతిపెద్ద ముత్యాల వినాయకుడిని చంద్రగిరి నియోజవర్గం తుమ్మలగుంటలో ఏర్పాటు చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సహకారంతో బాల వినాయక కమిటీ, కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం ఆధ్వర్యంలో ఈ మట్టి ముత్యాల వినాయక విగ్రహాన్ని సిద్ధం చేశారు. పర్యావరణానికి అనుకూలంగా 7 వేల కిలోల బంకమట్టితో 34 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పుతో దేశ, విదేశాల నుంచి తెప్పించిన వెలుగులు విరజిమ్మే 25 వేల ముత్యాలతో ఈ భారీ ముత్యాల వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. బాహుబలి సినిమా సెట్టింగులకు పనిచేసిన సినీ కళాకారులు 43 మంది 16 రోజులు శ్రమించి ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 1,001 దీపాలతో అలంకరణ చేశారు. మెరిసే ముత్యాలకు ఈ వెలుగులు తోడుకావడంతో విగ్రహం దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతోంది. మండపంలో 10 వేల మట్టిగాజులతో చేసిన ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విగ్రహం చుట్టూ దశావతారాలతో కూడి న వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశా రు. శంఖు, చక్రం, నామాలతో ఏర్పాటు చేసిన స్వాగత ఆర్చ్‌లు రా...రమ్మంటూ ఆహ్వానం పలుకుతున్నాయి.
1,116 కిలోల భారీ లడ్డు..
తుమ్మలగుంట వినాయకచవితి వేడుకలకు భారీ వినాయక విగ్రహాలతో పాటు లడ్డు ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రికార్డు స్థాయిలో ఈ ఏడాది 1,116 కిలోల భారీ లడ్డును ఏర్పాటు చేశారు. దీన్ని మత సామరస్యానికి నిదర్శనంగా ముస్లింలు అష్రాఫ్, షరీష్ తయారు చేసి స్వామి వారికి మొదటి నైవేద్యంగా సమర్పించనున్నారు. ముత్యాల వినాయకుడిని దర్శించుకుని, ఆది దేవుని ఆశీస్సులు పొందాలని శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోరారు.